
ప్యాంట్, షర్ట్‌తో మహిళా పోలీసులు
కర్ణాటక, బనశంకరి : మహిళా పోలీసుల డ్రెస్ కోడ్‌లో పోలీసు శాఖ సంపూర్ణ మార్పులు తెచ్చింది. విధి నిర్వహణలో అనుకూలంగా ఉండేలా ఖాకీ చీరల స్థానంలో ఖాకీ ప్యాంట్, షర్ట్ ధరించాలనే ఆదేశాలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. మహిళా కానిస్టేబుళ్లు చీరలు ధరించి విధులు నిర్వర్తించడం కష్టతరంగా ఉండటం, నేరాలు జరిగిన సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి, నేరస్థులను వెంబడించడానికి ఇబ్బందిగా ఉండటంతో గతనెల 3న పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో డీజీపీ నీలమణి రాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో డ్రెస్‌కోడ్‌లో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై చీరలకు బదులు ఖాకీ ప్యాంట్, షర్ట్ ధరించాలని, చెవి కమ్మలు, నుదుట బొట్టు, చేతి గాజులు చిన్నసైజులో ఉండాలని, ఒక చేతికి చిన్నసైజులో లోహంతో చేసిన గాజు ధరించవచ్చంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. కేశాలంకరణలో కొన్ని మార్పులు చేశారు. జుట్టును వదులుగా వదిలేయకుండా కొప్పుగా చుట్టి నల్లరంగు నెట్టెడ్ బ్యాండ్‌తో ముడి వేసుకోవాలని ఆదేశాల్లో సూచించారు. నల్లరంగు హెయిర్‌డై మినహా జుట్టుకు ఏ ఇతర రంగు వేయరాదు. పూలు పెట్టుకోవడాన్ని కూడా నిషేధించారు. శాఖలోని మహిళా అధికారి నుంచి సిబ్బంది వరకు ఒకే డ్రస్‌కోడ్ అమలులో ఉంటుంది.