గృహ, వాహన రుణాలు మరింత చౌక! | SBI cuts lending rate by 0.90 per cent; automobile, home loans | Sakshi
Sakshi News home page

గృహ, వాహన రుణాలు మరింత చౌక!

Published Mon, Jan 2 2017 12:32 AM | Last Updated on Tue, Aug 28 2018 8:05 PM

గృహ, వాహన రుణాలు మరింత చౌక! - Sakshi

గృహ, వాహన రుణాలు మరింత చౌక!

ఎస్‌బీఐ రుణ రేట్లు 0.90% తగ్గింపు
అదే బాటలో పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంకులు
జనవరి 1 నుంచే అమల్లోకి..


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు బ్యాంకులు వడ్డీ రేట్ల కోత దిశగా చర్యలు ప్రారంభించాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ తన ప్రామాణిక లెండింగ్‌ రేటును 90 బేసిస్‌ పాయింట్లు (0.90%) తగ్గిస్తూ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే బాటలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), యూనియన్‌ బ్యాంకులు సైతం నడిచాయి. పీఎన్‌బీ 70 బేసిస్‌ పాయింట్లు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా 90 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించాయి. దీనివల్ల గృహ, వాహన రుణాలు మరింత చౌకగా మారనున్నాయి. డీమోనిటైజేషన్‌ నేపథ్యంలో భారీ స్థాయిలో డిపాజిట్లు రావడంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రుణ విపణిని పెంచుకునే వ్యూహంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు ఈ స్థాయిలో లెండింగ్‌ రేటును తగ్గించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం.

నెల నుంచి మూడేళ్ల రుణాలపై...
ఎస్‌బీఐకి చెందిన నిధుల సేకరణ వ్యయం ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను ఏడాది కాల వ్యవధికి ప్రస్తుతం 8.90 శాతం ఉండగా, తాజాగా  దాన్ని 8 శాతానికి తగ్గించింది. రెండేళ్లు, మూడేళ్లు కాల వ్యవధిగల రుణాలపై ఇంతే మొత్తం తగ్గిస్తూ 8.10, 8.15 శాతానికి తీసుకొచ్చింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల కాలావధి కలిగిన రుణాలపైనా వడ్డీ రేటును 0.9 శాతం తగ్గించింది. రేట్ల తగ్గింపు ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తెలిపింది.  

పీఎన్‌బీ ఏడాది కాల వ్యవధిగల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 0.7 శాతం తగ్గించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్‌ 8.45 శాతానికి దిగి వచ్చింది. మూడేళ్లు, ఐదేళ్ల రుణాలపైనా ఇంతే మొత్తం తగ్గించడం ద్వారా ఎంసీఎల్‌ఆర్‌ను 8.60 శాతం, 8.75 శాతాలకు సవరించింది. గత నవంబర్‌ నుంచి తాము మొత్తం 0.85 శాతం మేర ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించామని పీఎన్‌బీ తన ప్రకటనలో తెలిపింది. కాగా, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కూడా ఏడాది కాల వ్యవధిగల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 0.65 శాతం నుంచి 0.90 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. దీంతో గతేడాది కాల వ్యవధిగల రుణాలపై ప్రామాణిక వడ్డీ రేటు 8.65 శాతానికి తగ్గింది. గతవారం ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌తోపాటు ఐడీబీఐ బ్యాంకు సైతం లెండింగ్‌ రేటును తగ్గించిన విషయం తెలిసిందే.

త్వరలో డిపాజిట్లపైనా కోత
‘‘డిపాజిట్ల రాక అధిక స్థాయిలో ఉన్నందున బ్యాంకుల వద్ద లిక్విడిటీ అధిక స్థాయికి చేరింది. దీంతో లెండింగ్‌ రేటు తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నాం. దీనివల్ల రుణాలకు డిమాండ్‌ పెరుగుతుంది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా సమీక్షిస్తాం’’ అని ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు.

ఆర్థిక రంగానికి సానుకూలం...
బ్యాంకుల నిర్ణయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ఆహ్వానించారు. దీనివల్ల రుణాల జారీ ఊపందుకుంటుందని, ఇది ఆర్థిక రంగానికి సానుకూలమన్నారు. డీమోనిటైజేషన్‌ తర్వాత వడ్డీ రేట్లను తగ్గించే ధోరణి మొదలైందని, బ్యాంకుల వద్ద గణనీయ స్థాయిలో తక్కువ వ్యయ ఆధారిత నిధులు ఉన్నట్టు ట్వీట్‌ చేశారు.

ఎంసీఎల్‌ఆర్‌ అంటే...
బ్యాంకులు గతేడాది జూన్‌లో బేస్‌ రేటు విధానం నుంచి నూతన బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు అయిన ఎంసీఎల్‌ఆర్‌కు మళ్లాయి. ఆర్‌బీఐ రేట్ల తగ్గింపును రుణగ్రహీతలకు పూర్తి స్థాయిలో బదిలీ చేసేందుకు ఈ విధానాన్ని అప్పటి గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తీసుకొచ్చారు. ఎంసీఎల్‌ఆర్‌ అనేది బ్యాంకులు కొత్తగా జారీ చేసే రుణాలపై అమలు చేసే కనీస వడ్డీ రేటు. అంటే కచ్చితంగా ఇంతే మొత్తంపై రుణాలు జారీ చేయాలని లేదు. కాకపోతే ఇంతకంటే తక్కువ రేటుకు బ్యాంకులు రుణాలను ఇవ్వవు. ఈ విధానం కింద బ్యాంకులు నిధుల సేకరణ వ్యయాలు, వివిధ కాలావధిగల డిపాజిట్లపై అయ్యే వ్యయాలు, రుణాల జారీకి అయ్యే వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయిస్తాయి. రాజన్‌ తన హయాంలో 1.5 శాతం మేర రేట్లను తగ్గించగా... తర్వాత వచ్చిన ఉర్జిత్‌ పటేల్‌ మరో పావు శాతం మేర కోత విధించారు. అయినా బ్యాంకులు వీటిలో సగం శాతం కూడా కస్టమర్లకు బదిలీ చేయని విషయం గమనార్హం.

రుణ రేట్లు ఎంత తగ్గొచ్చు...
బ్యాంకులు సాధారణంగా గృహ రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌పై 0.25–0.60 శాతం స్ప్రెడ్‌తో గృహ రుణ వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో కాలావధిగల ఎంసీఎల్‌ఆర్‌ ఆధారంగా రుణాలిస్తున్నాయి. ప్రధాన బ్యాంకులైన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఒక ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ రేటుపై 25 శాతం స్ప్రెడ్‌ వేసుకొని గృహ రుణాలపై రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్‌బీఐకి సంబంధించిన ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ ఇప్పటివరకూ 8.9 శాతం అయినందున, 75 లక్షల వరకూ తీసుకునే గృహ రుణంపై 9.15 శాతం వడ్డీని విధిస్తున్నది. మహిళలకైతే ఇది 9.10 శాతం. ఇప్పుడు తాజాగా ఎస్‌బీఐ ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను 8 శాతానికి తగ్గించినందున గృహ రుణంపై రేటు 8.25 శాతం (మహిళలకు 8.2 శాతం) వుండవచ్చు. వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, కార్పొరేట్‌ రుణాలు...ఇలా వివిధ రకాల రుణాలకు బ్యాంకు వివిధ కాలావధులకు సంబంధించిన ఒక ఎంసీఎల్‌ఆర్‌ను బెంచ్‌మార్క్‌గా పెట్టుకుని, దానికి కొంత స్ప్రెడ్‌ను జతచేసి బ్యాంకులు రేట్లను నిర్ణయిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement