మొండి బకాయిల కట్టడే లక్ష్యం
ముంబై: మొండిబకాయిలను (ఎన్‌పీఏ) అదుపులో ఉంచడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సాధనాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. చైర్‌పర్సన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంగళవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఎన్‌పీఏలకు సంబంధించిన యుద్ధం ఇంకా ముగిసిపోలేదని, మరింత తీవ్రతరం అవుతుందని ఆమె తెలిపారు. వీటి కట్టడి కోసం ఇప్పటిదాకా చేపట్టిన చర్యలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు అదనపు అస్త్రాలను కూడా ప్రయోగించాల్సి ఉంటుందని అరుంధతి చెప్పారు. జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలోనే అత్యధికంగా ఎస్‌బీఐ మొండిబకాయిలు 5.56 శాతానికి ఎగిసిన నేపథ్యంలో భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మంత్రదండం లేదు..
ఎన్‌పీఏ సమస్యలను ఒకటో, రెండో త్రైమాసికాల్లో పరిష్కరించేయాలంటే తన దగ్గర మంత్రదండమేమీ లేదని భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఎకానమీలో సమస్యలకు బ్యాంకు కూడా అతీతం కాదు కనుక ఆ ఒత్తిడి మరికొన్నాళ్లు కొనసాగుతుందన్నారు. అయితే, ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుంటున్న నేపథ్యంలో మొండిబకాయిల గురించి తీవ్రంగా ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ క్వార్టర్‌కి సంబంధించి ఆడిట్ జరుగుతున్నందున.. మొండిబకాయిలు ఏ స్థాయిలో ఉండొచ్చన్నది వెల్లడించడం సాధ్యపడదని చెప్పారు. ఎన్‌పీఏలను తగ్గించే దిశగా కొత్తగా ఐటీ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించనున్నట్లు భట్టాచార్య తెలిపారు. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎస్‌బీఐ ఐటీని అంతగా ఉపయోగించుకోలేదన్నారు. ఎన్‌పీఏల నిర్వహణ, మొండిబకాయిల సమస్య పరిష్కారానికి పట్టే సమయాన్ని తగ్గించడం తదితర అంశాలపై మరింతగా దృష్టి సారిస్తామని ఆమె వివరించారు. ఈ సమస్య పరిష్కారమైతే.. అసెట్స్‌పైనా, ఈక్విటీలపైనా రాబడులు తదితర అంశాలు వాటంతటవే మెరుగుపడగలవన్నారు.
కావాలని ఎగ్గొడితే ఉపేక్షించం ..
రుణాలను తిరిగి చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే వారి పట్ల మెతక వైఖరి చూపే ప్రసక్తే లేదని భట్టాచార్య స్పష్టం చేశారు. భారీ స్థాయిలో రికవరీలు రాబడుతుండటమే దీనికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. అయితే, ఇందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అంటే.. ఉన్నాయని చెప్పలేమని, ఈ ప్రక్రియలో అనేక ఏజెన్సీల ప్రమేయం ఉంటుందని భట్టాచార్య చెప్పారు. కావాలనే ఎగ్గొట్టే ప్రమోటర్లను .. కంపెనీల బోర్డుల నుంచి తప్పించాలంటూ ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ సూచించినప్పటికీ..వాస్తవికంగా అమలు చేయాలంటే కొన్ని సవాళ్లు ఉంటాయన్నారు. మరోవైపు, ప్రభుత్వం ఎంత మేర మూలధన పెట్టుబడులు సమకూరుస్తుందన్న దాన్ని బట్టి మిగతా నిధుల సమీకరణ ఆధారపడి ఉంటుందని భట్టాచార్య తెలిపారు. అదనంగా నిధులు లేకపోయినప్పటికీ.. ఈ ఆర్థిక సంవత్సరం కార్యకలాపాలు సజావుగానే సాగిపోగలవన్నారు.
ఉద్యోగినులకు మరింత వెసులుబాటు ..
ఎస్‌బీఐ తొలి చైర్‌పర్సన్‌గా పగ్గాలు చేపట్టిన అరుంధతీ భట్టాచార్య.. ఉద్యోగినుల అవసరాలపైనా ఉదారంగా వ్యవహరించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. ‘నేనూ మహిళనే కాబట్టి.. ఉద్యోగినులకి ఉండే ప్రత్యేక సమస్యల గురించి నాకు తెలుసు. వాటి విషయంలో మరికాస్త ఉదారంగా వ్యవహరించేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాను’ అని ఆమె తెలిపారు. భార్యభర్తలు ఇరువురూ పనిచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. మారుతున్న పని వాతావరణాన్ని సంస్థ అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో భాగస్వామి స్థిరపడిన ప్రాంతానికి ఉద్యోగి కెరియర్‌లో కేవలం రెండేసార్లు బదిలీ చేయాలన్న పరిమితిని తొలగిస్తామని భట్టాచార్య పేర్కొన్నారు. దీనిపై చర్చించినప్పటికీ.. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. యువ దంపతులు ఇరువురూ ఉద్యోగం చేస్తున్నప్పుడు వారు కలిసి ఉండేలా, అవసరాలు గుర్తెరిగి సంస్థ వ్యవహరించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. తాను ఎస్‌బీఐ క్యాప్స్‌కి సారథ్యం వహించినప్పుడు.. మహిళలు సందర్భాన్ని బట్టి దాదాపు ఆరేళ్ల దాకా విరామం తీసుకునే వెసులుబాటు కల్పించానని భట్టాచార్య తెలిపారు. అలాగే గృహస్తు ధర్మాలు నిర్వర్తించాలి కాబట్టి పురుషులకు కూడా సెలవు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎస్‌బీఐలో మహిళలకు సుమారు 13 నెలల దాకా ప్రసూతి సెలవు(జీతం లేకుండా) లభిస్తోందన్నారు. శిశువుల ఆరోగ్య పరీక్షల వంటివి కూడా ఉంటాయి కనుక మరింత సమయమూ అవసరమవుతుందన్నారు. దాదాపు 2.25 లక్షల పైగా ఉద్యోగులున్న ఎస్‌బీఐలో ఇలాంటి ప్రణాళికలు అమలు చేయాలంటే కష్టసాధ్యమే అయినప్పటికీ.. సాధ్యమైనంత మేర పరిశీలిస్తామని భట్టాచార్య చెప్పారు.
ద్రవ్యోల్బణాన్నిబట్టే వడ్డీ రేట్లు..
ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నంత కాలం వడ్డీ రేట్లు అధిక స్థాయిలోనే ఉంటాయని భట్టాచార్య చెప్పారు. రెపో రేటు తగ్గితేనే రుణాలపై వడ్డీ రేటూ తగ్గగలదని ఆమె వివరించారు. అయితే.. ద్ర వ్యోల్బణం పెరుగుతున్నందున.. వడ్డీ రేట్లు ఇప్పుడప్పుడే తగ్గేట్లు కనిపించడం లేదని అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్ రేటు తగ్గించే అవకాశం ఉందని, అయితే.. దీనిపై బ్యాంక్ అసెట్ లయబిలిటీ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా టాప్-10 బ్యాంకుల్లో ఒకటిగా నిలవాలంటే ప్రపంచస్థాయి భారీ బ్యాంకుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అనుబంధ బ్యాంకులను సాధ్యమైనం త త్వరగా విలీనం చేసుకోవాల్సి ఉంటుందని భట్టాచార్య చెప్పారు. అయితే, ఈ విషయంలో పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు.