కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తమ బ్యాంకులోని ఖాతాలను కొనసాగించేలా ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బ్యాంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయా బ్యాంకు అకౌంట్‌లను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ తరుణంలో బ్యాంకులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు కొనసాగించేలా చర్చలు జరుపుతున్నాయి.
ఈ మేరకు రెండు బ్యాంకులు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం..‘కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన రెండు బ్యాంకుల్లోని ఖాతాలను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే దీనిపై చర్చలు సాగుతున్నాయి. సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకుంటాం’ అని తెలిపాయి.
ఇదీ చదవండి: ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్.. కర్ణాటక సంచలన నిర్ణయం
ఇటీవల కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డ్, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు చెందిన మొత్తం రూ.22 కోట్ల డిపాజిట్‌లను ఉపసంహరించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలోనూ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల డిపాజిట్లు, పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం ఆయా బ్యాంకులను హెచ్చరించింది. కానీ వాటి తీరు మార్చుకోలేదు. దాంతో ఇటీవల రూ.22 కోట్లు ఉపసంహరించుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ముగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు సెప్టెంబర్ 20, 2024 చివరి తేదీగా ఖరారు చేశారు. దీనిపై రెండు బ్యాంకుల అధికారులు ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment