రోజుకు 2 లక్షల టన్నులు | 2 million tonnes per day | Sakshi
Sakshi News home page

రోజుకు 2 లక్షల టన్నులు

Published Tue, Jan 20 2015 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

రోజుకు 2 లక్షల టన్నులు

రోజుకు 2 లక్షల టన్నులు

గోదావరిఖని : సింగరేణి వ్యాప్తంగా రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పని చేయాలని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ సూచించారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా అన్ని ఏరియాల జీఎంలు, డెరైక్టర్లతో ఉత్పత్తి, ఉత్పాదకతపై సోమవారం గోదావరిఖని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక భూమిక పోషించాలని అన్నారు.  

రాష్ట్రంలో విద్యుత్ కొరత అధికంగా ఉందని, కొరత తీర్చి 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరముందన్నారు. మూడు, నాలుగేళ్లలో 8,300 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు ఏర్పడే అవకాశముందని, ఇందుకోసం ఏటా 10 శాతం అదనంగా బొగ్గు ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం 16 ఓపెన్‌కాస్ట్‌లు, 32 భూగర్భ గనుల ద్వారా ప్రస్తుతం రోజుకు 1.60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని, దీన్ని 2 లక్షల టన్నులకు పెంచాలని పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయించామని తెలిపారు. గనుల వారీగా లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. ఇందుకు కార్మికులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. నూతన ప్రాజెక్టులైన బెల్లంపల్లి ఓసీపీ-2, జేవీఆర్ ఓసీపీ, ఆర్కేపీ ఓసీ, అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

సమీక్షలో డెరైక్టర్లు ఎస్.వివేకానంద, బి.రమేశ్‌కుమార్, ఎ.మనోహర్‌రావు, పి.రమేశ్‌బాబు, సీపీఅండ్‌పీ చీఫ్ జనరల్ మేనేజర్ కేజే అమర్‌నాథ్, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు జె.నాగయ్య, బి.కిషన్‌రావు, ఆంటోని రాజా, సీహెచ్ విజయారావు, ఎం.వసంత్‌కుమార్, వి.విజయ్‌పాల్‌రెడ్డి, పి.ఉమామహేశ్వర్, జీవీ రెడ్డి, సీహెచ్ నర్సింహారెడ్డి, జె.రామకృష్ణ, జె.సాంబశివరావు, ఎస్.శరత్‌కుమార్, డాక్టర్ కె.ప్రసన్నసింహా, ఎం.కృష్ణమోహన్, సీహెచ్ వరప్రసాద్, పి.రవిచంద్ర, ఎల్.బాలకోటయ్య, ఎ.ఆనందరావు, కె.బసవయ్య, ఏరియా సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement