లాభాల్లో ఉద్యోగులకు 3% వాటా
♦ ఆర్థిక శాఖ అనుమతి కోరిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
♦ ప్రతిభ గల ఉద్యోగులు వెళ్లకుండా ఉండేలా చూసేందుకే
న్యూఢిల్లీ : ప్రతిభ గల ఉద్యోగులను ప్రోత్సహిం చేందుకు, సంస్థను వీడి వెళ్లిపోకుండా చూసేందుకు వార్షిక లాభాల్లో 3 శాతం దాకా వాటాను సిబ్బందికి పంచాలని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోరినట్లు బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఉద్యోగులు కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా ప్రోత్సహించేందుకు సంస్థ లాభాల్లో సుమారు ఒక్క శాతం దాకా సిబ్బందికి పంచేందుకు ప్రస్తుత నిబంధనలు అనుమతిస్తున్నాయని, అయితే దీన్ని 3 శాతానికి పెంచేందుకు అనుమతించాలని ఆర్థిక శాఖను తాము కోరుతున్నట్లు భట్టాచార్య చెప్పారు.
కష్టపడి ఉన్నత స్థానాల్లోకి వచ్చిన ప్రతిభావంతులైన ఉద్యోగులను.. ప్రైవేట్ రంగ సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలతో ఎగరేసుకుపోతున్నాయని, కొత్త బ్యాంకులు వస్తే ఇది మరింత తీవ్రమవుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వ రంగంతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో ఆదాయం అధికంగా ఉంటున్నందున సీనియర్, మిడ్-లెవెల్ అధికారులు సంస్థను వీడకుండా ఉండేలా చూసుకునేందుకు ఈ స్థాయిలో పరిమితి పెంపు అవసరమని ఆమె పేర్కొన్నారు. మరోవైపు హోదాతో సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ షేర్ల కొనుగోలు పథకాన్ని వర్తింపచేసే అంశాన్ని కూడా బ్యాంకు పరిశీలిస్తోంది. దీని ద్వారా రూ. 800-1,200 కోట్లు సమీకరించవచ్చని అంచనా. బ్యాంకులో ప్రస్తుతం 2.3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ నికర లాభం 20 శాతం ఎగిసి రూ. 13,102 కోట్లుగా నమోదైంది.
ఆగస్టులో రేట్ల కోత ఉండకపోవచ్చు..
రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగిన నేపథ్యంలో ఆగస్టు 4న జరిగే తదుపరి పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు భట్టాచార్య తెలి పారు. జూన్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం నెగటివ్‌లో ఉన్నప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్టమైన 5.4 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే.