మెరుగ్గా భారత మార్కెట్
♦ జీఎస్‌టీతో లాజిస్టిక్స్
♦ తదితర రంగాలకు ప్రయోజనం
♦ యూటీఐ ఎంఎఫ్ ఈవీపీ లలిత్ నంబియార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ సంస్కరణల అమలు నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ మెరుగ్గానే ఉందని యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఈవీపీ లలిత్ నంబియార్ తెలిపారు. స్వల్ప, మధ్యకాలికంగా చూస్తే కంపెనీల ఆదాయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని.. ఆదాయాలు ఒక మోస్తరుగా ఉండటం వల్లే వేల్యుయేషన్స్ కొంత అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రంగాలవారీగా మళ్లీ క్రమంగా పెట్టుబడులు పెట్టడం మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయని గురువారమిక్కడ మీడియాతో చెప్పారు. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని నంబియార్ తెలిపారు.
రహదారులు, రైల్వే మొదలైన విభాగాల్లో తీసుకుంటున్న చర్యలు చిన్నవిగానే కనిపిస్తున్నా.. దీర్ఘకాలంలో ఇవి ప్రయోజనాలు చూపగలవని నంబియార్ వివరించారు. జీఎస్‌టీ రాకతో లాజిస్టిక్స్ మొదలైన సంస్థలకు లాభదాయకంగానే ఉంటుందని ఆయన తెలిపారు. ఇక దీర్ఘకాలికంగా చూస్తే.. పెను మార్పులు చేసుకోవాల్సి న అవసరం లేనటువంటి సంస్థలకు స్వల్ప, దీర్ఘకాలంలో మెరుగ్గానే ఉండగలదని నంబియార్ పేర్కొన్నారు. మెరుగైన ఫలితాలకు ఇన్వెస్టర్లు కనీసం అయిదేళ్ల పాటైనా వేచి చూడాల్సి ఉంటుందన్నారు.