40 డిగ్రీల ఎండలో సూటా?
ప్రోటోకాల్కు విరుద్దంగా ప్రధాని పర్యటనలో నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్ ధరించి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించిన ఐఏఎస్ అధికారి, బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియా ఎట్టకేలకు వివాదంపై స్పందించారు. నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్లో ప్రధానికి షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు. 'దేశంలో అత్యధికి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో బస్తర్ కూడా ఒకటి. 40 డిగ్రీల ఎండలో.. బంద్గలా లేదా నార్మల్ సూటు ధరించి ఉక్కపోతను అనుభవిస్తూ విధులు నిర్వర్తించడం నావల్ల కాదు బాబోయ్..' అంటూ వాట్సాప్ మెస్సేజ్ల ద్వారా ఐఏఎస్ సహచరులతో తన గోడు వెలిబుచ్చుకున్నాడు.
'అయినా నేనేమీ టీషర్లు, స్లిప్పర్సు ధరించానా? బ్లూ షర్లు, బ్లాక్ ప్యాంటు, షూ.. ఇలా కంప్లీట్ ఫార్మల్ వేర్ లో ఉండటం తప్పెలా అవుతుంది?' అని మనసులో మాటను మిత్రులతో పంచుకున్నారు. అసలీ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోలేదని, ఆయన తనకు 'హలో' చెప్పారని, మీడియానే ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేసిందని అమిత్ కటారియా పేర్కొన్నారు. గతవారం ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ 24 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనలో ప్రోటోకాల్ కు విరుద్ధంగా నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ దుస్తులు ధరించినందుకు బస్తర్ కలెక్టర్ అమిత్ కటారియాకు ఛత్తీస్గఢ్ సర్కారు నోటీసులు కూడా జారీచేసింది.