అనుబంధ బ్యాంకుల విలీనం..మార్చికల్లా పూర్తి చేస్తాం
♦ ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య
♦ మార్పు అనివార్యతను అర్థం చేసుకోవాలని అభ్యర్ధన..
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో భారతీయ మహిళా బ్యాంక్‌సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా (మార్చి చివరికల్లా) పూర్తికానుంది. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకపక్క దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో భట్టాచార్య ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సమ్మెపై ఆమె మాట్లాడుతూ, ‘‘మార్పు అనివార్యతను వారు అర్థం చేసుకోవాలి. వారికి అవగాహన కల్పించడానికీ మేమూ ప్రయత్నిస్తాం. విలీన ప్రక్రియ పరిణామాలపై వారి అభిప్రాయాలకూ ప్రాధాన్యత ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు.
సంపద నిర్వహణా సేవల ప్రారంభం
కాగా అంతక్రితం ‘ఎస్‌బీఐ ఎక్స్‌క్లూసిఫ్’ పేరుతో బ్యాంక్ వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. దేశంలో వేగంగా పెరుగుతున్న ధనవంతుల సంపద నిర్వహణకు తాజా సేవలను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా భట్టాచార్య తెలిపారు. తొలి దశలో ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లూ తెలిపారు. వ్యక్తిగతంగా, వీడియో కాన్ఫరెన్స్ వంటి ఈ-వెల్త్ చానెళ్లు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, మొబైల్స్ వంటి ఇతర డిజిటల్ మార్గాల ద్వారా ఇన్వెస్టర్‌కు వారి సంపద నిర్వహణ సేవలను నిపుణులు అందిస్తారని తెలిపారు.
రిలేషన్‌షిప్ మేనేజర్‌లనూ బ్యాంక్ నియమిస్తుంది. మార్చి ముగిసే నాటికి 37 కేంద్రాలకు విస్తరించాలన్నది లక్ష్యం. రూ. 2 లక్షల నెల వేతనం లేదా రూ.30 లక్షల స్థిర డిపాజిట్లు లేదా రూ.కోటి గృహ రుణం కస్టమర్లు ఈ సేవలను వినియోగించుకునే వీలుంది. ఈ సేవలను మార్చికల్లా 6 వేల మంది వరకూ కస్టమర్ల బేస్‌కు విస్తరించాలని, రూ.55,000 కోట్ల ఆస్తులను (ఏయూఎం)లను నిర్వహించాలని ఎస్‌బీఐ భావిస్తోంది.