న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. యూటీఐ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)లో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. పురాతన ఎంఎఫ్ యూటీఐ స్పాన్సర్స్ అయిన ఈ సంస్థలు వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూటీఐ ఎంఎఫ్‌ను ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఎల్‌ఐసీ, బీవోబీ ఉమ్మడిగా ప్రమోట్ చేశాయి.
ఈక్విటీలో మొత్తం 45.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అనుబంధ సంస్థ ద్వారా మరో ప్రమోటర్ టీ రోవ్ ప్రైస్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్(యూకే) సైతం 23 శాతం వాటాను పొందింది. 2020లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ సంస్థలన్నీ యూటీఐ ఎంఎఫ్‌లో దాదాపు 3.9 కోట్ల షేర్లను విక్రయించాయి. వెరసి ఐపీవో నిధులను ప్రమోటర్ సంస్థలే అందుకున్నాయి. 2019 డిసెంబర్‌లో సెబీ ఆదేశాలమేరకు వాటాను తగ్గించుకునే బాటలో ఐపీవోను చేపట్టాయి.
కాగా.. ప్రభుత్వ సంస్థలు(పీఎస్‌ఈలు) అనుబంధ సంస్థలలో వాటాలను విక్రయించాలనుకుంటే ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపించవచ్చని గతేడాది దీపమ్ స్పష్టం చేసింది. తద్వారా ఇందుకు అనుమతించింది. ఈ బాటలో తాజాగా సంబంధిత మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటి ప్రకారం వాటాల విక్రయ ప్రతిపాదనలు అందాక ఆయా మంత్రిత్వ పాలనా శాఖలు తొలుత పరిశీలించి దీపమ్‌కు బదిలీ చేస్తాయి. ఆపై దీపమ్ వీటికి ముందస్తు అనుమతిని మంజూరు చేస్తుంది.
1964లో..
పార్లమెంటు యూటీఐ ఎంఎఫ్ 1964లో ఏర్పాటైంది. యూఎస్ 64 పథకం మూతపడ్డాక 2002లో పార్లమెంట్ యూటీఐ చట్టాన్ని ఆమోదించింది. దీంతో యూటీఐను సూటీ(ఎస్‌యూయూటీఐ), యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ పేరుతో రెండు సంస్థలుగా విభజించారు. యాక్సిస్ బ్యాంక్‌కు సూటీలో 11.8 శాతం వాటా ఉంది. ఇక యూటీఐ ఎంఎఫ్‌లో నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి టీ రోవ్ ప్రైస్ 2009లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు 14 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఒక్కో సంస్థ విడిగా 6.5 శాతం వాటా చొప్పున విక్రయించాయి.
Comments
Please login to add a commentAdd a comment