రూ.3,000 కోట్ల నాన్-కోర్ ఆస్తులు విక్రయిస్తాం
ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలకం కాని ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.3,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నది. మొండి బకాయిలు బాగా పెరిగిపోవడంతో మూలధనం పెంచుకోవడానికి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ఎస్‌బీఐ 2015-16 వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో పలు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, భవిష్యత్ షాక్‌లను తట్టుకునేలా, భవిష్యత్తులో వృద్ధి జోరు కొనసాగించడానికి తగిన మూలధన నిల్వలున్నాయని ఈ వార్షిక నివేదికలో బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య భరోసానిచ్చారు. ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేకపోవడం, రెండేళ్ల కరువు, కమోడిటీ ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో రుణ నాణ్యత ఒత్తిడులు మరింతగా పెరిగాయని పేర్కొన్నారు.
త్వరలో ఎస్‌బీఐ సమగ్ర విలీన ప్రతిపాదన: భారత మహిళా బ్యాంకుతోపాటు ఐదు అనుబంధ బ్యాంకులను తనలో కలిపేసుకోవడానికి కేంద్ర కేబినెట్ అనుమతించిన నేపథ్యంలో ఎస్‌బీఐ తదుపరి ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. మొత్తం ఆరు బ్యాంకులతోనూ చర్చలు చేపట్టింది. సమగ్ర విలీన ప్రణాళికను సిద్ధం చేసి రానున్న కొన్ని వారాల్లో తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపనున్నట్టు బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. మొత్తం విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని వెల్లడించారు.