ఎన్‌పీఏల పరిష్కారంపై మరింత స్పష్టత కావాలి
ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య స్పష్టీకరణ
ముంబై: మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి సంబంధించి మరింత స్పష్టత, ప్రణాళిక, మార్గదర్శకాలు అవసరమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ విలేకరులతో అన్నారు. ‘‘ఒత్తిడిలో ఉన్న ఆస్తుల సమస్య పరిష్కారం ఎలా అన్న అంశం కోసం మేము ఎదురుచూస్తున్నాం. ఇందుకు సంబంధించి మరింత స్పష్టత, పారదర్శకాలు అవసరం’’ అని ఆమె అన్నారు. తగిన ప్రణాళికలు, మార్గదర్శకాలు లేకుంటే, సమస్య పరిష్కారం దిశలో ముందుకు వెళ్లడం కష్టమవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. ‘మొండిబకాయిల వచ్చే నష్టాలను ఒకేసారి కాకుండా, త్రైమాసికాల వారీగా భర్తీచేసే వెసులుబాటు ఉండాలి. సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు ఒక నిర్ణయం తీసుకుంటే, దానిని తరువాత సవాలు చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ మేరకు తగిన మార్గదర్శకాలు అవసరం’ అని భట్టాచార్య చెప్పారు.
ముంబైలో కొరియా డెస్క్...
కొరియా డెవలప్‌మెంట్ బ్యాంక్ భాగస్వామ్యంతో ముంబైలో కొరియా డెస్క్‌ను ఎస్‌బీఐ బుధవారం ఏర్పాటు చేసింది. రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యానికి, పెట్టుబడులకు సహాయ,సహకారాలను అందించడం ఈ డెస్క్ ఏర్పాటు లక్ష్యం. రెండు దేశాల మధ్య గత ఆర్థిక సంవత్సరంలో ద్వైవార్షిక వాణిజ్యం 17 బిలియన్ డాలర్లు.