uti mutual fund
-
వాటా విక్రయం! ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ రెడీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. యూటీఐ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)లో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. పురాతన ఎంఎఫ్ యూటీఐ స్పాన్సర్స్ అయిన ఈ సంస్థలు వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూటీఐ ఎంఎఫ్‌ను ఎస్బీఐ, పీఎన్బీ, ఎల్ఐసీ, బీవోబీ ఉమ్మడిగా ప్రమోట్ చేశాయి. ఈక్విటీలో మొత్తం 45.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అనుబంధ సంస్థ ద్వారా మరో ప్రమోటర్ టీ రోవ్ ప్రైస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్(యూకే) సైతం 23 శాతం వాటాను పొందింది. 2020లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ సంస్థలన్నీ యూటీఐ ఎంఎఫ్‌లో దాదాపు 3.9 కోట్ల షేర్లను విక్రయించాయి. వెరసి ఐపీవో నిధులను ప్రమోటర్ సంస్థలే అందుకున్నాయి. 2019 డిసెంబర్లో సెబీ ఆదేశాలమేరకు వాటాను తగ్గించుకునే బాటలో ఐపీవోను చేపట్టాయి. కాగా.. ప్రభుత్వ సంస్థలు(పీఎస్ఈలు) అనుబంధ సంస్థలలో వాటాలను విక్రయించాలనుకుంటే ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపించవచ్చని గతేడాది దీపమ్ స్పష్టం చేసింది. తద్వారా ఇందుకు అనుమతించింది. ఈ బాటలో తాజాగా సంబంధిత మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటి ప్రకారం వాటాల విక్రయ ప్రతిపాదనలు అందాక ఆయా మంత్రిత్వ పాలనా శాఖలు తొలుత పరిశీలించి దీపమ్‌కు బదిలీ చేస్తాయి. ఆపై దీపమ్ వీటికి ముందస్తు అనుమతిని మంజూరు చేస్తుంది. 1964లో.. పార్లమెంటు యూటీఐ ఎంఎఫ్ 1964లో ఏర్పాటైంది. యూఎస్ 64 పథకం మూతపడ్డాక 2002లో పార్లమెంట్ యూటీఐ చట్టాన్ని ఆమోదించింది. దీంతో యూటీఐను సూటీ(ఎస్‌యూయూటీఐ), యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో రెండు సంస్థలుగా విభజించారు. యాక్సిస్ బ్యాంక్‌కు సూటీలో 11.8 శాతం వాటా ఉంది. ఇక యూటీఐ ఎంఎఫ్‌లో నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి టీ రోవ్ ప్రైస్ 2009లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు 14 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఒక్కో సంస్థ విడిగా 6.5 శాతం వాటా చొప్పున విక్రయించాయి. -
యూటీఐ మ్యూచువల్ ఫండ్ పేరుతో మోసపూరిత ప్రచారం
న్యూఢిల్లీ: యూపీఐ మ్యూచువల్ ఫండ్ బంపర్ ఆఫర్ స్కీమ్ అందిస్తున్నట్లు ఇన్స్టెంట్ మెసేజింగ్ టూల్–టెలిగ్రామ్‌పై నడుస్తున్న ప్రచారం పట్ల మదుపరులు జాగ్రత్తగా ఉండాలని సంస్థ సూచింది. అలాంటి ఆఫర్ లేదా ఉత్పత్తి ఏదీ కూడా యుటీఐ మ్యూచువల్ ఫండ్ అందించడం లేదా విక్రయించడం లేదని స్పష్టం చేసింది. ‘‘అద్భుతమైన రాబడులు అని చెప్పి మదుపరులను మోసగించేందుకు కొంతమంది చేస్తోన్న మోసపూరిత ప్రక్రియ ఇది. ఎలాంటి సందర్భంలోనూ యుటీఐ మ్యూచువల్ ఫండ్ అలాంటి రాబడులు వస్తాయనే హామీ ఇవ్వదు’’అని యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా తప్పు దోవ పట్టించే, తప్పుడు ఆఫర్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యుటీ ఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి సంబంధిత అధీకృత పోర్టల్ నుంచి వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
ఈ పద్దతులు పాటిస్తే ‘మ్యూచువల్’లో లాభాలు
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో కూడా గరిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్న మార్కెట్లకు .. ఇక కంపెనీల ఆదాయాలు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటున్నారు యూటీఐ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) అంకిత్ అగర్వాల్. అయితే, దీర్ఘకాలిక లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు .. మార్కెట్ ఒడిదుడుకులతో ఆందోళన చెందకుండా క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించాలవచ్చని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు.. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి సమయంలో కూడా మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో కదలాడుతున్నాయి. మార్కెట్లు ఇకపై ఎలా ఉండవచ్చు? బహుశా కోవిడ్ ఫస్ట్ వేవ్, ఆ తర్వాత చోటుచేసుకున్న V ఆకారపు రికవరీని బట్టి ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండవచ్చు. అంతర్జాతీయంగా కూడా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మార్కెట్లపై ప్రభావం మరీ ఎక్కువగా లేదు. స్వల్పకాలిక మార్కెట్ ధోరణుల గురించి చెప్పడం కష్టమే అయినప్పటికీ, మార్కెట్ పనితీరు అనేది కంపెనీల ఆదాయాల రికవరీని బట్టి ఉండవచ్చు. ఒకవేళ ఆదాయాలు నిరుత్సాహకరంగా ఉంటే.. ప్రస్తుత ర్యాలీ ఆగవచ్చు. అక్కణ్నుంచి ఆదాయాలు ఎప్పుడు రికవర్ అవుతాయన్న దానిపై తదుపరి దశ మార్కెట్ల పనితీరు ఆధారపడుతుంది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీల పనితీరు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? గతేడాది మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల పనితీరు లార్జ్ క్యాప్స్ కన్నా మెరుగ్గా నమోదైంది. కొంత మేర వాటి మధ్య ఉన్న వ్యత్యాసం భర్తీ అయింది. గతంలోలాగానే ఇప్పటికీ మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలు.. లార్జ్ క్యాప్‌లను మించిన పనితీరు కనపర్చేందుకు ఇంకా అవకాశం ఉంది. తక్కువ వడ్డీ రేట్ల ఊతంతో మొత్తం ఎకానమీ కోలుకుంటే .. ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపించవచ్చు. ఇక యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్ విషయానికొస్తే.. కోవిడ్ బైటపడ్డాక మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులను ఇది సమర్ధంగా తట్టుకుని నిలబడగలిగింది. ఆ తర్వాత చూసిన ర్యాలీలోనూ చక్కగా పాల్గొనగలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించవచ్చు? ఫోర్ట్ ఫోలియోలో స్వల్పకాలిక ఒడిదుడుకులనను ఎదుర్కొనాలంటే దాన్ని ఏమీ చేయకుండా ఉండటమే ఉత్తమమైన వ్యూహం. ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలపైనే దృష్టి పెట్టి, తమ రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా ఆయా లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో కేటాయింపులు కొనసాగించాలి. మార్కెట్లో ఎప్పుడు, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చన్నది నిర్ణయించుకునేందుకు కావాలంటే వేల్యుయేషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే, మార్కెట్లో తగిన అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. స్థూలంగా చెప్పాలంటే అసెట్ కేటాయింపుపైనే పూర్తిగా దృష్టి పెట్టి, దీర్ఘకాలిక పెట్టుబడుల దృక్పథంతో ముందుకు సాగడం ద్వారా ఒడిదుడుకులను అధిగమించవచ్చు. స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా పెట్టుబడులకు ఏయే రంగాల్లో అవకాశాలు ఉన్నాయి? మా పోర్ట్‌ఫోలియోలో సింహభాగం (సుమారు 70 శాతం భాగం), దీర్ఘకాలంలో మంచి వృద్ధి కనపర్చగలిగే, చక్కని మేనేజ్మెంట్ కలిగిన కంపెనీలే ఉన్నాయి. ఇవి తమ తమ రంగాల్లో లీడర్లుగా ఉన్నాయి. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌పై ఇవి భారీ రాబడులు ఇచ్చేందుకు ఆస్కారముంది. హెల్త్‌కేర్, కెమికల్స్, ఏపీఐ, వినియోగదారుల విచక్షణపై కొనుగోళ్లు ఆధారపడి ఉండే రంగాలు, పారిశ్రామికోత్పత్తులు మొదలైన వాటికి సంబంధించిన విభాగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉండవచ్చు. కాలానుగుణంగా టర్న్ ఎరౌండుకు అవకాశమున్న రంగాలనూ చూడవచ్చు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మందగమనంలో ఉన్న రంగాలను ఎంచుకోవచ్చు. ట్రావెల్, లీజర్, ఆటోమొబైల్, వాణిజ్య వాహనాల సంస్థలు మొదలైన వాటిని పరిశీలించవచ్చు. ఇక మా విషయానికొస్తే.. దీర్ఘకాలిక దృష్టితో నిర్వహించే పోర్ట్‌ఫోలియో కాబట్టి తప్పనిసరైన పరిస్థితులు ఏర్పడితే తప్ప స్వల్పకాలిక పరిణామాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులూ చేయము. ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్న డిజిటైజేషన్, ఆర్థిక సేవలకు ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి ధోరణులు.. మహమ్మారిపరమైన కారణాల వల్ల మరింత వేగం పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా పర్యావరణ అనుకూల ఇంధనాలు, సరఫరా వ్యవస్థలపై దృష్టి పెడుతున్నారు. దీర్ఘకాలికంగా ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మేము ప్రయత్నిస్తాం. -
యూటీఐ ఈక్విటీ డివిడెండ్
యుటిఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఈక్విటీ పథకంపై 28 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు రికార్డు తేదీని మే 20గా నిర్ణయించింది. ఈ తేదీ నాటికి ప్రతీ యూటీ ఈక్విటీ యూనిట్‌కి రూ. 2.80 డివిడెండ్‌గా లభిస్తుంది. గతేడాదిలో 38% లాభాలను అందించిన ఈ పథకం ప్రస్తుత యూనిట్ రేటు రూ. 101.33. -
త్వరలో యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీవో!
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మ్యూచువల్ ఫండ్ హౌస్ యూటీఐ త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా మరోసారి ఐపీవో ప్రణాళికలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో యూటీఐ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఆర్థిక శాఖ నుంచి త్వరలో ఆమోదముద్ర లభించనున్నట్లు సమాచారం. యూటీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన ఐపీవో ప్రతిపాదనను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నదని తెలుస్తోంది. పరిశీలన పూర్తయ్యాక ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లభించే అవకాశమున్నదని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి 74% వాటా వివిధ బ్యాంకులు, బీమా సంస్థల ద్వారా యూటీఐ మ్యూచువల్ ఫండ్‌లో ప్రభుత్వం 74% వాటాను కలిగి ఉంది. ప్రభుత్వం తరఫున స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసీ సంయుక్తంగా యూటీఐలో ఈ వాటాను కలిగి ఉన్నాయి. మిగిలిన 26% వాటా యూఎస్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టీ రోవ్ ప్రైస్ చేతిలో ఉంది. నిజానికి 2008లో యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ మార్కెట్ పరిస్థితులు అనుకూలించక ఐపీవో ప్రతిపాదనను వాయిదా వేసుకుంది. అప్పట్లో 4.8 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని ప్రతిపాదించింది. ఆపై 2009లో నాలుగు స్పాన్సర్ సంస్థల నుంచి 6.5% వాటా చొప్పున మొత్తం 26% వాటాను టీ రోవ్ కొనుగోలు చేసింది. లిస్టింగ్ చేయడం ద్వారా పబ్లిక్కు కనీసం 25% వాటా నిబంధనను అమలు చేసేందుకు వీలు చిక్కుతుందని వివరించాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్) చివరికల్లా యూటీఐ ఎంఎఫ్ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 79,441 కోట్లుగా నమోదైంది. -
దీర్ఘకాలిక పెట్టుబడికి తగిన సమయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విలువ పరంగా ఆకర్షణీయంగా కనిపించకపోయినా మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉన్నట్లు యూటీఐ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. క్రెడిట్ డిమాండ్ కనిష్ట స్థాయికి చేరుకోవడం, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకొని తగ్గడం మొదలు కావడం, కంపెనీల ఆదాయాలు పదేళ్ళ సగటు కంటే తక్కువగా ఉండటం వంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని యూటీఐ మ్యూచువల్ ఫండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ హెడ్ లలిత్ నంబియార్ పేర్కొన్నారు. గతంలో రుణాలకు రికార్డు స్థాయిలో 30 శాతం వరకు డిమాండ్ ఉండేదని, అది ఇప్పుడు 14-15 శాతానికి పడిపోయిందని, ఒక్కసారి ఈ డిమాండ్ పెరిగితే మార్కెట్లు పరుగులు పెడతాయన్నారు. విలువ పరంగా చూస్తే మార్కెట్ల ఈపీఎస్ పదేళ్ళ సగటు వద్ద ఉందని, అయినా దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌కి అంతర్జాతీయంగా తప్పితే స్థానికంగా ఎటువంటి భయాలు లేవన్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు మార్కెట్ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందని, అందుకే ఇప్పుడు ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూటీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నంబియార్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా భయాలు ఉన్నా అవి వాస్తవ రూపం దాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. గత మూడు నెలల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మెరుగయ్యిందని, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ అమెరికాలో వడ్డీరేట్లు పెరిగి కరెన్సీ పతనం అయితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తు తం దేశంలో బంగారాన్ని ఆర్బిట్రేజ్ సాధనంగా వాడుతున్నారన్నారు. అలాగే బంగారం దిగుమతులపై ఆంక్షలు ఉండటంతో ట్రేడర్లు ఆభరణాల తయారీ కోసం ఈటీఎఫ్‌లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. రూ. 500 కోట్ల లక్ష్యం భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న షేర్లను గుర్తించి వాటిల్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను యూటీఐ ప్రవేశపెట్టింది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ కలిగి ఉన్న ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ ఆగస్టు 14న ప్రారంభమై ఆగస్టు 27తో ముగుస్తుంది. న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూటీఐ మార్కెటింగ్ ప్రెసిడెంట్ సూరజ్ కేలీ తెలిపారు. -
ఎన్నికల ర్యాలీ ఎన్నాళ్లో నిలవదు
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాకుండా దేశీయ ఫండమెంటల్స్ ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలని, ఇప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుందని చెప్పలేమంటున్నారు యూటీఐ మ్యూచువల్ ఫండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్. అధిక విలువలో ఉన్నప్పటికీ రెండేళ్ల దృష్టిలో ఫార్మా, ఐటీ రంగాలనే ఇష్టపడతానంటున్న నంబియార్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో 2004, 2009 ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు అప్పటి వరకు ఉన్న ట్రెండ్‌ను మార్చుకున్నాయి. ఈ సారి కూడా అది పునరావృతం అవుతుందని అంచనా వేస్తున్నారా? ఎన్నికల ఫలితాల ఆథారంగా ట్రేడింగ్ అనేది పూర్తిగా స్పెక్యులేటివ్. దీనికి మేము దూరంగా ఉంటాం. గత ఫలితాల తర్వాత మార్కెట్ కదలికలను పరిశీలిస్తే.. ట్రెండ్ మార్పు అనేది స్వల్పకాలానికే పరిమితం అయ్యింది. ఆ తర్వాత మార్కెట్ ఫండమెంటల్స్‌కు అనుగుణంగానే సూచీలు నడిచాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై చాలామంది ఒక నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారు. కానీ గతంలో ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలకు భిన్నంగా ఉన్నాయన్న విషయం మర్చిపోకూడదు. ఆ ఫలితాలతో మార్కెట్లు ఆశ్చర్యకరంగా స్పందించినా దీర్ఘకాలంలో నిలబడలేకపోయాయి. ఇప్పుడు కూడా మేము ఎన్నికల ఫలితాలపై కాకుండా మార్కెట్ ఫండమెంటల్స్‌నే నమ్ముకుంటాం. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే లేదా యూపీఏ తిరిగి అధికారం నిలబెట్టుకుంటే మార్కెట్లు ఏ విధంగా స్పందిస్తాయి? ఒకవేళ ఫలితాల్లో ఏ కూటమికీ పూర్తి మెజార్టీ రాకపోతే ఎలా కదులుతాయి? ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉంటాయన్న స్పష్టమైన నమ్మకంతో ప్రస్తుతం మార్కెట్లు కదులుతున్నాయి. ఇది పటిష్టమైన, నిర్ణయాలు తీసుకునే సమర్థవంతమైన పార్టీ అధికారంలోకి వస్తోందన్న విషయాన్ని సూచిస్తోందని చెప్పొచ్చు. కానీ ఇది ఏవిధంగా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికకు ఉపయోగపడదు. అత్యధికశాతం మంది ఊహించిన విధంగా ఫలితాలు ఉంటే మార్కెట్లు పాజిటివ్‌గా లేకపోతే నెగటివ్‌గా స్పందిస్తాయి. సూచీలు నూతన గరిష్ట స్థాయిల్లో కదులుతున్నా, వాస్తవికంగా దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే అనేక రంగాలు ఇంకా కనిష్ట స్థాయిల్లోనే కదులుతున్నాయి? వీటి పతనం అయిపోయిందని భావించవచ్చా లేక ఇంకా నష్టభయం ఉందంటారా? ఇప్పటికీ దేశీయ స్థూల ఆర్థిక మూలాలు పూర్తిస్థాయిలో కనిష్ట స్థాయికి చేరలేదు. ఇప్పటికీ ఈ రంగాల్లో నష్టభయం ఉంది. రానున్న సంవత్సరకాలంలో దేశీయ మార్కెట్లు ఎదుర్కొనే ప్రధాన రిస్క్‌లు ఏంటి? అవి దేశీయంగా, లేక బయట దేశాల నుంచా? మొన్న ఉత్తర భారతదేశంలో కురిసిన అకాల వర్షాలు, పశ్చిమ భారతంలో కురిసిన వడగండ్లు శీతాకాలపు పంటలపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దీనికితోడు ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు సరిగా ఉండకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. ఇవన్నీ అంతర్గతంగా ఉన్న భయాలు. ఇక బయటి దేశాల నుంచి అయితే... క్రిమియా - రష్యా ఉదంతం తర్వాత యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఒకరకమైన భయం ఆవహించి ఉంది. ఇంధనం అత్యధికంగా సరఫరా చేసే రష్యా ఈ ఉదంతంలో ఉండటమే కారణం. వచ్చే సంవత్సర కాలంలో దేశీయ సూచీలు ఏ శ్రేణిలో కదులుతాయి? ఎటువంటి రాబడులను అంచనా వేస్తున్నారు? రానున్న కాలంలో అనేక పరిణామాలు చేటుచేసుకోనున్న నేపథ్యంలో స్వల్పకాలానికి (ఒక సంవత్సరానికి) అంచనాలు వేయడం కష్టం. ఒకవేళ చెప్పాలని ఒత్తిడి చేస్తే రానున్న ఏడాది కాలంలో సూచీలు మరో 10 శాతం రాబడిని, అదే రెండేళ్లలో అయితే ఏడాదికి సగటున 15 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. అది కూడా బయట దేశాల నుంచి అనుకోని ప్రతికూల సంఘటనలు జరగకుండా ఉంటే. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఏ రంగాలను ఇష్టపడుతున్నారు? వేటికి దూరంగా ఉంటున్నారు? రెండేళ్ల కాలానికి ఐటీ, ఫార్మా రంగాలను ఇప్పటికీ ఇష్టపడుతున్నాం. అదే బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో ఎంపిక చేసిన షేర్లను కొంటున్నాం. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం భారీగా అప్పులను కలిగి ఉండటంతో ఈ రంగానికి దూరంగా ఉంటున్నాం. ఒకవేళ ఎవరైనా అధిక రాబడిని ఆశిస్తూ బాగా రిస్క్ చేయగలిగితే ఈ రంగంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బాగా పెరిగినప్పటికీ డాలర్ల రూపంలో చూస్తే ఎఫ్ఐఐలకి దేశీయ మార్కెట్లు నష్టాలనే అందించాయి. అయినా ఎఫ్ఐఐలు దేశీయ మార్కెట్లోకి భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటే, లాభాలు అందుకుంటున్న దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రం అమ్ముతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎఫ్ఐఐలు అనగానే ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఒక్కరే కాదు. వివిధ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలతో మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ వంటి అనేక వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇండియాకి వస్తున్న ఎఫ్ఐఐల నిధులతోటి మన మార్కెట్లపై అంతర్జాతీయ దృష్టి ఈ విధంగా ఉందని చెప్పలేం. కానీ ఇప్పుడు ఎఫ్ఐఐలు చైనా మార్కెట్ నుంచి వైదొలగి ఇండియా వంటి వర్ధమాన దేశాలకు పెట్టుబడులు మారుస్తుండటమే ఇటీవలి నిధుల ప్రవాహానికి కారణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో డీఐఐల అమ్మకాలకు బీమా కంపెనీలు కారణమని చెప్పొచ్చు. యులిప్స్ నుంచి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ వంటి వాటిల్లోకి మారుతుండటంతో బీమా కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రానున్న ఏడాది కాలంలో బంగారం ధరలు ఏ విధంగా ఉం డొచ్చు? డాలరు -రూపాయి కదలికలపై మీ అంచనాలు ఏమిటి? స్వల్పకాలానికి డాలరు విలువ రూ.58 వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. కానీ దీర్ఘకాలానికి చూస్తే రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉండటంతో ఆ మేరకు దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయని భావిస్తున్నాం. అదే అంతర్జాతీయంగా చూస్తే అమెరికా నిధుల ప్రవాహాన్ని తగ్గిస్తున్నా, ఇదే సమయంలో ప్రపంచంలోని ఇతర దేశాలు ముఖ్యంగా జపాన్, యూరప్‌లు వ్యవస్థలోకి నిధులు పంపిణీ చేస్తున్నా.. బంగారం ధరలు ఇంతకంటే మరింత కిందకు దిగజారే అవకాశాలు కనిపించడం లేదు. ఇక రూపాయి విలువ విషయానికి వస్తే... వచ్చే 12 నెలల కాలానికి డాలరుతో రూపాయి మారకం రూ. 58కి మించి బలపడదని, అలాగే రూ.63.5 మించి క్షీణించదని భావిస్తున్నాం.