మార్చి క్వార్టర్‌లోను లాభాలు తగ్గుతాయ్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) మరింత పెరుగుతాయని, ఫలితంగా లాభాలు తగ్గుతాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. మూడో త్రైమాసికంలోనూ ఎన్‌పీఏల పెరుగుదల వల్లే లాభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. జపాన్ ఇన్వెస్టర్ల కోసం ఏర్పాటు చేసిన డెస్క్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సమాచారాన్ని జపాన్ ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలకు తెలియజేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అక్కణ్ణుంచి నిధులు సమీకరించే భారతీయ వ్యాపారవేత్తలకు తోడ్పాటునిస్తుందని కూడా చెప్పారామె.