khaki nikker
-
మహిళల ఓట్లు నాకే
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత ఆజంఖాన్ ఇటీవల తనపై చేసిన అసభ్యకర ‘ఖాకీ నిక్కర్’ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించకపోవడాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో తప్పుబట్టారు. ఈ అంశంలో అఖిలేశ్ మౌనం వహించడంతో ఇప్పుడు మహిళలు ఆ పార్టీకి దూరం అయ్యారనీ, ఇక స్త్రీలంతా తనకే ఓటు వేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్‌లో ఎస్పీ తరఫున ఆజంఖాన్, బీజేపీ తరఫున జయప్రద పోటీ చేస్తుండటం తెలిసిందే. అఖిలేశ్ సమక్షంలోనే ఆజం ఖాన్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నా అఖిలేశ్ ఏమీ అనలేదనీ, కాబట్టి ఆయన మనస్తత్వం కూడా ఆజంఖాన్ లాంటిదేనని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే అభద్రతా భావంతోనే ఆజంఖాన్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఉంటాడని జయప్రద పేర్కొన్నారు. ఆంజఖాన్ వ్యాఖ్యలు చేయడం చిన్న అంశమంటూ అఖిలేశ్ భార్య డింపుల్ అనడం పట్ల జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశం మొత్తం తనవైపు ఉంటే డింపుల్, జయా బచ్చన్, షబానా అజ్మీలు మాత్రమే తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆజంఖాన్ ప్రచారం చేయకుండా 72 గంటలపాటు నిషేధించిన ఎన్నికల సంఘానికి, అలాగే ఈ అంశంపై స్పందించి ఆజంఖాన్‌కు నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్‌కు జయప్రద ధన్యవాదాలు తెలిపారు. అన్నా అని పిలిచి తప్పు చేశా.. ఆజంఖాన్‌ను అన్నా అని పిలిచి తాను తప్పు చేశానని జయప్రద అన్నారు. ఖాన్ పైకి కనిపించేంతటి మంచి మనిషి కాదనీ, లోపల ఇంకో మనిషి ఉన్నాడని ఆయనే స్వయంగా నిరూపించుకున్నాడన్నారు. ఆజంఖాన్‌ను అన్నా అని పిలిచినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని జయప్రద అన్నారు. ఖాన్ వ్యాఖ్యలతో రాంపూర్ మహిళలంతా తన పక్షాన నిలవనున్నారనీ, ఇప్పుడు పోటీలో ఉన్నది జయప్రద కాదు, ప్రజలేనని ఆమె అభివర్ణించారు. రాంపూర్ లోక్‌సభ స్థానానికి జయప్రద 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అప్పటి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా అమర్‌సింగ్‌తో కలిసి ఎస్పీ నుంచి బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం రాంపూర్‌లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యల విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తనకు మద్దతు తెలపకపోవడంపై జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. -
మారుతున్న ఖాకీ నెక్కరు...
రాంచి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనగానే మనకు ఖాకీ నెక్కరు, తెల్లని షర్టు, నెత్తిన నల్ల టోపి, నడుముకు తోలు బెల్టు గుర్తుకొస్తాయి. తరాలు మారుతున్నా డ్రెస్ కోడ్ మారక పోవడం పట్ల ఆరెస్సెస్ నేతలే ఎప్పటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి తరంతోపాటు డ్రెస్ కోడ్ మారకపోవడం వల్లనే నేటి యువత ఆరెస్సెస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపించడం లేదని వాదనలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచిలో గతవారం జరిగిన చర్చల్లో డ్రెస్ కోడ్ గురించి నేతలు ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్, సర్కార్యవాహ్ భయ్యాజీ జోషి లాంటి వారు డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని అభిప్రాయపడగా, మహారాష్ట్రకు చెందిన ఆరెస్సెస్ నేతలు మాత్రం విభేదించారు. డ్రెస్‌కోడ్ మార్చాల్సిందేనని వాదించిన వారిలో కూడా ఎలాంటి దుస్తులు ఉండాలి, అవి ఏ రంగుల్లో ఉండాలి, ఎలాంటి బూట్లు ధరించాలనే విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్యాంట్తోపాటు పలురంగుల చారలుగల తెల్లిటి షీ షర్టులు ధరించాలని కొంత మంది, ఖాకీ లేదా బ్లూ కలర్ ప్యాంటులతోపాటు స్లీవ్‌లెస్ తెల్లటి టీ షర్టులు ధరించాలని మరికొందరు, తెల్లటి బూట్లు, ఖాకీ సాక్సు ధరించాలని ఇంకొందరు సూచించారు. నెత్తిన నల్లటోపీని కొనసాగించడం, ప్యాంట్లు, ఖాకీ సాక్స్ ధరించే విషయంలో మాత్రం అందరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తంగా డ్రెస్ కోడ్ ఎటూ తేలకపోవడంతో వచ్చే ఏడాది మార్చి నెలలో పుణెలో జరుగనున్న అఖిల భారత ఆరెస్సెస్ మహాసభలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 1925లో ఆరెస్సెస్ పుట్టినప్పుడు పూర్తిగా ఖాకీ నెక్కరు, ఖాకీ చొక్కానే ఉండేది. 1939 వరకు అదే డ్రెస్ కోడ్ కొనసాతూ వచ్చింది. నాజీలు, ఇటలీ నియంత ముస్సోలిని సైన్యం ప్రభావంతో తెల్లటి చొక్కాలు వచ్చాయి. 1973లో తోలు బూట్ల స్థానంలో లాంగ్ బూట్లు వచ్చి చేరాయి. ఆ తర్వాత రెగ్జిన్ బూట్లు వచ్చి చేరాయి. 2010లో క్యాన్వాస్ బెల్టు స్థానంలో తోలు బెల్టు వచ్చింది. ఆ తర్వాత నాజీల డ్రెస్కోడ్తోపాటు నాజీల్లా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ లాంటి పార్టీల నుంచి విమర్శలు ఎదురవుతుండడంతో అప్పటి నుంచి డ్రెస్ కోడ్ మార్చడంపై అడపాదడపా చర్చలు సాగుతూనే ఉన్నాయి.