ఎస్ బీఐకి ఎన్ పీఏల షాక్! | SBI Q3 profit falls 62percent on high provisions, slippages Rs 20692cr | Sakshi
Sakshi News home page

ఎస్ బీఐకి ఎన్ పీఏల షాక్!

Published Fri, Feb 12 2016 6:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

ఎస్ బీఐకి ఎన్ పీఏల షాక్!

ఎస్ బీఐకి ఎన్ పీఏల షాక్!

క్యూ3లో నికర లాభం 67% డౌన్; రూ.1,259 కోట్లు
మొండిబకాయిలపై అధిక కేటాయింపుల ప్రభావం
5.1%కి ఎగబాకిన స్థూల ఎన్‌పీఏలు;
రూ. 72,791 కోట్లకు పెరుగుదల...
3 శాతం దిగజారిన షేరు ధర....

 ఆర్‌బీఐ సమీక్ష ప్రభావంతో క్యూ3లో చాలా వరకూ పెద్ద ఖాతాలను ఎన్‌పీఏల్లోకి చేర్చాం.  మిగిలిన బలహీన ఖాతాలపై సమీక్ష జరుపుతున్నాం. బహుశా ప్రస్తుత నాలుగో త్రైమాసికంలోనూ లాభాలపై ఈ ప్రభావం ఉండొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొంత భారం ఉంటుందని భావిస్తున్నాం. కాగా, బాండ్‌ల విక్రయం ద్వారా మార్చిలోపు రూ.6,000 కోట్లను సమీకరించడంపై దృష్టిపెట్టాం.
                 - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్


ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు మొండిబకాయిలు షాకిచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో బ్యాంక్ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలతో కలిపి) నికర లాభం 67 శాతం  దిగజారి... రూ.1,259 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,828 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు అధిక పరిమాణంలో కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయడం లాభాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్‌బీఐ మొత్తం ఆదాయం క్యూ3లో రూ.67,594 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ. 64,605 కోట్లతో పోలిస్తే... స్వల్పంగా 4.6 శాతం వృద్ధి చెందింది.

 స్టాండెలోన్ ప్రాతిపదికన ఇలా...
ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల(స్టాండెలోన్) ప్రకారం చూస్తే... ఈ డిసెంబర్ క్వార్టర్‌లో ఎస్‌బీఐ నికర లాభం 61.6 శాతం క్షీణించి రూ.1,115 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం 2,910 కోట్లుగా నమోదైంది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం రూ.43,784 కోట్ల నుంచి రూ.46,731 కోట్లకు పెరిగింది. 6.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది. మార్కెట్ విశ్లేషకులు ఎస్‌బీఐ సగటున రూ.3,250 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు.

 ఎన్‌పీఏలు పైపైకి...
ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌లో ఎస్‌బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) మరింత ఎగబాకాయి. మొత్తం రుణాల్లో 5.1 శాతానికి(రూ.72,792 కోట్లు) చేరాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇవి 4.9 శాతం(రూ.61,992 కోట్లు) కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 4.15 శాతం( రూ.56,834 కోట్లు) మాత్రమే. ఇక నికర ఎన్‌పీఏలు కూడా గత క్యూ3లో 2.8 శాతం(రూ.34,469 కోట్లు) నుంచి 2.89 శాతానికి(రూ.40,249 కోట్లు) పెరిగాయి. అయితే, క్రితం క్వార్టర్(సెప్టెంబర్ త్రైమాసికంలో 2.14 శాతం; రూ.28,592 కోట్లు)తో పోలిస్తే భారీగా పెరగడం గమనార్హం. ప్రధానంగా మొండిబకాయిల పరిష్కారం కోసం ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రభావంవల్లే ఎన్‌పీఏలను అధికంగా చూపించాల్సి వచ్చిందని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

మొండిబకాయిల సమీక్షలో భాగంగా టాప్-150 బలహీన ఖాతాలను గుర్తించిన ఆర్‌బీఐ... వాటినీ ఎన్‌పీఏలుగా పరిగణించి మార్చిలోపు కేటాయింపులు జరపాలంటూ బ్యాంకులను ఆదేశించడం తెలిసిందే. కాగా, ఈ డిసెంబర్ క్వార్టర్‌లో బ్యాంక్ మొత్తం ప్రొవిజనింగ్ రూ. 7,645 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.4,810 కోట్లు మాత్రమే. క్యూ3లో కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాల విలువ రూ.20,692 కోట్లుగా నమోదైంది. ఇందులో రూ.5,900 కోట్లు మాత్రమే అసలు మొండిబకాయిలని, ఆర్‌బీఐ సమీక్ష ప్రభావంతో మిగిలిన మొత్తాన్ని కూడా ఈ జాబితాలోకి చేర్చినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఇప్పటివరకూ సగం బలహీన ఖాతాలకు మాత్రమే కేటాయింపులు జరిపామని, క్యూ4 ఫలితాలపైనా ఈ ప్రభావం ఉంటుందని వెల్లడించింది.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
డిసెంబర్ త్రైమాసికంలో ఇతర ఆదాయం 18 శాతం ఎగబాకి రూ.6,178 కోట్లకు చేరింది. లాభాలు మరింత పడిపోకుండా ఇది కొంతవరకూ దోహదం చేసింది.
ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 1.2% వృద్ధి చెంది రూ.13,777 కోట్ల నుంచి రూ.13,606 కోట్లకు చేరింది.
రుణాలు 12.9 శాతం వృద్ధి చెందాయి. దీంతో డిసెంబర్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల పరిమాణం రూ.14.28 లక్షల కోట్లకు పెరిగింది.
డిపాజిట్ల పరిమాణం 10.7 శాతం వృద్ధితో 16.71 లక్షల కోట్లకు ఎగబాకింది.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 3 శాతం క్షీణించి రూ. 154 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement