ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆంగ్ల సంవత్సరాది వేళ దుర్గమ్మ భక్తులందరూ ఇకపై ఫ్యాషన్ దుస్తులను వదిలి, సంప్రదాయ దుస్తుల్లోనే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. ఈ మేరకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి కొత్త సంప్రదాయానికి ఆలయ అధికారులు తెరలేపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఇకపై తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఈవో వీ.కోటేశ్వరమ్మ తెలిపారు. అలా వచ్చిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని ఆలయ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పురుషులు ఫ్యాంట్, షర్టు లేదా పంచె, లుంగీ ధరించి రావచ్చు.
ఇక మహిళలు, యువతులు పంజాబీ డ్రస్సు, టాప్‌పై తప్పని సరిగా చున్నీ ధరించి రావాలని సూచించారు. మహిళలు చీరలు, లంగా వోణీలు ధరించి దర్శనానికి రావచ్చన్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు టీ షర్టులు, ఫ్యాంట్‌లు ధరించి ఆలయానికి రావద్దని పేర్కొన్నారు. అలాగే పురుషులు, స్త్రీలు షాట్స్, సీవ్‌లెస్ టీ షర్టులు ధరించి రావద్దని సూచించారు. మరో వైపు అమ్మవారి దర్శనానికి సంప్రదాయ దుస్తుల్లో రాని పక్షంలో ఆలయ ప్రాంగణంలోనే దేవస్థానం నిర్వహించే ప్రత్యేక కౌంటర్‌లో రూ.100కు చీర అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అమ్మవారి దర్శానానికి సంప్రదాయ దుస్తుల్లోనే అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించగా, ఆర్జిత సేవల్లో గత కొన్ని నెలలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment