
అన్నవరం (ప్రత్తిపాడు): తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించే భక్తులు ఇకపై విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. స్వామివారి వ్రతం, నిత్య కల్యాణం, ఇతర సేవలలో పాల్గొనేటప్పుడు, స్వామివారి దర్శనం సమయంలో తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అనుమతిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురుషులు పంచె, కండువా ధరించాల్సి ఉంటుందన్నారు. షర్టు ధరించవచ్చు, ప్యాంటు మాత్రం ధరించకూడదని తెలిపారు. మహిళలు చీర, పంజాబీ డ్రెస్ వంటివి ధరించాలి. ఫ్యాషన్ దుస్తులు ధరించి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఈవో వివరించారు.
దేవస్థానం సత్రాలలో వసతి గదులు తీసుకునే భక్తులు జూలై ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా గదులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గదులు కావాల్సినవారు తప్పనిసరిగా ఆధార్‌కార్డ్ చూపించాలన్నారు. ఎవరి పేరుపై రూమ్ రిజర్వ్ అయి ఉంటుందో వారికే రూమ్ ఇస్తారన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకున్న భక్తులు వారు రిజర్వేషన్ చేయించుకున్న సమయం దాటాక రెండు గంటల వరకు మాత్రమే గదులు ఇస్తారని, ఆ సమయం దాటితే మరో భక్తునికి ఆ గది కేటాయిస్తామన్నారు. నగదు వాపస్ కూడా ఇవ్వబోమని తెలిపారు.
ప్రాకారం, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు రద్దు
ఆలయ రక్షణ చర్యలలో భాగంగా జూలై ఒకటో తేదీ నుంచి స్వామివారి ఆలయ ప్రాకారంలో, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు చేసుకోవడం నిషేధించామని ఈవో తెలిపారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ఆలయం తలుపులు మూసేశాక ఆ ప్రదేశంలోకి ఎవరినీ అనుమతించరని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment