న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మ్యూచువల్ ఫండ్ హౌస్ యూటీఐ త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా మరోసారి ఐపీవో ప్రణాళికలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో యూటీఐ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ అంశంపై ఆర్థిక శాఖ నుంచి త్వరలో ఆమోదముద్ర లభించనున్నట్లు సమాచారం. యూటీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన ఐపీవో ప్రతిపాదనను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నదని తెలుస్తోంది. పరిశీలన పూర్తయ్యాక ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లభించే అవకాశమున్నదని ఆ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వానికి 74% వాటా
వివిధ బ్యాంకులు, బీమా సంస్థల ద్వారా యూటీఐ మ్యూచువల్ ఫండ్‌లో ప్రభుత్వం 74% వాటాను కలిగి ఉంది. ప్రభుత్వం తరఫున స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్‌ఐసీ సంయుక్తంగా యూటీఐలో ఈ వాటాను కలిగి ఉన్నాయి. మిగిలిన 26% వాటా యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టీ రోవ్ ప్రైస్ చేతిలో ఉంది.
నిజానికి 2008లో యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ మార్కెట్ పరిస్థితులు అనుకూలించక ఐపీవో ప్రతిపాదనను వాయిదా వేసుకుంది. అప్పట్లో 4.8 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని ప్రతిపాదించింది. ఆపై 2009లో నాలుగు స్పాన్సర్ సంస్థల నుంచి 6.5% వాటా చొప్పున మొత్తం 26% వాటాను టీ రోవ్ కొనుగోలు చేసింది. లిస్టింగ్ చేయడం ద్వారా పబ్లిక్‌కు కనీసం 25% వాటా నిబంధనను అమలు చేసేందుకు వీలు చిక్కుతుందని వివరించాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్) చివరికల్లా యూటీఐ ఎంఎఫ్ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 79,441 కోట్లుగా నమోదైంది.
త్వరలో యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీవో!
Published Tue, Aug 19 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement