కొండదిగువన టోల్‌గేట్ పక్కన నిర్మిస్తున్న భక్తుల షెడ్లు
అన్నవరం: రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పథకాలకు సంబంధించి గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి కొత్తది రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దేవస్థానానికి వచ్చే భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లు, పార్కింగ్ ప్రదేశాల అభివృద్ధి, వసతి సత్రాల నిర్మాణం తదితర మార్పులు చేపట్టాల్సి ఉంది. దేవస్థానం మాస్టర్ ప్లాన్ 2010లో రూపొందించారు. ఆ తరువాత పలు మార్పులు చేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్మాణాలు చేపట్టనున్నారు. వీటన్నింటిని దేవస్థానం మాస్టర్ ప్లాన్‌లో చేర్చనున్నారు.
ప్రస్తుతం ఏమి ఉన్నాయంటే...
ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లో కొత్తగా సత్రాల నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. నిర్మాణాలన్నీ సత్యగిరిపై చేపట్టాలని, మరిన్ని టాయిలెట్‌లు నిర్మించాలని, భక్తుల వాహనాల రాకపోకలకు వీలుగా ఘాట్‌రోడ్లు వెడల్పు చేయాలని, కొత్తగా క్యూ లు నిర్మించాలని అనుకున్నారు.
కొత్తగా మాస్టర్ ప్లాన్‌లో చేర్చుతున్న అంశాలు
► దేవాలయానికి నాలుగు మాడావీధుల నిర్మాణం
► భక్తులు ఏటా 40 శాతం చొప్పున పెరగడం, వ్యక్తిగత వాహనాలపై వచ్చే భక్తులు ఎక్కువ కావడంతో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు
► వాహనాలు కొండ దిగువకు వెళ్లేందుకు ఎక్కువ రోడ్ల నిర్మాణం
► అన్నదాన శాల నుంచి, వివిధ సత్రాల నుంచి వచ్చే వ్యర్థాలు, టాయిలెట్స్ నుంచి వచ్చే వేస్ట్ కూ సూయెజ్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మంట్ ప్లాంట్‌ల నిర్మాణం
► దేవస్థానంలో వివిధ చోట్ల, ఘాట్‌రోడ్లలో విద్యుత్ దీపాలు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటు
► మారేడు, తులసి వనాలు, మామిడి, అరటి తదితర చెట్లు విరివిగా పెంచే చర్యలు
► వివిధ పుష్పాలతో కూడిన తోటల పెంపకం
► వసతి గదులు దొరకని భక్తులు సేద తీరేందుకు విశ్రాంతి షెడ్ల నిర్మాణం
► కొండ దిగువన భక్తుల కోసం మరిన్ని నిర్మాణాలు
► భక్తుల అవసరాలకు తగ్గట్టుగా రూపకల్పన
► నెలాఖరులోగా కమిషనర్‌కు ప్రతిపాదనలు
భక్తుల అవసరాల మేరకు మార్పులు
గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో కొత్తగా చేర్చాల్సిన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనుల గురించి ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపించాలని దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. త్వరలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుని కమిషనర్‌కు నివేదిక పంపుతాం. దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు ఇప్పటికే చేపట్టిన పలు నిర్మాణాలు మాస్టర్ ప్లాన్‌లో చేర్చుతాం.
– చంద్రశేఖర్ అజాద్, ఈఓ, అన్నవరం దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment