సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష జరుగనుంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,71,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతుండగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర బంధువులు, స్నేహితులు వీరికి ఆల్ ద బెస్ట్ చెప్పి.. ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని హితబోధ చేస్తున్నారు. స్కూల్ యూనిఫాంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను లోనికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులంతా సివిల్ డ్రెస్‌లో రావాల్సిందిగా విద్యాశాఖ అధికారులు సూచించారు.
అంతేకాదు నిర్ధేశిత సమయం ముగిసిన తర్వాత ఐదు నిమిషాల లోపు 9.35 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లను నిరాకరించే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించనున్నట్టు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి వెంకట నర్సమ్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జబ్లింగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎగ్జామ్ సెంటర్ నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎలాంటి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment