మారుతున్న ఖాకీ నెక్కరు...
రాంచి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనగానే మనకు ఖాకీ నెక్కరు, తెల్లని షర్టు, నెత్తిన నల్ల టోపి, నడుముకు తోలు బెల్టు గుర్తుకొస్తాయి. తరాలు మారుతున్నా డ్రెస్ కోడ్ మారక పోవడం పట్ల ఆరెస్సెస్ నేతలే ఎప్పటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి తరంతోపాటు డ్రెస్ కోడ్ మారకపోవడం వల్లనే నేటి యువత ఆరెస్సెస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపించడం లేదని వాదనలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచిలో గతవారం జరిగిన చర్చల్లో డ్రెస్ కోడ్ గురించి నేతలు ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్, సర్‌కార్యవాహ్ భయ్యాజీ జోషి లాంటి వారు డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని అభిప్రాయపడగా, మహారాష్ట్రకు చెందిన ఆరెస్సెస్ నేతలు మాత్రం విభేదించారు. డ్రెస్‌కోడ్ మార్చాల్సిందేనని వాదించిన వారిలో కూడా ఎలాంటి దుస్తులు ఉండాలి, అవి ఏ రంగుల్లో ఉండాలి, ఎలాంటి బూట్లు ధరించాలనే విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్యాంట్‌తోపాటు పలురంగుల చారలుగల తెల్లిటి షీ షర్టులు ధరించాలని కొంత మంది, ఖాకీ లేదా బ్లూ కలర్ ప్యాంటులతోపాటు స్లీవ్‌లెస్ తెల్లటి టీ షర్టులు ధరించాలని మరికొందరు, తెల్లటి బూట్లు, ఖాకీ సాక్సు ధరించాలని ఇంకొందరు సూచించారు.
నెత్తిన నల్లటోపీని కొనసాగించడం, ప్యాంట్లు, ఖాకీ సాక్స్ ధరించే విషయంలో మాత్రం అందరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తంగా డ్రెస్ కోడ్ ఎటూ తేలకపోవడంతో వచ్చే ఏడాది మార్చి నెలలో పుణెలో జరుగనున్న అఖిల భారత ఆరెస్సెస్ మహాసభలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
1925లో ఆరెస్సెస్ పుట్టినప్పుడు పూర్తిగా ఖాకీ నెక్కరు, ఖాకీ చొక్కానే ఉండేది. 1939 వరకు అదే డ్రెస్ కోడ్ కొనసాతూ వచ్చింది. నాజీలు, ఇటలీ నియంత ముస్సోలిని సైన్యం ప్రభావంతో తెల్లటి చొక్కాలు వచ్చాయి. 1973లో తోలు బూట్ల స్థానంలో లాంగ్ బూట్లు వచ్చి చేరాయి. ఆ తర్వాత రెగ్జిన్ బూట్లు వచ్చి చేరాయి. 2010లో క్యాన్వాస్ బెల్టు స్థానంలో తోలు బెల్టు వచ్చింది. ఆ తర్వాత నాజీల డ్రెస్‌కోడ్‌తోపాటు నాజీల్లా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ లాంటి పార్టీల నుంచి విమర్శలు ఎదురవుతుండడంతో అప్పటి నుంచి డ్రెస్ కోడ్ మార్చడంపై అడపాదడపా చర్చలు సాగుతూనే ఉన్నాయి.