ఎస్‌బీఐ లాభం రయ్... | SBI Q3 net rises 30% on higher non-interest income, reduced NPAs | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ లాభం రయ్...

Published Sat, Feb 14 2015 2:07 AM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM

ఎస్‌బీఐ లాభం రయ్... - Sakshi

ఎస్‌బీఐ లాభం రయ్...

దేశీ బ్యాంకింగ్ రంగం మొండి బకాయిల(ఎన్‌పీఏ) సెగతో అల్లాడుతున్న తరుణంలో... ఎడారిలో ఒయాసిస్సులా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ మెరుగైన పనితీరుతో ఆశ్చర్యపరిచింది. వడ్డీ ఆదాయాల జోరు, వ్యయ నియంత్రణ చర్యలతో బ్యాంక్ నికర లాభం భారీగా దూసుకెళ్లింది. మరోపక్క, ఎన్‌పీఏలు కూడా తగ్గుముఖం పట్టడంతో  షేరు ధర  రివ్వున ఎగసి ఇన్వెస్టర్లలో ఆనందం నింపింది.
 
క్యూ3లో లాభం 30 శాతం జంప్; రూ.2,910 కోట్లు
9 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం
వడ్డీయేతర ఆదాయంలో 24% వృద్ధి
మొత్తం ఆదాయం రూ.43,784 కోట్లు;  12 శాతం అప్
మొండిబకాయిలు తగ్గుముఖం...
8 శాతం పైగా ఎగబాకిన షేరు ధర...

 
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో ఎస్‌బీఐ బంపర్ ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా) నికర లాభం 30 శాతం ఎగబాకి రూ.2,910 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,234 కోట్లు మాత్రమే. కాగా, క్యూ3లో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ.12,616 కోట్ల నుంచి రూ.13,777 కోట్లకు పెరిగింది. 9.2 శాతం వృద్ధి నమోదైంది.  మరోపక్క, వడ్డీయేతర ఆదాయం మరింత మెరుగ్గా 24.27 శాతం పెరుగుదలతో రూ.5,235 కోట్లకు ఎగసింది. దీంతో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.43,784 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో రూ.39,068 కోట్లతో పోలిస్తే 12 శాతం మేర పుంజుకుంది.
 
ఎన్‌పీఏలు తగ్గాయ్...
డిసెంబర్ క్వార్టర్ చివరినాటికి బ్యాంక్ మొత్తం రుణాల్లో మొండిబకాయిల పరిమాణం(స్థూల ఎన్‌పీఏలు) 4.9 శాతానికి తగ్గాయి. విలువ పరంగా రూ.61,991 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో స్థూల ఎన్‌పీఏలు 5.73 శాతంగా ఉన్నాయి. కాగా, ఈ సెప్టెంబర్ క్వార్టర్‌లో 4.89 శాతంగా నమోదయ్యాయి. ఇక నికర ఎన్‌పీఏలు కూడా వార్షిక ప్రాతిపదికన క్యూ3లో 3.24 శాతం నుంచి 2.8 శాతానికి దిగొచ్చాయి. క్యూ2లో కూడా ఈ పరిమాణం 2.73 శాతంగా ఉంది. ఎన్‌పీఏల తగ్గుముఖం పట్టినప్పటికీ.. వీటిపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) మాత్రం పెరిగాయి. క్యూ3లో రూ. 4,149 కోట్ల నుంచి రూ. 5,235 కోట్లకు చేరాయి. అంటే 26 శాతం పెరిగినట్లు లెక్క.
 
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
అనుంబంధ బ్యాంకులు, సంస్థలన్నింటితో కలిపి క్యూ3లో ఎస్‌బీఐ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,828 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ3లో రూ.2,839 కోట్లతో పోలిస్తే 35 శాతం వృద్ధి నమోదైంది.
మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.58,649 కోట్ల నుంచి రూ.64,605 కోట్లకు ఎగసింది. 10 శాతం వృద్ధి సాధించింది.
క్యూ3లో ట్రెజరీ ఆదాయం రూ.238 కోట్ల నుంచి రూ.920 కోట్ల దూసుకెళ్లింది.
ఫీజుల రూపంలో బ్యాంక్ ఆదాయం 10 శాతం ఎగబాకింది. రూ.2,971 కోట్ల నుంచి రూ.3,291 కోట్లకు పెరిగింది.
నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) 3.19 శాతం నుంచి 3.12 శాతానికి తగ్గింది.
డిసెంబర్ క్వార్టర్లో రూ.475 కోట్ల విలువైన రుణాలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్‌సీ)లకు విక్రయించింది. మార్చిలో మరో రూ.1,200 కోట్ల విలువైన రుణాలను వేలానికి పెట్టనుంది.
కాగా, క్యూ3లో రూ.4,092 కోట్ల సాధారణ రుణాలను, ఎన్‌పీఏలుగా మారిన రూ.1,454 కోట్ల విలువైన రుణాలను బ్యాంక్ పునర్‌వ్యవస్థీకరించింది. మరో రూ.5,500 కోట్ల రుణాలు ఈ బాటలో ఉన్నాయి.
డిసెంబర్ చివరి నాటికి ఎస్‌బీఐ మొత్తం డిపాజిట్లు రూ.15,10 లక్షల కోట్లకు ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.13.49 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందాయి.
ఇక మొత్తం రుణాలు 7 శాతం వృద్ధితో రూ.12.65 లక్షల కోట్లకు పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్సియల్ ప్రాతిపదికన రూ.2,970 కోట్ల విలువైన షేర్లను జారీ చేసేందుకు ఎస్‌బీఐ డెరైక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ ఆర్థిక సం వత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం సమకూర్చే చర్యల్లో  భాగంగా ఈ మొత్తాన్ని ఇవ్వాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
 
షేరు దూకుడు...
అనూహ్యంగా మొండిబకాయిల తగ్గుదల, లాభం భారీగా ఎగబాకడంతో ఎస్‌బీఐ షేరు పరుగులు తీసింది. శుక్రవారం బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 8.26 శాతం దూసుకెళ్లింది. చివరకు 7.96 శాతం లాభంతో రూ.307.05 వద్ద స్థిరపడింది. వెరసి ఒక్క రోజులోనే ఎస్‌బీఐ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.16,910 కోట్లు పెరిగింది. రూ.2,29,235 కోట్లకు ఎగబాకింది. అంతేకాదు శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో అత్యధికంగా లాభపడిన బ్లూచిప్ షేరు ఇదే కావడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలో 7 కోట్లకు పైగా షేర్లు, బీఎస్‌ఈలో 85.7 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.
 
ఎన్‌పీఏలు మరింత తగ్గుతాయ్...
ఇతర ఆదాయాలతో పాటు నికర వడ్డీ ఆదాయం కూడా భారీగా పుంజుకోవడంతో క్యూ3 లాభాలు జోరందుకున్నాయి. దీనికితోడు వ్యయాలు తగ్గడం కూడా దీనికి దోహదం చేసింది. డిసెంబర్ క్వార్టర్‌లో రూ.7,043 కోట్లు కొత్తగా మొండిబకాయిల జాబితాలో చేరాయి. క్యూ2లో ఈ మొత్తం రూ.7,700 కోట్లుగా ఉన్నాయి. ప్రధానంగా స్టీల్, ఇన్‌ఫ్రా, టెక్స్‌టైల్స్, ట్రేడ్ అండ్ సర్వీసెస్ రంగాల  కంపెనీల నుంచే అధికంగా మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటికి అడ్డుకట్టపై మరింత దృష్టిపెడుతున్నాం. అయితే, మొత్తంమీద చూస్తే ఎన్‌పీఏల పరిస్థితి కాస్త మెరుగుపడింది. రానున్న కాలంలో మరింత నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఏడాదికి రుణ వృద్ధి 10 శాతం స్థాయిలో ఉండొచ్చు. బీమా అనుంబంధ సంస్థల్లో(ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్) కొంత వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనిపై ఆయా సంస్థల్లోని భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నాం. అనుంబంధ బ్యాంకులపై ప్రస్తుతానికి దృష్టిపెట్టడం లేదు.
 - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement