annavaram temple
-
సత్తెన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
అన్నవరం: రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పథకాలకు సంబంధించి గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి కొత్తది రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దేవస్థానానికి వచ్చే భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లు, పార్కింగ్ ప్రదేశాల అభివృద్ధి, వసతి సత్రాల నిర్మాణం తదితర మార్పులు చేపట్టాల్సి ఉంది. దేవస్థానం మాస్టర్ ప్లాన్ 2010లో రూపొందించారు. ఆ తరువాత పలు మార్పులు చేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్మాణాలు చేపట్టనున్నారు. వీటన్నింటిని దేవస్థానం మాస్టర్ ప్లాన్‌లో చేర్చనున్నారు. ప్రస్తుతం ఏమి ఉన్నాయంటే... ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లో కొత్తగా సత్రాల నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. నిర్మాణాలన్నీ సత్యగిరిపై చేపట్టాలని, మరిన్ని టాయిలెట్లు నిర్మించాలని, భక్తుల వాహనాల రాకపోకలకు వీలుగా ఘాట్‌రోడ్లు వెడల్పు చేయాలని, కొత్తగా క్యూ లు నిర్మించాలని అనుకున్నారు. కొత్తగా మాస్టర్ ప్లాన్‌లో చేర్చుతున్న అంశాలు ► దేవాలయానికి నాలుగు మాడావీధుల నిర్మాణం ► భక్తులు ఏటా 40 శాతం చొప్పున పెరగడం, వ్యక్తిగత వాహనాలపై వచ్చే భక్తులు ఎక్కువ కావడంతో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు ► వాహనాలు కొండ దిగువకు వెళ్లేందుకు ఎక్కువ రోడ్ల నిర్మాణం ► అన్నదాన శాల నుంచి, వివిధ సత్రాల నుంచి వచ్చే వ్యర్థాలు, టాయిలెట్స్ నుంచి వచ్చే వేస్ట్ కూ సూయెజ్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మంట్ ప్లాంట్ల నిర్మాణం ► దేవస్థానంలో వివిధ చోట్ల, ఘాట్‌రోడ్లలో విద్యుత్ దీపాలు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటు ► మారేడు, తులసి వనాలు, మామిడి, అరటి తదితర చెట్లు విరివిగా పెంచే చర్యలు ► వివిధ పుష్పాలతో కూడిన తోటల పెంపకం ► వసతి గదులు దొరకని భక్తులు సేద తీరేందుకు విశ్రాంతి షెడ్ల నిర్మాణం ► కొండ దిగువన భక్తుల కోసం మరిన్ని నిర్మాణాలు ► భక్తుల అవసరాలకు తగ్గట్టుగా రూపకల్పన ► నెలాఖరులోగా కమిషనర్‌కు ప్రతిపాదనలు భక్తుల అవసరాల మేరకు మార్పులు గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో కొత్తగా చేర్చాల్సిన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనుల గురించి ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపించాలని దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. త్వరలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుని కమిషనర్‌కు నివేదిక పంపుతాం. దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు ఇప్పటికే చేపట్టిన పలు నిర్మాణాలు మాస్టర్ ప్లాన్‌లో చేర్చుతాం. – చంద్రశేఖర్ అజాద్, ఈఓ, అన్నవరం దేవస్థానం -
East Godavari Famous Temples: తూర్పుకు వెళ్తే ఇంత మంది దేవుళ్లను చూడవచ్చా? (ఫొటోలు)
-
కొత్తగా వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ దేవాదాయశాఖ
-
సత్యదేవుని సన్నిధిలో భక్తజన జాతర
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తజన జాతరను తలపించింది. కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ వేలాది వాహనాల్లో భక్తులు తరలి రావడంతో దేవస్థానం ఘాట్‌రోడ్లలో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 1.50 లక్షల మంది సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీని తట్టుకోలేక ఒక దశలో రెండు గంటల పాటు వ్రతాల టికెట్ల విక్రయం నిలిపివేశారు. పశ్చిమ రాజగోపురం తలుపులు రెండు గంటలు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్లీ పశ్చిమ రాజగోపురం ద్వారా భక్తులను అనుమతించారు. వ్రతాల టికెట్లు విక్రయించారు. సాయంత్రం 5 గంటల సమయానికి సత్యదేవుని వ్రతాలు సుమారు 14 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు. -
అన్నవరానికి ఆధ్యాత్మిక శోభ ...
-
సత్యదేవుని ఆభరణాల డిజిటలైజేషన్
అన్నవరం: సత్యదేవుని బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల డిజిటలైజేషన్ ప్రక్రియ ఆదివారం ఆరంభమైంది. ఉత్సవాలు, ఇతర పర్వదినాల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలను డిజిటలైజ్ చేసేందుకు దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు ఆధ్వర్యాన ఫొటోలు తీయించారు. స్వామి వారికి ప్రతి రోజూ అలంకరించే ఆభరణాలను తీయడం సాధ్యం కాదు కనుక వాటిని స్వామివారి జన్మనక్షత్రం మఖ నాడు మూలవిరాట్‌కు అభిషేకం చేసేందుకు తీసినపుడు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి కిరీటాలు, హారాలు, నేత్రాలు, స్వామివారి మీసం, కర్ణాభరణాలు, బంగారు పాత్రలు, పళ్లాలు సుమారు వంద ఆభరణాలను ఆదివారం రికార్డు ప్రకారం తూకం వేసి, ఫొటోలు తీయించారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట శ్రీనివాస్, అర్చకుడు సుధీర్, అకౌంట్స్ సెక్షన్ సూపరింటెండెంట్లు అనకాపల్లి ప్రసాద్, బలువు సత్య శ్రీనివాస్, ఎస్పీఎఫ్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటలైజేషన్లో భాగంగా ప్రతి ఆభరణాన్నీ ఫొటో తీసి, రికార్డుల ప్రకారం సరి చూసి, దాని పేరు, బరువు, ఇన్వెంటరీ నంబర్, తనిఖీ చేసిన తేదీ తదితర వివరాలతో ఆల్బమ్ చేయించి, దేవస్థానం వెబ్సైట్లో పొందుపరుస్తారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి నిత్యం అలంకరించే ఆభరణాలు సుమారు 200 ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో వాడి పాతబడటంతో ప్రస్తుతం దేవస్థానం లాకర్లలో ఉంచిన ఆభరణాలు మరో 200 ఉన్నాయి. వీటి రక్షణకు దేవస్థానంలో నిత్యం 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రధానాలయం వద్ద కాపలా ఉంటారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవస్థానంలో గతంలో గోల్డ్ బాండ్ కోసం ఎస్బీఐకి ఇవ్వగా మిగిలిన ఆభరణాలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నామని ఈఓ త్రినాథరావు చెప్పారు. రామాలయం, వనదుర్గ, కనకదుర్గ, నేరేళ్లమ్మ ఆలయాల్లోని ఆభరణాలను సోమవారం, బ్యాంకుల్లోని ఆభరణాలను మంగళవారం డిజిటిలైజ్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వాడకంలో లేని ఆభరణాలను దేవస్థానానికి తిరిగి జమ చేయాల్సిందిగా అర్చకులను ఆదేశించామన్నారు. డిజిటలైజేషన్ వలన భవష్యత్తులో ఆ ఆభరణం చోరీ అయినా లేక పాడయినా దాని వివరాలు తెలుస్తాయని ఈఓ తెలిపారు. (క్లిక్: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు!) -
Omicron Effect: కరోనా నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు
సాక్షి, అమరావతి/కాణిపాకం (యాదమరి): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు జారీ చేసే పూజలు, సేవల టికెట్లను సగానికి సగం కుదించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నా.. గంటకు గరిష్టంగా వెయ్యి మందికి మించి క్యూ లైన్లలోకి అనుమతించవద్దని ఆదేశించారు. అంతరాలయ దర్శనాలు, తీర్థప్రసాదాల పంపిణీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని.. అన్నదానం కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఎవరి వద్దనైనా మాస్క్ లేకపోతే వారికి నిర్ణీత ధరకు ఆలయం వద్ద మాస్క్ లభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా రెండు మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఆన్లైన్ సేవలను ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలను సడలించే అధికారాన్ని ఈవోలకు కల్పించారు. కరోనా నిర్మూలనకు నిత్యం హోమాలు.. కరోనా నిర్మూలన లక్ష్యంగా దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో రోజూ మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, సీతాళ హోమం, ఆయుష్య హోమం, విరాట పర్వ పారాయణం చేపట్టాలని ఈవోలను దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. చిన్న ఆలయాల్లో సహస్ర నామ పారాయణాలు ప్రతి రోజూ నిర్వహించాలని సూచించారు. -
శ్రావణ మాసం: ఒకే రోజు 300 పెళ్లిళ్లు
అన్నవరం: శ్రావణ మాసం వచ్చింది. శతమానం భవతి అంటూ పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు ముడుల బంధంతో.. ఏడడుగులు వేసి 300 జంటలు ఒక్కటయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణం వధూవరులు వారి బంధుమిత్రులతో కోలాహలంగా మారింది. గతేడాది కరోనా విజృంభణ తరువాత ఇంత భారీగా వివాహాలు జరగడం ఇదే తొలిసారి. దేవస్థానంలోని సత్యగిరిపై ఇటీవల ప్రారంభించిన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపంలోని 12 వివాహ వేదికల్లో శుక్రవారం రాత్రి 10 గంటల ముహూర్తంలో తొలిసారి వివాహాలు జరగడంతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది. వివాహాలు చేసుకున్న వారికి కల్యాణ మండపంతో పాటు అవసరమైన సామగ్రిని దాత మట్టే శ్రీనివాస్ ఉచితంగా సమకూర్చి నూతన వస్త్రాలను బహూకరించారు. -
రేపటి నుంచి ధనుర్మాసం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, ధనుర్మాస ఘడియలు 2021 జనవరి 14న ముగియనున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరాజ మఠాధిపతి కర్ణాటకలోని ప్రముఖ ద్వైత సంస్థానం వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీశ తీర్థ స్వామి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అర్చకులు, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సత్యదేవుడి కార్తీక ఆదాయం రూ. పది కోట్లు అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానానికి కార్తికమాసం సిరులు కురిపించింది. భారీగా తరలివచ్చిన భక్తులు హుండీలలో సమరి్పంచిన కానుకలను సోమవారం లెక్కించారు. 1,85,71,847 ఆదాయం వచి్చంది. 33 గ్రాముల బంగారం, 630 గ్రాముల వెండి కూడా లభించిందని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాధరావు తెలిపారు. ఇది 32 రోజుల హుండీ ఆదాయం కాగా..అందులో 29 రోజులు కార్తీకమాసమని వివరించారు. ఒకేసారి హుండీ లెక్కింపులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమమని చెప్పారు. దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా ఇప్పటికే సుమారు రూ. 8 కోట్లు పైబడి ఆదాయం వచి్చందని, ప్రస్తుత హుండీ ఆదాయం రూ.1.85 కోట్లు కలిపితే ఆదాయం సుమారు రూ. పది కోట్ల వరకు వచి్చందని అధికారులు తెలిపారు. భక్తుల ఇంటికే అయ్యప్ప ప్రసాదం హైదరాబాద్: కోవిడ్–19 నిబంధనల కారణంగా ఈసారి శబరిమలకు వెళ్లలేని భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం తపాలా శాఖ సహకారంతో భక్తుల ఇంటికే అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. భక్తులు తమకు సమీపంలోని తపాలా శాఖ కార్యాలయాల్లో రూ.450 చెల్లిస్తే చాలు.. పది రోజుల్లో అయ్యప్ప ప్రసాదంతో కూడిన కిట్ స్పీడ్‌పోస్ట్ ద్వారా కోరుకున్న అడ్రస్‌కు చేరుతుంది. ప్రసాదం కిట్‌లో అరవన్న పాయసంతో పాటు స్వామివారి అభిషేకం నెయ్యి, పసుపు, కుంకుమ, విబూది, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. పది రోజుల్లో కిట్ ఇంటికి చేరుతుంది. అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం జరిగే మకరసంక్రాంతి వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు -
అన్నవరం లో నిహారిక చైతన్య ప్రత్యేక పూజలు
-
అన్నవరం దేవస్థానంలో కరోనా కలకలం..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి వరకు పది మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఇవాళ 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, మరో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరించడంతో అర్చకులు,సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. -
ఫొటోలు.. 'సెల్'చల్
తూర్పుగోదావరి ,అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయంలో నిత్యం భక్తుల పూజలందుకునే సత్యదేవుడు, దేవేరీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల మూల విరాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫొటోలు ఎవరు తీశారు? అవి ఎలా బయటకొచ్చాయనే ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించడంతో చిక్కుముడి వీడింది. స్వామివారి ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6.19 గంటలకు స్వామివారి గర్భాలయంలో పుష్పాలంకరణ చేసిన స్థానిక కాంట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తి ఈ ఫొటోలు తీసినట్టు గుర్తించారు. రత్నగిరిపై స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫొటోలు తీయడానికి వీల్లేదు. అసలు కెమెరా, సెల్ఫోన్లను ఆలయంలోనికే అనుమతించరు. ఇప్పుడు కరోనాతో దేవస్థానంలో షాపులన్నీ మూసి ఉండడంతో అందరూ ఫోన్లతోనే ఆలయం లోపలికి వెళుతున్నారు. ఎవరైనా స్వామి, అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయత్నించినా అక్కడ సిబ్బంది, అర్చకస్వాములు, ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకుంటారు. ఫొటో తీసి ఉంటే దానిని డిలీట్ చేసే వరకు ఊరుకోరు. అటువంటిది స్వర్ణాభరణాలు, నూతన పట్టువస్త్రాలు, పుష్పాలంకరణలో ఉన్న స్వామి, అమ్మవార్ల ఫొటోలు బుధవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో దేవస్థానంలో అందరూ షాక్‌కు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం వరకు స్వామివారి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రానికి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. దీనిపై విచారణ జరపాలని ఈఓ త్రినాథరావు ఇన్‌ఛార్జి డిప్యూటీ ఈఓ ఈరంకి జగన్నాథరావును ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం డిప్యూటీ ఈఓ సమక్షంలో సీసీ పుటేజీ పరిశీలించగా మంగళవారం సాయంత్రం ఆలయంలో పుష్పాలంకరణ చేసిన పనివారిలో ఒకరు ఫొటోలు తీయడం సీసీ టీవీ లో కనిపించింది. అతడి పక్కనే దేవస్థానం పల్లకీ బోయీ ఒకరున్నా ఫొటోలు తీయవద్దని వారించకపోవడం కనిపించింది. దీంతో ఆ పల్లకీ బోయీని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఫొటోలు తీసిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సంబంధి అధికారులను ఈఓ త్రినాథరావు ఆదేశించారు. ఇతర సిబ్బందిపై కూడా చర్యలు ఉండవచ్చని సమచారం. సిబ్బందిలో నిర్లిప్తిత కరోనా కారణంగా స్వామివారి ఆలయానికి భక్తుల రాక చాలా తక్కువగా ఉంటోంది. గతంలో సాధారణ రోజుల్లో రోజుకు పదివేల నుంచి 30 వేలమంది, పర్వదినాల్లో 50 వేల పైబడి వచ్చేవారు. అటువంటిది ఇప్పుడు పట్టుమని రోజుకు వేయి మంది కూడా రావడం లేదు. భక్తులకు అంతరాలయం దర్శనం, తీర్థప్రసాదాల వితరణ, శఠగోపం వంటివి లేకపోవడంతో భక్తులు స్వామివారిని వెలుపల నుంచి తిలకించి వెళ్లిపోవల్సి వస్తోంది. ఆ భక్తులు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే వస్తున్నారు. ఆ తరువాత దేవస్థానం ఖాళీ అవుతోంది. దీనివలన సిబ్బందిలో కొంత నిర్లిప్తిత ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
అన్నవరం దేవస్థానంలో అగ్నిప్రమాదం
సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : అన్నవరం దేవస్థానంలో అకౌంట్స్ విభాగం పక్కన గల కంప్యూటర్ సర్వర్ రూమ్‌లో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సర్వర్ ఎక్విప్మెంట్, ఏసీ మెషీన్, సీలింగ్, ఇతర విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. మొత్తం రూ.నాలుగు లక్షలు పైగా నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంతో దేవస్థానంలో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో కాలిపోయిన పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ఆదివారం ఉదయానికల్లా అన్ని రకాల ఆన్లైన్ సేవలు యథావిధిగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని దేవస్థానం ఈవో వి. త్రినాథరావు విలేకరులకు తెలిపారు. దేవస్థానంలోని కంప్యూటర్ సర్వర్ రూమ్‌లో నుంచి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో సిబ్బంది అప్రమత్తమై మినీ అగ్నినిరోధక యంత్రాలు డీపీసీలు (డ్రై కెమికల్ పౌడర్స్) తో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే తుని అగ్నిమాపక కార్యాలయ ఇన్చార్జి రమణ తదితరులు దేవస్థానానికి చేరుకునేలోపే దేవస్థానం సిబ్బంది , హోమ్‌గార్డు నాగేశ్వరరావు తదితరులు మంటలను ఆదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ పరిసరాలలో విద్యుత్తు నిలిపేశారు. గత జూన్‌లో సీసీ టీవీ కంట్రోల్ రూమ్‌లోనూ అగ్నిప్రమాదం గత జూన్ నెల 24 వ తేదీన ఈ గది మేడమీద గల సీసీటీవీ కంట్రోల్ రూమ్ షార్ట్‌సర్క్యూట్ కు గురై కొన్ని పరికరాలు దగ్ధమయ్యాయి. అప్పుడు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, అప్పటి ఈవో సురేష్ బాబు సీసీ టీవీ కంట్రోల్ రూమ్‌ను దిగువకు మార్పు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకూ అలా జరగలేదు. హుటాహుటిన వచ్చిన ఈవో అధికారిక కార్యక్రమంలో కోసం కాకినాడ వెళ్లిన ఈవో త్రినాథరావు ఈ అగ్నిప్రమాదం వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన దేవస్థానానికి తిరిగివచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ సర్వర్ రూమ్‌ను మరో చోటకు మార్చాలని ఆదేశించినట్టు తెలిపారు. గత జూన్‌లో కూడా సీసీ కెమెరాల సర్వర్ రూమ్‌లో ఇదే విధంగా జరిగిందని, రెండు సర్వర్లు ఒకేచోట ఉండేలా కొత్తగా గది నిర్మించి నెల్లాళ్ల లోగానే మార్పు చేస్తామన్నారు. -
యథా నేత... తథా మేత
‘యథారాజా తథా ప్రజా’ అని ఊరకే అనలేదు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ అధినేత నుంచి కింది స్థాయి వరకు ‘అవినీతి మా జన్మహక్క’న్నట్టుగా చెలరేగిపోయారు. ఇందుకు దేవస్థానాలనూ మినహాయించలేదు. పాపభీతిని పక్కన పెట్టేసి పైసాయే పరమాత్మంటూ చెట్టాపట్టాలేసుకుంటూ చేతివాటాలకు దిగారు. ‘వడ్డించేవాడు మనోడైతే భయమెందు’లకనే ధీమాతో కోట్ల రూపాయలు వెనకేసుకోడానికి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పరుగులు తీశారు. వచ్చే సర్కారు తమదే అనే అహంకారంతో ఆ అవినీతిని మరింత విస్తరింపజేసే క్రమంలో వారి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్సార్సీపీ సర్కారు అధికారం చేపట్టడంతో ‘పచ్చ’ తిమింగలాల పరిస్థితి గందరగోళంగా మారింది. సాక్షి, రాజమహేంద్రవరం : అవినీతి రహిత పాలనే ప్రధాన అజెండాగా నడుస్తున్న వైఎస్సార్సీపీ సర్కారు గత ప్రభుత్వంలో అవినీతిపరులపై దృష్టిని సారించింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితోపాటు జిల్లా మంత్రులు కూడా ఇదే బాట పడుతున్నట్టు ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశం ద్వారా ప్రత్యక్షంగానే హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లాలో పలు ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ కూడా ముగిసిన ఇద్దరిపై వేటు వేయడానికి రంగం సిద్ధమయింది. ఉన్నతాధికారుల ముందుకు వెళ్లిన తొలి జాబితాలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు, అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న పీఆర్ఓ తులా రాము ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలను ప్రసన్నం చేసుకుని వీరిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ప్రభుత్వం మారినా పాత పంథా వీడకపోవడంతో వీరిద్దరిపై నిర్వహించిన విచారణ పూర్తయింది. దీంతో చర్యలకు సిఫార్సు చేస్తూ మూడు రోజుల కిందటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. ప్రిన్సిపాల్ వేధింపుల పర్వం... రాజమహేంద్రవరం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపుల వ్యవహారంపై విచారణ మొదలు పెడితే చివరకు కాలేజీలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ‘తీగ లాగితే డొంక కదిలినట్లుగా తవ్వేకొద్దీ అవకతవకల పుట్ట బయటపడిందని సమాచారం. కాలేజీలో పనిచేస్తున్న 17 మంది మహిళా అధ్యాపకులు పనిచేసే ప్రాంతంలో మానసిక వేధింపులపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడం, అధ్యాపకులు తమ గోడు స్త్రీ, శిశు సంక్షేమం, విద్యాశాఖా మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో తీవ్రంగా పరిగణించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ డైరెక్టర్ నగేష్‌కుమార్ కళాశాలలో విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. అధ్యాపకుల వేధింపులే కాకుండా కళాశాలలో పలు అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గడచిన మూడున్నరేళ్లుగా అరాచకాలు చేస్తున్నా సంబంధితాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ఫీజుల్లో రాయితీలు ఇవ్వకుండా అక్రమ వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ ధర కంటే అదనంగా యూనిఫారాలు విక్రయించడంలోనే పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని నిగ్గు తేలిందని సమాచారం. కళాశాల రికార్డులను సీజ్ చేసి విచారణ అధికారులు వారి వెంట తీసుకువెళ్లారు. ఇది చదవండి : మహిళా అధ్యాపకులపై ప్రిన్సిపల్ వేధింపులు మాయమైన రంగూన్ కలప... బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనంలో కలపను కూడా ప్రిన్సిపాల్ హయాంలో మాయమైందని గుర్తించారు. ఇది ఒకప్పుడు ప్రిన్సిపాల్ కార్యాలయంగా వినియోగించే వారు. ఈ భవనాన్ని రంగూన్ కలపతో 10 గదులతో నిర్మించారు. ఈ భవనం అంతా పూర్తిగా ఖరీదైన కలపతో నిర్మించినదే. ఉడెన్ స్టైర్‌కేస్, టేకుతో తయారుచేసిన పైకప్పుతో పాతబడి పోయిన ఈ భవనాన్ని నేలమట్టం చేసేసి అందులో కలప ఏంచేశారో తెలియని పరిస్థితి. ఎంత తక్కువ లెక్కలేసినా రూ.50 లక్షలు పైమాటేనంటున్నారు. కలపతోపాటు కళాశాల ఆవరణలో ఉన్న పెద్ద, పెద్ద చెట్లను కూడా విక్రయించి సొమ్ము జేబులో వేసుకున్నారని విచారణలో నిగ్గు తేలిందని సమాచారం. విచారణ ఎంతవరకూ వచ్చిందనే అంశంపై రాజమహేంద్రవరం ఆర్జేడీ నగేష్‌కుమార్‌ను సంప్రదించగా అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందచేశామన్నారు. ఇంతకుమించి తాము మాట్లాడలేమని, నిర్ణయం ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. భగవంతుని సన్నిధిలో... దాదాపు ఇదే పరిస్థితి అన్నవరం సత్యదేవుని దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తులా రాము వ్యవహారం అని చెప్పుకోవచ్చు. సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగా ఉద్యోగం పొందడం, డిస్మిస్ అయి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే రెండు పదోన్నతులు పొందడం, సత్యదేవుని సన్నిధిలో అన్నింటా పెత్తనం చెలాయిస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా మెట్ట ప్రాంత ఎమ్మెల్యేల అండదండలతో అనేక అవకతవకలు, ఇష్టానుసారం కొండపై పెత్తనం చెలాయించారని ఎమ్మెల్యే పర్వత సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు దేవదాయశాఖ కమిషనర్ మన్మోహన్సింగ్ను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రీజినల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథ్ సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగా పోస్టింగ్, రెండు పదోన్నతులకు సంబంధించి కాగితపూర్వక ఆధారాలు, రికార్డులు, పలువురు ఈఓలు, అధికారులను రాజకీయ పలుకుబడితో పెత్తనం చెలాయించే వ్యవహారశైలిపై స్థానికులు, ఉద్యోగుల అభిప్రాయాలతో దేవదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు రెండు, మూడు రోజుల్లో చర్యలు వెల్లడించనున్నారు. -
సత్యదేవా.. పోస్టులకు రూ.లక్షలా!
సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహిత పోస్టుల భర్తీ, పదోన్నతుల విషయంలో రూ. లక్షలు చేతులు మారుతున్నాయని దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. పదోన్నతులకు రూ.50 వేలు, వ్రత పురోహిత పోస్టుకు రూ.3 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు.. దేవస్థానంలో కలకలం సృష్టించింది. కోర్టు తీర్పు ప్రకారం 13 మంది పురోహితులను ఇటీవల ఈఓ ఎంవీ సురేష్‌బాబు నియమించారు. గతేడాది డిసెంబర్లో 20 మందికి ఇచ్చిన పదోన్నతులు వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వీరికి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులతో బాటు గతంలో ఖాళీ ఏర్పడిన 30 రెండో తరగతి వ్రత పురోహితుల పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న 36 మూడో తరగతి వ్రత పురోహితుల పోస్టుల భర్తీ చేయడానికి కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఈ పదోన్నతులపైనే వివాదం ఏర్పడింది. మొత్తం 80 మంది మూడో తరగతి పురోహితులు పదోన్నతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కమిషనర్ ఉత్తర్వుల మేరకు సీనియర్లకే పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది జూనియర్ వ్రత పురోహితులు కూడా పదోన్నతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా భర్తీ చేసే వ్రత పురోహితుల పోస్టులకు కూడా గట్టి పోటీ ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు.. ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈఓగా ఆర్జేసీ వస్తారంటూ ప్రచారం ఇదిలా ఉండగా, దేవస్థానం ఈఓగా తిరిగి ఆర్జేసీ వి.త్రినాథరావు నియమితులవుతారన్న ప్రచారం సాగుతోంది. ఒకటి రెండ్రోజుల్లో ఆయనను నియమిస్తూ ఆదేశాలు వెలువడుతాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఈఓ సురేష్‌బాబు ఈ పదోన్నతులు, నియామకాలు చేపట్టాలని తొందర పడుతున్నారని కొంతమంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కొత్తగా పోస్టులు, పదోన్నతులు భర్తీ చేయడంలేదు కోర్టు తీర్పు ప్రకారం 13 మంది పురోహితులను నియమించడం, కమిషనర్ ఆదేశాల మేరకు గత డిసెంబర్లో ఇచ్చిన పురోహితుల పదోన్నతులను మాత్రమే అమలు చేయనున్నట్టు దేవస్థానం ఈఓ సురేష్‌బాబు తెలిపారు. కొత్తగా పదోన్నతులు, పోస్టుల భర్తీ చేయడం లేదని గురువారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. పదోన్నతులకు రూ.50 వేలు, పోస్టుకు రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారన్నది వట్టి ప్రచారం మాత్రమేనని, అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు. -
అన్నవరంలో కొత్త నిబంధన
అన్నవరం (ప్రత్తిపాడు): తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించే భక్తులు ఇకపై విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. స్వామివారి వ్రతం, నిత్య కల్యాణం, ఇతర సేవలలో పాల్గొనేటప్పుడు, స్వామివారి దర్శనం సమయంలో తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అనుమతిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురుషులు పంచె, కండువా ధరించాల్సి ఉంటుందన్నారు. షర్టు ధరించవచ్చు, ప్యాంటు మాత్రం ధరించకూడదని తెలిపారు. మహిళలు చీర, పంజాబీ డ్రెస్ వంటివి ధరించాలి. ఫ్యాషన్ దుస్తులు ధరించి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఈవో వివరించారు. దేవస్థానం సత్రాలలో వసతి గదులు తీసుకునే భక్తులు జూలై ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా గదులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గదులు కావాల్సినవారు తప్పనిసరిగా ఆధార్‌కార్డ్ చూపించాలన్నారు. ఎవరి పేరుపై రూమ్ రిజర్వ్ అయి ఉంటుందో వారికే రూమ్ ఇస్తారన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకున్న భక్తులు వారు రిజర్వేషన్ చేయించుకున్న సమయం దాటాక రెండు గంటల వరకు మాత్రమే గదులు ఇస్తారని, ఆ సమయం దాటితే మరో భక్తునికి ఆ గది కేటాయిస్తామన్నారు. నగదు వాపస్ కూడా ఇవ్వబోమని తెలిపారు. ప్రాకారం, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు రద్దు ఆలయ రక్షణ చర్యలలో భాగంగా జూలై ఒకటో తేదీ నుంచి స్వామివారి ఆలయ ప్రాకారంలో, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు చేసుకోవడం నిషేధించామని ఈవో తెలిపారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ఆలయం తలుపులు మూసేశాక ఆ ప్రదేశంలోకి ఎవరినీ అనుమతించరని వివరించారు. -
ఈ వేసవికి ఏసీలు లేనట్టే!
అన్నవరం సత్యదేవుడికి భక్తుల సంఖ్య పెరిగింది. ఆదాయం కూడా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో సత్యదేవుని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రత్నగిరి అంతా కాంక్రీటు జంగిల్‌గా మారడం, కొత్తగా నిర్మించిన స్వామివారి ఆలయాన్ని గ్రానెట్స్తో నిర్మించడంతో ఆలయంలో వేడి విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆలయంలో ఉక్కపోత మరింత పెరిగిపోయింది. వేసవి ప్రారంభంలో ఆలయాన్ని ఏసీ చేయించేందుకు దేవస్థానం పాలకమండలి, అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. భక్తులతోపాటు అర్చకులు కూడా ఉక్కపోతను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే.. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. అన్నవరం (ప్రత్తిపాడు): సత్యదేవుని ఆలయాన్ని ఏసీ చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత మార్చి నుంచి స్వామివారి ఆలయాన్ని ఏసీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వారానికో పని చొప్పున చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు వేసవి ఎండ తీవ్రతకు ప్రధానాలయంలో ఉక్కబోత భరించలేక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటలు ఆలయంలోనే ఉండి భక్తులకు సేవలందించే అర్చకస్వాముల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రస్తుతం ఆలయంలోకి ఏసీ గొట్టాలు అమర్చే పనులు చేస్తున్నారు. గదులు ఇంకా నాలుగైదు రోజులు పనిచేస్తే తప్ప ఆలయం ఏసీ వేసే ప్రక్రియ కాదని భావిస్తున్నారు. వేసవి ప్రారంభానికి ముందే చేస్తామన్నారు ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందే సత్యదేవుని ఆలయాన్ని ఏసీ చేయాలని ఫిబ్రవరి రెండో వారంలో రూ.7 లక్షల అంచనాతో టెండర్ పిలిచారు. రూ.6,14,900తో ఆలయంలో క్లోజ్డ్ ఏసీలు అమర్చేందుకు కాకినాడకు చెందిన నవ్యకళా ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. ఈ మొత్తానికి జీఎస్టీ అదనం. మొత్తం రూ.ఏడు లక్షలు వరకూ అవుతుందని అంచనా వేశారు. మార్చి 11న పాలకమండలి ఈ టెండర్‌ను ఖరారు చేసింది. పనులు వెంటనే ప్రారంభించాలని ఈఓ జితేంద్ర ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ 15న ఏసీ మెషీన్లను దేవస్థానానికి తీసుకువచ్చారు. వాటిని అదే నెలాఖరున ఆలయం వద్దకు చేర్చారు. ఈ నెల 4వ తేదీన ఆలయం శిఖరానికి చేర్చారు. 15వ తేదీ నుంచి మెషీన్ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేందుకు గొట్టాలు అమర్చే పనులు ప్రారంభించారు. ఆలయం లోపల మాత్రం పైపులు లేకుండా ఆలయ కిటికీల ద్వారా చల్లని గాలి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ మెషీన్ల సామర్థ్యం ఎక్కువ అయినందున పావు గంటలోనే ఆలయం అంతా చల్లబడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సగం వేసవికాలం అయిపోయింది. సాధ్యమైనంత త్వరగా ఏసీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు. -
ఈఓ గారూ.. ఏంటిదీ?
కిర్లంపూడి (జగ్గంపేట): ఆదాయం తక్కువ వస్తుందని, దేవుడిని కూడా వేలం వేస్తారా? అంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. కిర్లంపూడి గ్రామంలో దేవస్థానం నిధులతో చుట్టు పక్కల 20 గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో బాధలు, కష్టాలు పడి కల్యాణ మండపం నిర్మించుకున్నామన్నారు. పంచాయతీ ఉచితంగా ఇచ్చిన ఈ స్థలం విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందన్నారు. శుభకార్యాలు చేసుకునే వారికి టెంట్లు వగైరా వాటికి వేలాది రూపాయల ఖర్చు తగ్గించడం కోసం తక్కువ అద్దెతో ఇప్పించడానికి కట్టించిన మండపం అన్నది గుర్తు చేస్తున్నానన్నారు. కమీషన్ కోసం కట్టించింది కాదన్నారు. కానీ ప్రజల సుఖం కోసం కాకుండా వ్యాపార ధోరణితో మండపం దీర్ఘకాలం అద్దెకు ఇవ్వాలని నిర్ణయించి ఈనెల 12న టెండర్ పిలిచినట్టు తెలిసి బాధపడుతున్నానన్నారు. మీది వ్యాపార ధోరణి అయినప్పుడు ఉచితంగా ఇచ్చిన పంచాయతీ స్థలం విలువ ప్రకారం మీకు వచ్చే అద్దెలో వాటా ఇవ్వాలి కదా అన్నారు. అలా వచ్చే ఆలోచన ఉన్నప్పుడు టెండర్ ద్వారా వచ్చే అద్దెలో ఎవరి వాటా ఎంత అన్నది విభజన చేస్తారా? అని ప్రశ్నించారు. ఈఓ దగ్గర నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు నెలనెలా జీతాల నిమిత్తం లక్షలాది రూపాయలు ఇస్తున్నారు కదా, అలా జీతాలు లేని పద్ధతిలో ఈ ఉద్యోగాలన్నీ టెండర్ ద్వారా వేలం పెడితే దేవస్థానానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నారు. ఆ ఆలోచన ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు. చేతిలో కలం, పేపర్ ఉంది కదా అని తమరికి తోచిన ఆలోచనలు వస్తే మానుకోండి అన్నారు. మండపం నిర్మాణం వెనుక ఎంతో కష్టం ఉన్న సంగతి మీకు తెలియదన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి ఏ నిర్ణయం చేయాలో మీ విజ్ఙతకు విడిచి పెడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. -
ఇదేనా శవ మర్యాద?
అన్నవరం (ప్రత్తిపాడు): అనాథ శవానికైనా నలుగురు ఖర్చులు భరించి అంత్యక్రియలు చేసే సంస్కృతి మనది. కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సత్యదేవుని ఆలయానికి భక్తులను తీసుకువచ్చిన ఓ టూరిస్ట్ బస్ డ్రైవర్ గుండెనొప్పితో చనిపోతే ఆ శవాన్ని కొండదిగువన దేవస్థానం ఆసుపత్రిలో ఆరుబయట ఎండలో పడేశారు. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆ మృతదేహం ఎండకు ఎండుతూ ఉంది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఇదేమి అన్యాయం? అని ప్రశ్నిస్తే అప్పుడు ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఆ శవాన్ని నీడకు తరలించారు. కొంత సేపటికి, మృతిచెందిన డైవర్ తరఫువారు అంబులెన్స్‌లో ఆ డ్రైవర్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండకు తీసుకువెళ్లారు. దేవస్థానం శానిటరీ, ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే కర్నూల్ జిల్లా నందవరం మండలం కనికివేడు పాడు, ఎమ్మిగనూర్ మండలానికి చెందిన 90 మంది భక్తులు రెండు టూరిస్ట్ బస్సులలో కాశీ తీర్థయాత్రకు బయల్దేరారు. మంగళవారం అర్ధరాత్రి అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. వీరందరూ రాత్రి బస్సులతో నిద్రించారు. అయితే ఏపీ02 టీబీ 9799 బస్ డ్రైవర్ జి.కృష్ణ (60) మాత్రం ఆరుబయట నిద్రించాడు. తెల్లవార జాము ఐదు గంటలకు అందరూ లేచి స్నానాలు చేసి స్వామి దర్శనానికి వెళ్లేందుకు సమాయత్తమవుతుండగా డ్రైవర్ మాత్రం లేవలేదు. కొందరు అతడిని లేపడానికి ప్రయత్నించగా చలనం లేకపోవడం, నోటినుంచి, మెడ నుంచి రక్తం వస్తుండడం గమనించి మృతి చెందినట్టుగా అనుమానం వ్యక్తం చేసి వెంటనే దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ, ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఒక వ్యాన్‌లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కొండదిగువన దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని ఆసుపత్రి లోపలకు తీసుకురావద్దని, బయట ఉంచాలని ఆసుపత్రి నర్స్, అటెండర్ చెప్పడంతో ఆ మృతదేహాన్ని ఆసుపత్రి భవనం పక్కన గల ఖాళీస్థలంలో వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. అయితే తమను అడగలేదని, వ్యాన్‌లో మొక్కలు తెచ్చారేమో అని అనుకుని దూరంగా దింపమని చెప్పానని నర్స్ సరోజినీ తెలిపారు. ఏమైందో తెలియదు కాని ఆ మృతదేహం మ«ధ్యాçహ్నం 12.30 గంటల వరకు అలాగే నిర్లక్ష్యంగా వదిలేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో నీడలోకి ఆ శవాన్ని మార్చారు. కొంతసేపటికి మృతి చెందిన డ్రైవర్ తాలుకు వారు వచ్చి అంబులెన్స్‌లో ఆ శవాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ తీసుకువెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లా : డాక్టర్ రామారావు ‘‘నేను ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రికి వచ్చేటప్పటికే ఆ శవం అక్కడ ఉంది. అలా బయట ఉండకూడదని చెప్పి నేను, ఫార్మసీ సూపర్వైజర్ మా«ధవి కలసి దేవస్థానం అధికారులకు, ఈఓ పేషీకి ఫోన్ చేసి చెప్పాం. తరువాత ఈఓను కొండమీద కలిసి వివరించాం. ఈఓ కూడా వెంటనే ఆ డ్రైవర్ స్వగ్రామానికి దేవస్థానం ఖర్చుతో ఆ శవాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. అదే విషయం శవాన్ని తీసుకువచ్చిన వారికి చెప్పగా పోలీస్ క్లియరెన్స్ వచ్చాక తీసుకుపోతామని చెప్పారు.’’ అని డాక్టర్ రామారావు ‘సాక్షి’కివివరించారు. -
ఆ నోట్లను ఏం చేయాలి?
అన్నవరం: పెద్ద నోట్లు రద్దయ్యి.. నేటికి ఏడాది పూర్తయినా అన్నవరం దేవస్థానంలోని పలు హుండీల్లో ఆ నోట్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో భక్తుల వద్ద నుంచి రద్దయిన పెద్ద నోట్లను అన్నవరం దేవస్థానం స్వీకరించింది. జనవరి 2017 నుంచి తీసుకోలేదు. అయితే భక్తులు మాత్రం ఈ నోట్లను హుండీల్లో వేశారు, వేస్తూనే ఉన్నారు. మంగళవారం స్వామివారి హుండీలను తెరవగా వాటిలో పాత రూ.500 నోట్లు 61, రూ.వేయి నోట్లు 55 వచ్చాయి. దీంతో 11 నెలల్లో హుండీల్లో వచ్చిన ఈ నోట్లు మొత్తం రూ.10,76,000కి చేరింది. హుండీల ద్వారా వచ్చిన పాత రూ.500, రూ.వేయి నోట్లను ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీలోకి మార్పిడి చేసేందుకు గత మార్చి నెలలో రిజర్వ్ బ్యాంక్ అధికారులను దేవస్థానం అధికారులు కలిశారు. అయితే రిజర్వ్ బ్యాంక్ అందుకు నిరాకరించింది. పైగా ఈ నోట్లు దేవస్థానం వద్ద కూడా ఉండకూడదని వెంటనే వాటిని తమ వద్ద డిపాజిట్ చేయాలని కూడా తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి వచ్చిన ఈ నోట్లను దేవస్థానం లాకర్లో భద్రపరుస్తున్నారు. ఈ నోట్లను ఏమి చేయాలో చెప్పాలని దేవాదాయశాఖ కమిషనర్ దేవస్థానం అధికారులు కోరారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తామని దేవస్థానం అధికారులు మంగళవారం తెలిపారు. -
ఎందుకీ ప్రహసనం
- బదిలీ చేసేటపుడు ఎన్నో నీతి కబుర్లు - ఏడాది తిరక్కుండానే మాతృ దేవస్థానాలకు బదిలీలు - క్యాడర్‌ను బట్టి బదిలీకి రేటు...రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ - దేవాదాయ శాఖలో లీలలు... . అన్నవరం: దేవాదాయశాఖలో ఉద్యోగుల బదిలీలు పెద్ద ప్రహసనంగా మారాయి. బదిలీలు చేసేటపుడు ఎంత పెద్ద హంగామా ఉంటుందో, అంతా పారదర్శకత, సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేస్తామని చెబుతుంటారు. భార్యా భర్త ఒకేచోట పని చేస్తున్నామన్నా వినిపించుకోరు. అనారోగ్యకారణాలన్నా కుదరదంటారు. కానీ సిఫార్స్‌లు, ముడుపులు ముడితే మాత్రం ఏడాది కూడా కాకుండానే అందరినీ ఎవరి దేవస్థానానికి వారిని భద్రంగా బదిలీ చేసేస్తుంటారు. ఈ మాత్రం దానికి బదిలీలు ఎందుకో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఏడుగురు అన్నవరం దేవస్థానం సిబ్బందిని తిరిగి అన్నవరం దేవస్థానానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇతర దేవస్థానాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని కూడా వారి దేవస్థానాలకు బదిలీ చేశారు. అంటే మొత్తం 14 మందిని ఏకకాలంలో బదిలీ చేశారు. ప్రభుత్వ పెద్దల రికమెండేషన్లతోపాటు ఓ మంత్రి పీఏ నిర్ణయించిన ‘ముడుపు’ చెల్లించడంతోటే ఈ బదిలీలు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. గత ఏడాది జూన్ నెలలో అన్నవరం దేవస్థానానికి చెందిన 17 మందిని ఇతర దేవస్థానాలకు బదిలీ చేశారు. బదిలీ అయిన మూడో నెలలోనే ఓ మంత్రి సిఫార్స్‌తో ఓ ఉద్యోగి తిరిగి దేవస్థానానికి బదిలీ అయ్యారు. ఐదో నెలలో మరో మంత్రి సిఫార్స్‌తో మరొకరు బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడు ఏడుగురు ఉద్యోగులకు బదిలీ అయింది. మరో నలుగురు కూడా బదిలీ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. వారికి కూడా వచ్చే వారంలో బదిలీ జరిగే అవకాశం ఉందంటున్నారు. . రూ.25 వేలు నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తే బదిలీ ఖాయం... బదిలీ అయిన దేవస్థానం ఉద్యోగులు వారి దేవస్థానానికి బదిలీ కావాలంటే క్యాడర్‌ను బట్టి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ ఓ మంత్రి పీఏకు ముడుపులు చెల్లించుకోవల్సిందే. ఎవరి రికమెండేషన్ ఉన్నా ఈ మొత్తం చెల్లింపు తప్పనిసరని అంటున్నారు. ఈ విధంగా చెల్లించినవారికే బదిలీలు అనే ప్రచారం జరుగుతోంది. . బదిలీ అయిన ఏడుగురు ఉద్యోగులు రిలీవ్... అన్నవరం దేవస్థానంలో పనిచేస్తూ ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఏడుగురు ఉద్యోగులను గురువారం రిలీవ్ చేసినట్లు అన్నవరం దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు తెలిపారు. అన్నవరం దేవస్థానానికి బదిలీ అయిన ఉద్యోగులు ఇంకా జాయిన్ కాలేదని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
గిరిపై ఉక్కిరిబిక్కిరి
అగ్నిగుండాన్ని తలపిస్తున్న ఆలయ ప్రాంగణం సత్తెన్న భక్తులకు ఎండదెబ్బ అరకొర ఏర్పాట్లతో ఇబ్బందిపడుతున్న భక్తులు ప్రహసనంగా మజ్జిగ పంపిణీ పనిచేయని వాటర్ కూలర్లు అన్నవరం : రత్నగిరి సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తులు ఎండలకు అల్లాడిపోతున్నారు. వివాహాల సీజ¯¯ŒS, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. రత్నగిరిపై 40 డిగ్రీలకు పైబడి కాస్తున్న ఎండలకు భక్తులు తట్టుకోలేక పోతున్నారు. దేవస్థానంలో కొన్ని చోట్ల చలువ పందిళ్లు వేశారు. వ్రతమండపాల వద్ద మాత్రం వేయలేదు. అక్కడక్కడా షామియానాలు వేసేందుకు ఇనుప గొట్టాలు పాతి వదిలేశారు. దీంతో మధ్యాహ్నమైతే చాలు భక్తులు ఆలయప్రాంగణంలో నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ‘‘తెల్లపెయింట్ వేశాం. దానిపై భక్తులు నడిస్తే కాళ్లు కాలవు’’ అని అధికారులు చెబుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు. రావిచెట్టు నీడలోనే సేదతీరుతున్నారు. ప్రహసనంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం రత్నగిరిపై భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ ప్రహసనంగా మారింది. మజ్జిగ పంపిణీకి ఎంచుకున్న స్థలం, సమయం పరిశీలిస్తే అధికారుల చిత్తశుద్ధి బయటపడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం పది గంటల నుంచి ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే రోజుకు కేవలం 50 లీటర్లు పాలు మాత్రమే ఇందుకు కేటాయించారు. దీంతో వచ్చే మజ్జిగ మాత్రమే ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. రోజూ పదివేలకు పైగా భక్తులు రత్నగిరికి వస్తుంటే , కనీసం వేయి మందికి కూడా ఈ మజ్జిగ సరిపోవడం లేదు. మొక్కుబడిగా నిర్వహణ.. సత్యదేవుని నిత్యాన్నదాన పథకం నుంచే ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. నిత్యాన్నదానపథకానికి భక్తులు నిత్యం వేలాది రూపాయలు విరాళాలుగా సమర్పిస్తున్నా.. అధికారులు మజ్జిగ పంపిణీని మొక్కుబడిగా నిర్వహించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ మజ్జిగ పంపిణీని రోశయ్య మండపానికి ఎదురుగా నిర్వహించారు. ఈ సారి సర్కులర్ మండపంలో చివరన నిర్వహిస్తున్నారు. అలంకారప్రాయంగా కూలింగ్ వాటర్ పాయింట్ దేవస్థానంలో చాలా చోట్ల ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ పాయింట్లు పనిచేయడం లేదు. అయినా అధికారులు వాటికి మరమ్మతులు చేయించడం లేదు. దేవస్థానం ఈఓ కార్యాలయం వెలుపల గల కూలింగ్‌వాటర్ పాయింట్ పనిచేయకుండా పోయి సుమారు ఆరునెలలైనా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో భక్తులు చల్లని నీటి కోసం ప్రైవేటు షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. -
మాఘమాసం ముంచుకొస్తుంది
28 నుంచి ప్రారంభం రత్నగిరిపై భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు దేవస్థానం అధికారులు, పండితుల సమావేశంలో నిర్ణయం ఫిబ్రవరి మూడో తేదీన రథసప్తమి, ఏడున భీష్మ ఏకాదశి 11న మాఘపౌర్ణిమ, 22న బహుళ ఏకాదశి అన్నవరం : పవిత్ర మాఘమాసం ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతుండడంతో సత్యదేవుని ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా ఫిబ్రవరి ఏడో తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్బంగా సత్యదేవుని దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మాఘమాస ఏర్పాట్లపై చర్చించేందుకు దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు మంగళవారం దేవస్థానం అధికారులతో సమావేశమయ్యారు. మాఘమాసంలో జరిగే వివాహాలకు హాజరయ్యే వారి కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరిపారు. సమావేశంలో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, వేదపండితులు, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహిత సూపర్వైజర్లు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఆలయ సూపరింటెండెంట్ కే కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మాఘమాసంలో వచ్చే పర్వదినాలు...దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు ఫిబ్రవరి మూడో తేదీ రథసప్తమి రోజు న ఉదయం తొమ్మిది గంటలకు కొండదిగువన పవర్‌హౌస్ వద్ద సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తారు. · ఏడో తేదీ భీష్మ ఏకాదశి రోజున సత్యదేవుని సన్నిధికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు సత్యదేవుని సుప్రభాతసేవ, 2 : 30 గంటలకు వ్రతాల నిర్వహణ ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు వెండి పల్లకీపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు. రాత్రి ఏడు గంటల నుంచి కొండదిగువన గరుడ వాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. · పదో తేదీ మాఘపౌర్ణమి రోజున తెల్లవారు నాలుగు గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు, వ్రతాల నిర్వహణ ప్రారంభమవుతుంది. ఆరోజు శుక్రవారం పర్వదినం కావడంతో శ్రీవనదుర్గ ఆలయంలో చండీ హోమం, పౌర్ణమి కావడంతో ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. · 22న బహుళ ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు, వ్రతాల నిర్వహణ ప్రారంభిస్తారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆలయప్రాంగణం చుట్టూ వెండి రథంపై సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగిస్తారు. రాత్రికి గ్రామంలో సత్యదేవుడు, అమ్మవార్లను పల్లకీలో ఊరేగిస్తారు. -
సత్యదేవుడి సన్నిధిలో భక్తుల ఇక్కట్లు
అన్నవరం : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అన్నవరంలో కొలువైన రమా సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరగడంతో.. ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిట లాడుతున్నాయి. సత్యదేవుడి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ఎండలో నిల్చున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో నిల్చున్న మహిళలు, వృద్ధులు తాగు నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రత్నగిరి..భక్తజన ఝరి
అన్నవరం: కార్తిక మాసం సందర్భంగా సత్యదేవునికి స్వామివారి సన్నిధికి భక్తజనం వెల్లువలా వస్తున్నారు. ఆదివారం 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్తికమాసం ప్రారంభం నుంచి అంటే గత నెల 31వ తేదీ నుంచి ఆదివారం వరకూ 20 రోజులకు రూ.ఐదు కోట్లు పైగానే ఆదాయం సమకూరినట్టు అధికారుల అంచనా. ఆదివారం ఆలయాన్ని తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వామివారి వ్రతాలు కూడా అదే సమయం నుంచి మొదలయ్యాయి. సుమారు ఐదు వేలమంది భక్తులకు ఉచిత పులిహోర, దద్ధ్యోజనం పంపిణీ చేశారు. ఆదివారం రూ. 50 లక్షల ఆదాయం సత్యదేవుని వ్రతాలు ఆదివారం 5,693 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
గిరికి భక్త జనఝరి
భక్త జనసంద్రంగా రత్నగిరి కిక్కిరిసిపోయిన సత్యదేవుని సన్నిధి l ఐదేళ్ల తరువాత అత్యధికంగా వ్రతాలు అన్నవరం : రత్నగిరి జనసంద్రాన్ని తలపించింది. కార్తిక సోమవారం, పౌర్ణమి పర్వదినాలు ఒకే రోజు రావడంతో స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఈ ఏడాదిలోనే అత్య«ధికంగా సుమారు 1.5 లక్షల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ భక్తులు తండోపతండాలుగా స్వామివారి సన్నిధికి తరలివస్తూనే ఉన్నారు. స్వామివారి వ్రతాలు 15,450 జరిగాయి. 2011లో కార్తిక మాసంలో ఏకాదశి, సోమవారం కలిసి రావడంతో ఆ రోజు 20 వేలకు పైగా వ్రతాలు జరిగాయి. ఆ తరువాత అత్యధికంగా ఇప్పడు వ్రతాలు నిర్వహించారు. ఈ ఒక్క రోజే సత్యదేవునికి రూ.1.5 కోట్ల ఆదాయం సమకూరింది. అర్ధరాత్రి నుంచే వ్రతాలు ప్రారంభం సత్యదేవుని దర్శనానికి ఆదివారం సాయంత్రం నుంచే రత్నగిరికి భక్తుల రాక ప్రారంభమైంది. ఊహించని విధంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తుండడంతో అధికారులు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే వ్రతాల టికెట్లు విక్రయించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి ఒంటి గంట నుంచి వ్రతాలు ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజాము 2 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. అప్పటి నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది. అంతరాలయ దర్శనం రద్దు రద్దీ తట్టుకోలేక స్వామివారి అంతరాలయ దర్శనం రద్దు చేశారు. ఈ టికెట్లు తీసుకున్న వారికి కూడా ఇతర భక్తులతో పాటు అంతరాలయం వెలుపల నుంచే దర్శనం కలుగజేశారు. వ్రత మండపాలు సరిపోకపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా ఉదయం 10 గంటల వరకూ వ్రతాలు నిర్వహించారు. అయినప్పటికీ వ్రతాలాచరించే భక్తులు సుమారు రెండు గంటలు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి గంటకు పైగా క్యూలో నిరీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావిచెట్టు వద్ద తొక్కిసలాట సత్యదేవుని దర్శించిన భక్తులు గోకులంలోని సప్త గోవులకు ప్రదక్షణ చేసి, రావిచెట్టుకు పూజలు చేశారు. మహిళలంతా ఒకేసారి జ్యోతులు వెలిగించేందుకు అక్కడకు చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. సకాలంలో సిబ్బంది స్పందించి భక్తులను కంట్రోల్ చేశారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ దేవస్థానంలోనే ఉండి అన్ని విభాగాలను పర్యవేక్షించారు. భక్తుల ఇక్కట్లు భక్తులకు వసతి గదులు లభ్యం కాకపోవడం, తగినన్ని బాత్రూమ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. మహిళలు స్నానం చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. -
అన్నవరం...భక్త జనవరం
∙రోజు రోజుకూ పెరుగుతున్న భక్తులు ∙స్వామివారిని దర్శించుకున్న 40 వేల మంది అన్నవరం : రత్నగిరిపై ఆ«ధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తిక మాసం సందర్భంగా సత్యదేవుని సన్నిధి వేలాది భక్తులతో పోటెత్తుతోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ రత్నగిరి కిటకిటలాడుతోంది. శనివారం 25 వేల మంది భక్తులు రాగా, ఆదివారం ఆ సంఖ్య 40 వేలు దాటింది. కార్తిక మాసంలో రెండో సోమవారం, శ్రవణ నక్షత్రం కలిసి రావడంతో 50 వేల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జన సంద్రంగా రత్నగిరి సప్తమి పర్వదినం, సెలవు రోజు కూడా కావడంతో ఆదివారం సత్యదేవుని సన్నిధి వేలాది మంది తమ కుటుంబ సభ్యులతో సహా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారి వ్రత మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి అరగంట, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. అనంతరం గోశాలలో సప్త గోవులకు పూజలు, ప్రదక్షణలు చేశారు. రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టుకు ప్రదక్షణలు చేసి దీపాలు వెలిగించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ 4,002 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
అన్నవరానికి మచ్చ తెచ్చిన అపచారం
అన్నవరం : సత్యదేవుని సాక్షిగా వధూవరులు ఒక్కటైతే వారి కాపురం కలకాలం చల్లగా ఉంటుందన్న నమ్మకంతో రత్నగిరిపై వందేళ్లుగా వివాహాలు జరుపుకుంటున్నారు. ఆడంబరాలకు పోతున్న కొంత మంది ధనవంతులు వివాహాల్లో తమ స్టేటస్‌ను ప్రదర్శించుకొనేందుకు స్వామివారి సన్నిధిలోనే అపచారాలకు పాల్పడుతున్నారు. దానికి శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై జరిగిన వివాహ వేడుకల్లో ప్రదర్శించిన అశ్లీల నృత్యాలే సాక్ష్యం. రత్నగిరిపై ఏటా ఐదు వేల వివాహాలు అన్నవరం దేవస్థానంలో ఏటా ఐదువేల వివాహాలు జరుగుతున్నాయి. వీటిలో నాలుగు వేల వరకూ పేదలు, మధ్యతరగతికి చెందిన వారివే. మిగిలిన వేయి వివాహాలలో మహా అయితే 50 వరకూ ధనవంతులు, రాజకీయ, ఇతర ప్రముఖులవి ఉంటాయి. ప్రముఖమైన వివాహ ముహూర్తంలోనే వీరు ఎమ్మెల్యేలు, ఎంపీల లెటర్‌హెడ్స్‌పై గదుల కోసం దేవస్థానం అధికారులకు సిఫార్స్ చేయిస్తారు. వీఐపీ సత్రంలో సగానికి పైగా గదులు వీరే ఆక్రమిస్తుంటారు. సత్యగిరి ఖాళీ స్థలంలో ఖరీదైన వివాహాలు మూడేళ్ల క్రితం సత్యగిరిపై హరిహరసదన్ సత్రం ప్రారంభం కావడంతో ఆ సత్రం ఎదురుగా గల ఎకరం విస్తీర్ణంలోని స్థలంలో ధనవంతులు వివాహాలను నిర్వహించుకుంటున్నారు. 125 గదులున్న హరిహరసదన్ సత్రంలో 50 గదులు రిజర్వ్ చేసుకుని ఆ స్థలంలో వివాహం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ స్థలానికి అద్దె రూ.20 వేలు, సత్రం గదులకు మరో రూ.50 వేలు దేవస్థానానికి చెల్లిస్తున్నారు. రూ. పది లక్షల నుంచి 30 లక్షల వరకూ వివాహానికి ఖర్చు చేస్తున్నారు. సినిమా సెట్టింగ్స్‌ను తలపించే సెట్టింగ్స్, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, హోరెత్తించే మ్యూజిక్, ఆర్కెస్ట్రా సంగీతానికి డ్యాన్స్‌లు చేసే డ్యాన్సర్లను కూడా తీసుకువచ్చి ఆశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. భారీఎత్తున బాణసంచా కాల్చి భక్తులకు నిద్ర కరువు చేస్తున్నారు. ఈ వేడుకల్లో మద్యం సేవించి ఖాళీ సీసాలను సత్యగిరి ఆవరణలోనే పారేస్తున్నారు. సెక్యూరిటీ తక్కువ దేవస్థానంలో సుమారు 150 మంది వరకూ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ సత్యగిరిపై ఉండేది కేవలం ఇద్దరే. ఈ వివాహాలకు ప్రముఖులు హాజరవుతుండడంతో నిర్వాహకులను ఎవరూ ఏమనలేని పరిస్థితి నెలకొంది. శనివారం జరిగిన వివాహ వేడుకల్లో.. శనివారం తెల్లవారుజామున జరిగిన వివాహ వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేసి అపచారం చేశారని మాత్రమే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రదేశానికి కొంత దూరంలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. ఖాళీ ప్రదేశాలలో వివాహాలకు అనుమతించం : ఈఓ సత్యగిరిపై ఖాళీ స్థలాలలో వివాహాలు చేసుకోవడానికి ఇకపై అనుమతించబోమని ఈఓ కె. నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 25న ఒక వివాహానికి ఆ స్ధలం రిజర్వ్ చేశారని. దాన్ని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. శనివారం రాత్రి జరిగి వివాహ వేడుకలో అశ్లీల నృత్యాలు చేయకుండా ఎందుకు నిరోధించలేదని సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా తమ మాట నిర్వాహకులు వినిపించుకోలేదని చెబుతున్నారన్నారు. అయినప్పటికీ వారి నిర్లక్ష్యం కారణమని భావించి హరిహరసదన్ గుమస్తా ఎన్. గోవింద్, సెక్యూరిటీ గార్డు బహుదూర్‌ను సస్పెండ్ చేశామన్నారు. -
ఆరు ఆవుపేడ పిడకలు రూ.10
► విక్రయించనున్న అన్నవరం దేవస్థానం ► సాంప్రదాయ పునరుద్ధరణకే.. : ఈఓ అన్నవరం : ఆర్డరిస్తే పిడకలు కూడా డోర్ డెలివరీ చేస్తామని ఆన్లైన్లో వస్తువులు విక్రయించే ఓ ప్రముఖ సంస్థ ప్రకటన ఇంటర్నెట్లో అందరినీ ఆకర్షిస్తున్న విషయం విదితమే. అయితే భోగిమంటలో వేయడానికి ఆవు పేడతో చేసిన పిడకలను విక్రయించడానికి అన్నవరం దేవస్థానం కూడా సన్నాహాలు చేస్తోంది. దేవస్థానం గోశాలలోని సుమారు రెండువందల ఆవుల పేడతో చేసిన పిడకలను జనవరి ఒకటి నుంచి భోగి పండుగ వరకూ రూ.పదికి ఆరు పెద్ద పిడకల చొప్పున విక్రయించనున్నట్టు ఈఓ నాగేశ్వరరావు సోమవారం విలేకరులకు తెలిపారు.ఆ మొత్తాన్ని దేవస్థానం గో సంరక్షణట్రస్ట్కు జమ చేస్తామన్నారు. భోగిమంటల్లో ఆవుపేడతో చేసిన పిడకలు మాత్రమే వేసే పాత సంప్రదాయం పునరుద్ధరణకే దేవస్థానం పిడకల తయూరీ, విక్రయం చేపట్టిందన్నారు. పిడకలను ఉచితంగా పంపిణీ చేద్దామనుకున్నా రూ.పది పెద్దగా భారం కాదన్న అభిప్రాయంతో ఆ ధర నిర్ణరుుంచామన్నారు. ఈఓ ఆదేశాల మేరకు గోశాల సిబ్బంది సోమవారం నుంచి పిడకల తయారీ ప్రారంభించారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.70.82 లక్షలు
అన్నవరం (తూర్పుగోదావరి జిల్ల్లా) : సత్యదేవునికి హుండీల ద్వారా గత నెల రోజులకు రూ.70,82,250ల ఆదాయం సమకూరింది. హుండీలను శనివారం లెక్కించగా రూ.67,21,425 నగదు, రూ.3,60,825 చిల్లర నాణాలు, 45 గ్రాముల బంగారం, 605 గ్రాముల వెండి కూడా లభించాయని దేవస్ధానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. అమెరికా డాలర్లు 115, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 57, సింగపూర్ డాలర్లు ఆరు, సౌదీ అరేబియా రియల్స్ 68, ఇంగ్లాండ్ పౌండ్స్ 20, మలేషియా రిమ్స్ 68, రెండు జతల బంగారు గాజులు లభించాయన్నారు. హుండీల లెక్కింపులో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, సిబ్బంది, పురోహితులు, విశాఖపట్నానికి చెందిన శ్రీహరి సేవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
సత్యదేవుడికీ బంద్ ఎఫెక్ట్
అన్నవరం, న్యూస్‌లైన్ : సీమాంధ్ర బంద్ ప్రభావం సత్యదేవుని ఆలయంపై కూడా పడింది. భక్తుల్లేక ఆలయం మంగళవారం వెలవెలబోయింది. సాధారణంగా శ్రావణమాసంలో స్వామివారి ఆలయానికి ప్రతీరోజూ కనీసం ఐదారు వేల మంది భక్తులు వస్తారు. అయితే మంగళవారం కేవలం 2,500 మంది భక్తులు మాత్రమే సత్యదేవుని దర్శించుకున్నారు.ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో సొంతవాహనాలు లేదా అద్దె వాహనాల్లోనే వీరు ఆలయానికి విచ్చేశారు. సత్యదేవుని వ్రతాలు 303, కల్యాణాలు ఎనిమిది జరిగాయి. దేవస్థానానికి రూ. రెండు లక్షల ఆదాయం వచ్చింది. బోసిపోయిన సత్యదేవుని తొలిపాంచా కొండదిగువన సత్యదేవుని తొలిపాంచా( తొలి మెట్టు) కూడా మంగళవారం నాడు వాహనాలు లేక బోసిపోయింది. అన్నవరం రోడ్డు మీదుగా ప్రయాణించే వాహనాల యజమానులు, డ్రైవర్లు ఇక్కడ ఆగి స్వామివారి తొలిమెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి వెళుతుంటారు. సీమాంధ్ర బంద్ కారణంగా మంగళవారం నాడు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఇక్కడ ఆగేవారే లేరు. ఇక్కడ ఉన్న సత్యదేవుని ప్రసాదాల విక్రయశాలలో కూడా అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ప్రతీరోజూ సుమారు పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయిస్తారు. అటువంటిది మంగళవారం నాడు కేవలం రెండు వేల ప్యాకెట్లు మాత్రం విక్రయించారు. కాగా, అన్నవరంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యాసంస్థలు, బ్యాంకులు, షాపులు మూసివేశారు. -
సత్యదేవుని ఆలయంలో లిఫ్ట్ ఏర్పాటు
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే వయోవృద్దులు, వికలాంగులకు శుభవార్త. స్వామివారి ఆలయానికి వారు సులభంగా చేరుకునేందుకు వీలుగా దేవస్థానం నిర్మిస్తున్న లిఫ్ట్ పనులు మరో పది రోజుల్లో పూర్తికానున్నాయి. ఇప్పటికే లిఫ్ట్ సివిల్ పనులు పూర్తికాగా, మిషనరీ బిగింపు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సత్యదేవుని ఆలయానికి వచ్చే వయోవృద్ధులు, వికలాంగులు రాజగోపురం వద్దనుంచి సుమారు వంద మెట్లు ఎక్కితే తప్ప స్వామివారి ఆలయానికి చేరలేరు. దీంతో వారిని వీల్ ఛైర్లో కూర్చోబెట్టి మోసుకుంటూ ఆలయానికి తీసుకువెళుతుంటారు. ఇది కూడా ఇబ్బందిగా భావించే వారు రాజగోపురం వద్దనే ఆగిపోయి అక్కడి నుంచే స్వామివారికి నమస్కరించి వె నుతిరుగుతారు. లిఫ్ట్ నిర్మిస్తే వారికి ఉపయోగరంగా ఉంటుందనితలచిన దేవస్థానం అధికారులు 2012 నవంబర్‌లో రూ. 14.85 లక్షలతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో రూ.8 లక్షలు మిషనరీ బిగింపునకు మిగతా రూ.6.85 లక్షలు సివిల్ పనులకు కేటాయించారు. స్వామివారి ఆలయానికి వెనుకవైపున వ్రత మంటపాన్ని చేర్చి ఈ లిఫ్ట్ నిర్మిస్తున్నారు. 40 అడుగుల ఎత్తున, మూడు అంతస్తుల్లో ఆగేలా దీనిని నిర్మిస్తున్నారు. తొలి అంతస్తులో వ్రత మండపాలకు, రెండో అంతస్తులో స్వామివారి ప్రధానాలయం వెనుక వైపునకు, మూడో అంతస్తులో ఆలయ శిఖ రానికి (ఇది దేవస్థానం సిబ్బంది, సెక్యూరిటీ వారికి మాత్రమే పరిమితం) వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. మిషనరీ బిగింపు పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. పనులు పూర్తయిన వెంటనే లిఫ్ట్‌ను ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని దేవస్థానం ఈఓ పి. వేంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. లిఫ్ట్ వరకూ భక్తులు చేరుకునేందుకు వీల్ ఛైర్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.