న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ కంపెనీలలో జీక్యూజీ పార్ట్‌నర్స్ తదితర పెట్టుబడి సంస్థలు తాజాగా బిలియన్ డాలర్లు(సుమారు రూ. 8,200 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. గ్రూప్‌లోని డైవర్సిఫైడ్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో 1.6 శాతం వాటాకు సమానమైన 1.8 కోట్ల షేర్లు కొనుగోలు చేశాయి. ఈ బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ 2.2 శాతం వాటాకు సమానమైన 3.52 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
స్టాక్ ఎక్సే్ఛంజీల సమాచారంమేరకు రెండు కంపెనీలలో బ్లాక్‌ట్రేడ్స్ నమోదయ్యాయి. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి చైర్మన్ గౌతమ్ అదానీ.. గ్రూప్‌పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు ముందస్తు రుణ చెల్లింపులు, నిధుల సమీకరణ తదితర చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో జీక్యూజీ పార్ట్‌నర్స్.. అదానీ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీలలో ప్రమోటర్లు 1.87 బిలియన్ డాలర్ల(రూ. 15,446 కోట్లు) విలువైన వాటాలను జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు విక్రయించారు. తదుపరి మే నెలలో మరో 40–50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను జీక్యూజీ కొనుగోలు చేసింది.
బ్లాక్‌డీల్స్ ఇలా..
అదానీ ఎంటర్‌ప్రైజెస్ కౌంటర్లో మంగళవారం ధర రూ. 2,281తో పోలిస్తే షేరుకి రూ. 2,300 ధరలో బుధవారం బీఎస్‌ఈలో లావాదేవీ నమోదైంది. అయితే అదానీ గ్రీన్‌లో ముందురోజు ధర రూ. 960తో పోలిస్తే రూ. 925–920 ధరలో బ్లాక్‌డీల్స్ జరిగాయి. తద్వారా రెండు కంపెనీలలోనూ విడిగా 50 కోట్ల డాలర్ల విలువైన ప్రమోటర్ల వాటాలు విదేశీ సంస్థలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 2,404 వద్ద నిలవగా.. అదానీ గ్రీన్ స్వల్ప నష్టంతో రూ. 958 వద్ద ముగిసింది. తొలుత 7 శాతం పతనంకావడం గమనార్హం! మేలో నిర్వహించిన బోర్డు సమావేశాలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ 2.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 21,000 కోట్లు) సమీకరణకు ఆమోదించాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయించాలని ప్రతిపాదించాయి.
Comments
Please login to add a commentAdd a comment