- ∙రోజు రోజుకూ పెరుగుతున్న భక్తులు
- ∙స్వామివారిని దర్శించుకున్న 40 వేల మంది
అన్నవరం...భక్త జనవరం
Published Sun, Nov 6 2016 9:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
అన్నవరం :
రత్నగిరిపై ఆ«ధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తిక మాసం సందర్భంగా సత్యదేవుని సన్నిధి వేలాది భక్తులతో పోటెత్తుతోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ రత్నగిరి కిటకిటలాడుతోంది. శనివారం 25 వేల మంది భక్తులు రాగా, ఆదివారం ఆ సంఖ్య 40 వేలు దాటింది. కార్తిక మాసంలో రెండో సోమవారం, శ్రవణ నక్షత్రం కలిసి రావడంతో 50 వేల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జన సంద్రంగా రత్నగిరి
సప్తమి పర్వదినం, సెలవు రోజు కూడా కావడంతో ఆదివారం సత్యదేవుని సన్నిధి వేలాది మంది తమ కుటుంబ సభ్యులతో సహా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారి వ్రత మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి అరగంట, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. అనంతరం గోశాలలో సప్త గోవులకు పూజలు, ప్రదక్షణలు చేశారు. రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టుకు ప్రదక్షణలు చేసి దీపాలు వెలిగించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ 4,002 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
Advertisement