టీచర్లతో లవ్వా.. హవ్వ!
ఓ లలనా...ఓ సఖియా అంటూ ఓ విద్యార్థి, ఓ లేడీ టీచర్ చేతులు పట్టుకొని చెట్టూపుట్టలు తిరుగుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోవడం చూసి తమిళనాడు ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. విద్యాశాఖాధికారులను పిలిచి చీవాట్లు పెట్టింది. ఇలాంటి పాశ్చాత్య తరహా పోకడలను తక్షణమే అరికట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కదయనల్లూర్‌లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో గత మార్చి 31న ఓ 26 ఏళ్ల లేడీ టీచరు, ఓ పదహారేళ్ల కుర్రాడిని ప్రేమించి అతడితో పారిపోయింది. ఈ సంఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత దిండుగల్ జిల్లాలోని ఓ ట్యుటోరియల్ కాలేజీలో 22 ఏళ్ల లేడీ టీచర్, నీవు లేక నేను లేను.....అంటూ 20 ఏళ్ల అబ్బాయితో ఉడాయించింది. ఈ రెండు సంఘటనలపై దుమారం రేగడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది.
ఆగమేఘాల మీద కదిలిన విద్యాశాఖ అధికారులు వెంటనే ఓ ఫార్మల్ కమిటీని ఏర్పాటు చేశారు. సదరు కమిటీ వారు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్లను పిలిపించి ఇలాంటి ప్రేమ కలాపాలను అరికట్టడం ఎలా ? అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడంతోపాటు లేడీ టీచర్లకు 'ప్రవర్తనా నియమావళి'ని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ నాయకుల్లో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
చర్మం కనిపించేలా స్కర్టులు, టీ షర్టులు, జీన్ పాంట్ల లాంటి పాశ్చాత్య దుస్తులను లేడీ టీచర్లు ధరించరాదని, సామాజిక వెబ్‌సైట్ల ప్రభావం పెరిగిన నేపథ్యంలో తరగతి గదిలోకి వారు సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదని, ప్రేమకలాపాలపై నిఘా ఉంచేందుకు విద్యా సంస్థల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమేరాలను అమర్చాలని 'తమిళనాడు హయ్యర్ సెకండరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు ఆంటోని అంబరసు, 'తమిళనాడు గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు ఎస్. తమిళాని ఆ చర్చల్లో వాదించారు.
తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లొద్దనడం సమంజసమేనని, డ్రెస్ కోడ్ నిర్దేశించడం సమంజసం కాదని, ఇప్పుడు దీన్ని అనుమతిస్తే మున్ముందు ముఖాలు కూడా కనిపించకుండా ముసుగులు వేసుకోమనే కోడ్‌కు దారితీస్తుందని పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎస్. మురుగన్ వాదించారు. విద్యార్థులకు ప్రవర్తనా నియమావళి ఉండాలి గానీ, టీచర్లకు ప్రవర్తనా నియమావళి ఏంటని కొంత మంది ఫెమినిస్టులు వాదించారు. చివరకు వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విద్యాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మౌఖిక ఆదేశాలతో లేడీ టీచర్లకు 'కోడ్', విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చారు. విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఓ పాఠశాలలో లేడీ టీచర్లంతా కలిసి 'వియ్ లవ్ అవర్ టీచర్స్' అనే అక్షరాల క్రమంలో విద్యార్థులను కూర్చోబెట్టారు. ఇందులో కూడా 'లవ్వే' ఉంది కదా! అని ఆ విద్యార్థులంతా ఎంత బుద్ధిగా కూర్చున్నారో!