Lalit Nambiar
-
మెరుగ్గా భారత మార్కెట్
♦ జీఎస్టీతో లాజిస్టిక్స్ ♦ తదితర రంగాలకు ప్రయోజనం ♦ యూటీఐ ఎంఎఫ్ ఈవీపీ లలిత్ నంబియార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ సంస్కరణల అమలు నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ మెరుగ్గానే ఉందని యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఈవీపీ లలిత్ నంబియార్ తెలిపారు. స్వల్ప, మధ్యకాలికంగా చూస్తే కంపెనీల ఆదాయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని.. ఆదాయాలు ఒక మోస్తరుగా ఉండటం వల్లే వేల్యుయేషన్స్ కొంత అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రంగాలవారీగా మళ్లీ క్రమంగా పెట్టుబడులు పెట్టడం మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయని గురువారమిక్కడ మీడియాతో చెప్పారు. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని నంబియార్ తెలిపారు. రహదారులు, రైల్వే మొదలైన విభాగాల్లో తీసుకుంటున్న చర్యలు చిన్నవిగానే కనిపిస్తున్నా.. దీర్ఘకాలంలో ఇవి ప్రయోజనాలు చూపగలవని నంబియార్ వివరించారు. జీఎస్టీ రాకతో లాజిస్టిక్స్ మొదలైన సంస్థలకు లాభదాయకంగానే ఉంటుందని ఆయన తెలిపారు. ఇక దీర్ఘకాలికంగా చూస్తే.. పెను మార్పులు చేసుకోవాల్సి న అవసరం లేనటువంటి సంస్థలకు స్వల్ప, దీర్ఘకాలంలో మెరుగ్గానే ఉండగలదని నంబియార్ పేర్కొన్నారు. మెరుగైన ఫలితాలకు ఇన్వెస్టర్లు కనీసం అయిదేళ్ల పాటైనా వేచి చూడాల్సి ఉంటుందన్నారు. -
2003-08 ర్యాలీ పునరావృతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీ సుదీర్ఘకాలం కొనసాగుతుందని, 2003-08లో జరిగిన ర్యాలీ పునరావృతమయ్యే అవకాశాలున్నాయని మ్యూచువల్ ఫండ్ సంస్థ యూటీఐ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ప్రధానంగా ఆరు బుల్ ర్యాలీలు నమోదు కాగా అందులో 2003-08 ర్యాలీ తప్ప మిగిలినవన్నీ ఒక కారణంతో జరిగాయని, కానీ 2003-08 ర్యాలీ దేశ ఆర్థిక మూలాలకు అనుగుణంగా జరిగిందని యూటీఐ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్ తెలిపారు. అదే విధంగా ప్రస్తుత ర్యాలీ కూడా దేశీయ ఫండమెంటల్స్ ఆధారంగానే జరుగుతున్నట్లు కనపడుతోందని, ఇది దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. మంగళవారం యూటీఐ కొత్త ఫండ్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరు బుల్ ర్యాలీల సగటు కాలపరిమితి 90 వారాలుగా ఉండి 171 శాతం లాభాలను అందిస్తే, గడిచిన ర్యాలీ సుదీర్ఘకాలంగా అంటే 246 వారాలు జరగడమే కాకుండా అత్యధికంగా 614 శాతం లాభాలను అందించినట్లు తెలిపారు. ప్రస్తుత ర్యాలీ మొదలై 68 వారాలు అయ్యిందని, ఈ సమయంలో సూచీలు 50 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయన్నారు. అన్ని సానుకూలాంశాలే.. స్టాక్ మార్కెట్ ర్యాలీని ప్రభావితం చేసే అయిదు అంశాల్లో రుణాలకు డిమాండ్ పెరగక పోవడం తప్ప మిగిలిన నాలుగు అంశాలు అంటే ద్రవ్యోల్బణం తగ్గడం, వడ్డీరేట్లు తగ్గడానికి సానుకూల వాతావరణం ఏర్పడటం, కంపెనీల లాభాల్లో వృద్ధి మొదలవడం, కంపెనీల షేర్ల విలువలు ఆకర్షణీయంగా ఉండటం అనేవి స్టాక్ సూచీలు మరింత పెరుగుతుయడానే నమ్మకాన్ని కలిగిస్తున్నాయని నంబియార్ తెలిపారు. 1995 నుంచి పరిశీలిస్తే ఏటా రుణాల్లో కనిష్టవృద్ధి సగటున 9.62%గా ఉం టే ఇప్పుడిది 9.72% గా ఉందని, ఈ గణాం కాలు క్రెడిట్ డిమాండ్ కనిష్టస్థాయికి చేరిందన్న అంశాన్ని తెలియ చేస్తోందన్నారు. 1997లో రుణాల్లో వృద్ధి కనిష్టంగా 9.6 శాతంగా ఉంటే, 2006లో గరిష్టంగా 30.88 శాతంగా నమోదయ్యింది. ఇప్పుడిప్పుడే కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో రుణాలకు డిమాండ్ పెరుగుతోందని, ఒక్కసారి విద్యుత్, కోల్, ఇన్ఫ్రా రంగాల సమస్యలు పరిష్కారమైతే పారిశ్రామిక రుణాలకు డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కంపెనీల ఎబిటా మార్జిన్ కూడా పదేళ్ల కనిష్ట సగటుకు చేరిందని, ఇది రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గడం, ముడి చమురు ధరలు, బంగారం ధరలు తగ్గడంతో ద్రవ్యలోటు కూడా తగ్గుముఖం పట్టిందని, దీంతో ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించడానికి మార్గం ఏర్పడిందన్నారు. మార్చి తర్వాత నుంచి వడ్డీరేట్లు తగ్గవచ్చన్నారు. ఒడిదుడుకులు తప్పవు ప్రతీ బుల్ ర్యాలీ మధ్యలో చిన్న చిన్న కరెక్షన్లు ఉంటాయని, వీటిని కొనుగోళ్లకు వినియోగించుకోవాలని నంబియార్ సూచించారు. 2003-08 మధ్య జరిగిన సుదీర్ఘ ర్యాలీ ఆరుసార్లు సర్దుబాటుకు గురయ్యిందని, ప్రస్తుత ర్యాలీ కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. ప్రస్తుత కరెక్షన్ ఎప్పుడు ఎందుకు వస్తుందో చెప్పలేమన్నారు. రాజ్యసభలో జీఎస్టీ, బీమా బిల్లులు ఆమోదానికి ఆటం కం ఎదురైనప్పుడు లేదా ఉక్రెయిన్, ఇస్లామిక్ మిలిటెంట్స్ వంటి సంఘటనల రూపంలోనైనా ఈ కరెక్షన్ రావచ్చన్నారు. వచ్చే నెలలో కొత్త పథకం యూటీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్-2 న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 4న ప్రారంభమై డిసెంబర్ 18తో ముగియనుంది. ఇది 1,102 రోజుల క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఎన్ఎఫ్వో ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సిరీస్-1లో రూ. 500 కోట్లు లక్ష్యం పెట్టుకోగా రూ. 770 కోట్లు సమీకరించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
దీర్ఘకాలిక పెట్టుబడికి తగిన సమయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విలువ పరంగా ఆకర్షణీయంగా కనిపించకపోయినా మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉన్నట్లు యూటీఐ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. క్రెడిట్ డిమాండ్ కనిష్ట స్థాయికి చేరుకోవడం, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకొని తగ్గడం మొదలు కావడం, కంపెనీల ఆదాయాలు పదేళ్ళ సగటు కంటే తక్కువగా ఉండటం వంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని యూటీఐ మ్యూచువల్ ఫండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ హెడ్ లలిత్ నంబియార్ పేర్కొన్నారు. గతంలో రుణాలకు రికార్డు స్థాయిలో 30 శాతం వరకు డిమాండ్ ఉండేదని, అది ఇప్పుడు 14-15 శాతానికి పడిపోయిందని, ఒక్కసారి ఈ డిమాండ్ పెరిగితే మార్కెట్లు పరుగులు పెడతాయన్నారు. విలువ పరంగా చూస్తే మార్కెట్ల ఈపీఎస్ పదేళ్ళ సగటు వద్ద ఉందని, అయినా దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌కి అంతర్జాతీయంగా తప్పితే స్థానికంగా ఎటువంటి భయాలు లేవన్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు మార్కెట్ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందని, అందుకే ఇప్పుడు ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూటీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నంబియార్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా భయాలు ఉన్నా అవి వాస్తవ రూపం దాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. గత మూడు నెలల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మెరుగయ్యిందని, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ అమెరికాలో వడ్డీరేట్లు పెరిగి కరెన్సీ పతనం అయితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తు తం దేశంలో బంగారాన్ని ఆర్బిట్రేజ్ సాధనంగా వాడుతున్నారన్నారు. అలాగే బంగారం దిగుమతులపై ఆంక్షలు ఉండటంతో ట్రేడర్లు ఆభరణాల తయారీ కోసం ఈటీఎఫ్‌లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. రూ. 500 కోట్ల లక్ష్యం భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న షేర్లను గుర్తించి వాటిల్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను యూటీఐ ప్రవేశపెట్టింది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ కలిగి ఉన్న ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ ఆగస్టు 14న ప్రారంభమై ఆగస్టు 27తో ముగుస్తుంది. న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూటీఐ మార్కెటింగ్ ప్రెసిడెంట్ సూరజ్ కేలీ తెలిపారు.