ఒకే యూనిఫామ్‌లో విద్యార్థులు, విద్యార్థినులు
కేరళ, ఎర్నాకుళం జిల్లాలో వలయాంచిరంగార అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. వందేళ్లు దాటిన ఆ పాఠశాలలో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్‌ఉమెన్ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు స్కూల్ యూనిఫామ్‌గా ఉండేది. ప్రిన్సిపల్ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. బాలికలకు ఆడేటప్పుడు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్) కోడ్‌ను తెచ్చారు.
‘‘ఆటల్లో ఒకటో తరగతి పిల్లలు ఉన్నంత చురుగ్గా పెద్ద తరగతుల పిల్లలు ఉండడం లేదు. ఒకటి– రెండు తరగతుల్లో చురుగ్గా ఉన్న పిల్లలు కూడా నాలుగైదు తరగతులకు వచ్చే సరికి ఆటలాడడానికి బిడియపడుతున్నారు. ఉత్సాహంగా ఉండాల్సిన పిల్లలకు కనిపించని సంకెళ్లుగా మారుతున్నది వాళ్ల దుస్తులే. ఆటల్లో పైకెగిరి షటిల్ రాకెట్‌తో కాక్‌ను కొట్టాలన్నా, ఒక్క గెంతులో లాంగ్ జంప్ చేయాలన్నా, హై జంప్ చేయాలన్నా స్కర్టు పైకెగురుతుందేమోననే బిడియంతో ఆటలాడడానికి ముందుకు రావడం లేదు. క్రీడాకారులుగా తయారుకాగలిగిన సత్తా ఉన్న పిల్లలను వస్త్రధారణ కారణంగా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అనిపించింది. కార్పొరేట్ స్కూళ్లలో ఉన్నట్లు రెగ్యులర్ స్కూల్ డ్రస్ ఒకటి, స్పోర్ట్స్ పీరియడ్‌కి మరో రకం డ్రస్ అనే నియమం పెట్టడం మాకు కుదరదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రస్ చేంజ్ రూములు ఏర్పాటు చేయడం కష్టం. ఇంటి నుంచి స్కూలుకి నడిచి వచ్చే పిల్లలకు తమ వెంట మరో జత దుస్తులు తెచ్చుకోవడం కూడా కష్టమే. అందుకే స్కూల్ డ్రెస్‌ని ఇలా డిజైన్ చేశాం. నిక్కర్‌ని కూడా ముందు ఉన్నట్లు తొడల వరకే కాకుండా, అందరికీ మోకాళ్ల వరకు ఉండేలా నియమం పెట్టాం’’ అన్నారు ప్రధానోపాధ్యాయురాలు రాజీ మేడమ్.
తల్లిదండ్రులకూ సంతోషమే
రాజీ మేడమ్ డిజైన్ చేసిన యూనిసెక్స్ యూనిఫామ్ పట్ల అమ్మాయిల తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. బాలికలు మాత్రం... నిక్కర్ జేబులో చేతులు పెట్టుకుంటూ సంతోషపడుతున్నారు. చాక్లెట్ కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చిన రూపాయిని జేబులో దాచుకుంటూ, మధ్యలో చూసుకుంటూ మురిసిపోతున్నారు. రాజి మేడమ్ పదేళ్లుగా వలయాంచిరంగార ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు, ఆమె చదివింది కూడా అదే స్కూల్లో. ప్రస్తుతం ఆమెతో పని చేస్తున్న అనేక మంది సిబ్బంది ఆమెకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్లే. ‘తనకు స్కూల్లో ప్రతి అంగుళం తనకు తెలుసని, గ్రామంలో ప్రతి ఒక్కరితో పరిచయం ఉందని, అందువల్లనే స్కూలు అవసరం ఏమిటో గుర్తించి పరిష్కరించడంలో తనకు అందరి సహకారం ఉంటోందని’ చెప్పారు రాజీ మేడమ్.– మంజీర
Comments
Please login to add a commentAdd a comment