
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ బ్యాంకుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఖాతాలను మూసివేయాలని బుధవారం అన్ని శాఖలను ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు, పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఈ బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులు కూడా పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఆయా బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అవకతవకలు, అనధికార లావాదేవీలు జరిగినట్లు రోపణలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఖాతాలను మూసివేయాలనే నిర్ణయానికి దారితీసిందని ప్రభుత్వం తెలిపింది. రూ.187 కోట్ల కార్పొరేషన్ నిధులకు సంబంధించి అనధికార లావాదేవీలు జరిగిందని, ఇందులో రూ.88.62 కోట్లు ఐటీ కంపెనీల ఖాతాల్లోకి, హైదరాబాద్‌లోని సహకార బ్యాంకుకి బదిలీ అయినట్లు తేలిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment