దీర్ఘకాలిక పెట్టుబడికి తగిన సమయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విలువ పరంగా ఆకర్షణీయంగా కనిపించకపోయినా మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉన్నట్లు యూటీఐ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. క్రెడిట్ డిమాండ్ కనిష్ట స్థాయికి చేరుకోవడం, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకొని తగ్గడం మొదలు కావడం, కంపెనీల ఆదాయాలు పదేళ్ళ సగటు కంటే తక్కువగా ఉండటం వంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని యూటీఐ మ్యూచువల్ ఫండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ హెడ్ లలిత్ నంబియార్ పేర్కొన్నారు.
గతంలో రుణాలకు రికార్డు స్థాయిలో 30 శాతం వరకు డిమాండ్ ఉండేదని, అది ఇప్పుడు 14-15 శాతానికి పడిపోయిందని, ఒక్కసారి ఈ డిమాండ్ పెరిగితే మార్కెట్లు పరుగులు పెడతాయన్నారు. విలువ పరంగా చూస్తే మార్కెట్ల ఈపీఎస్ పదేళ్ళ సగటు వద్ద ఉందని, అయినా దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌కి అంతర్జాతీయంగా తప్పితే స్థానికంగా ఎటువంటి భయాలు లేవన్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు మార్కెట్ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందని, అందుకే ఇప్పుడు ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూటీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నంబియార్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా భయాలు ఉన్నా అవి వాస్తవ రూపం దాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. గత మూడు నెలల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మెరుగయ్యిందని, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ అమెరికాలో వడ్డీరేట్లు పెరిగి కరెన్సీ పతనం అయితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తు తం దేశంలో బంగారాన్ని ఆర్బిట్రేజ్ సాధనంగా వాడుతున్నారన్నారు. అలాగే బంగారం దిగుమతులపై ఆంక్షలు ఉండటంతో ట్రేడర్లు ఆభరణాల తయారీ కోసం ఈటీఎఫ్‌లను విక్రయిస్తున్నట్లు తెలిపారు.
రూ. 500 కోట్ల లక్ష్యం
భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న షేర్లను గుర్తించి వాటిల్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను యూటీఐ ప్రవేశపెట్టింది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ కలిగి ఉన్న ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ ఆగస్టు 14న ప్రారంభమై ఆగస్టు 27తో ముగుస్తుంది. న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూటీఐ మార్కెటింగ్ ప్రెసిడెంట్ సూరజ్ కేలీ తెలిపారు.