కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.50కోట్లు | rs.50 crores sanctioned for kothagudem-sathupalli | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.50కోట్లు

Published Thu, Jul 6 2017 12:16 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.50కోట్లు

కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.50కోట్లు

► మొదటి విడతగా దక్షిణ మధ్యరైల్యే జీఎంకు అందజేసిన సీఎండీ
► 2019 నాటికి పూర్తిచేయాలని కోరిన ఎన్‌.శ్రీధర్‌


రుద్రంపూర్‌: కొత్తగూడెంనుంచి సత్తుపల్లి రైల్వే బ్రాడ్‌గేజ్‌లైన్‌ నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం మొదటి విడతగా రూ.50 కోట్లను విడుదల చేసింది. బుధవారం ఆ చెక్కును దక్షిణ మధ్యరైల్యే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌కు సింగరేణి  సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ సికింద్రబాద్‌లోని రైల్వే కార్యాలయంలో అందజేశారు. 2019లో సత్తుపల్లిలోని క్రిష్టారం ఓసీ ప్రారంభం అయ్యేలోగా ఈ రైల్వేలైను పూర్తిచేయాలని, తద్వారా బొగ్గు రవాణాకు సులువు అవుతుందని రైల్వే జీఎంను సీఎండీ కోరారు. ఈ రైల్వేలైన్‌ పొడవు 53.20 కిలోమీటర్లు కాగా.. దీని నిర్మాణానికి అయ్యే దాదాపు రూ. 620 కోట్ల ఖర్చును భరించేందుకు యాజమాన్యం ముందుకువచ్చింది. దీనిలో భాగంగానే మొదటి విడతగా రూ. 50కోట్ల చెక్కును సీఎండీ అందజేశారు.

రవాణా సులువు..: ఈ రైల్వేలైన్‌ పూర్తయితే కొత్తగూడేనికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తుపల్లిలోగల గనుల నుంచి అధిక మొత్తంలో బొగ్గును రవాణా చేసే అవకాశం ఉంటుంది. సత్తుపల్లిలోని జేవీఆర్‌ఓసీనుంచి ప్రస్తుతం సంవత్సరానికి 55 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తోపాటు రవాణా జరుగుతుంది. త్వరలో ఇక్కడ కొత్త ఓసీ ప్రారంభం కాబోతున్నందున 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. అయితే రైల్వే లైన్‌ పూర్తయితే అంతే మొత్తలో రవాణా చేయడం సులువు అంతుంది. ఈ బొగ్గును రైల్వేద్వారా విద్యుత్‌ ప్లాంట్లకు సరఫరా చేస్తారు. ప్రధానంగా పాల్వంచలోని కేటీపీఎస్, మణుగూరు (పినపాక)లో నిర్మించబోయే భద్రాద్రి పవర్‌ప్లాంట్, నల్గొండలో నిర్మించబోయే యదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటుకు ఇక్కడినుంచే నేరుగా రైల్వే ద్వారా రవాణా జరుగుతుంది. దీని వల్ల కొంతవరకు రోడ్డు ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం తగ్గనుంది.

పురోగతిపై సమీక్ష కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వేలైన్‌ పురోగతిపై రైల్వే కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూసేకరణ పూర్తిచేశామన్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించే బ్రిడ్జిలకు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు. భూసేకరణ పూర్తయిన నాటి నుంచి రెండేళ్లలోపు రైల్వేలైన్‌ను నిర్మించి ఇస్తామని జీఎం వినోద్‌కుమార్‌ తెలిపారు. అటవీ, ప్రైవేటు భూముల సేకరణ విషయంలో సింగరేణి తనవంతు సహకారం అందించాలని కోరారు. ఇందుకు స్పందించిన సీఎండీ సింగరేణి సంస్థనుంచి ఎటువంటి సాయం కావాలన్న చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే రైల్వేలైన్‌ నిర్మాణానికి కావాల్సిన నిధులను కూడా ఎప్పటికప్పుడు అందిస్తామని శ్రీధర్‌ తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు ఈడీ (కోల్‌ మూవ్‌మెంట్‌) శ్రీనివాస్‌రావు, జీఎం కో ఆర్డినేషన్‌ నాగయ్య, రైల్వే అధికారులు ఎన్‌.మధూసుధన్‌రావు, ఎన్‌ఏసీఓ పద్మిని రాధాకృష్ణన్, చీఫ్‌ ఇంజనీర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ జి.బ్రహ్మానందరెడ్డి, చీఫ్‌ ప్రైట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ నాగయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement