కాలిపోయిన గది రూఫ్, మంటలను అగ్నినిరోధక పరికరాలతో ఆర్పుతున్న సిబ్బంది
సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : అన్నవరం దేవస్థానంలో అకౌంట్స్ విభాగం పక్కన గల కంప్యూటర్ సర్వర్ రూమ్‌లో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సర్వర్ ఎక్విప్‌మెంట్, ఏసీ మెషీన్, సీలింగ్, ఇతర విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. మొత్తం రూ.నాలుగు లక్షలు పైగా నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంతో దేవస్థానంలో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో కాలిపోయిన పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ఆదివారం ఉదయానికల్లా అన్ని రకాల ఆన్‌లైన్ సేవలు యథావిధిగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని దేవస్థానం ఈవో వి. త్రినాథరావు విలేకరులకు తెలిపారు.
దేవస్థానంలోని కంప్యూటర్ సర్వర్ రూమ్‌లో నుంచి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో సిబ్బంది అప్రమత్తమై మినీ అగ్నినిరోధక యంత్రాలు డీపీసీలు (డ్రై కెమికల్ పౌడర్స్) తో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే తుని అగ్నిమాపక కార్యాలయ ఇన్‌చార్జి రమణ తదితరులు దేవస్థానానికి చేరుకునేలోపే దేవస్థానం సిబ్బంది , హోమ్‌గార్డు నాగేశ్వరరావు తదితరులు మంటలను ఆదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ పరిసరాలలో విద్యుత్తు
నిలిపేశారు.
గత జూన్‌లో సీసీ టీవీ కంట్రోల్ రూమ్‌లోనూ అగ్నిప్రమాదం
గత జూన్ నెల 24 వ తేదీన ఈ గది మేడమీద గల సీసీటీవీ కంట్రోల్ రూమ్ షార్ట్‌సర్క్యూట్ కు గురై కొన్ని పరికరాలు దగ్ధమయ్యాయి. అప్పుడు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, అప్పటి ఈవో సురేష్ బాబు సీసీ టీవీ కంట్రోల్ రూమ్‌ను దిగువకు మార్పు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకూ అలా జరగలేదు.
హుటాహుటిన వచ్చిన ఈవో
అధికారిక కార్యక్రమంలో కోసం కాకినాడ వెళ్లిన ఈవో త్రినాథరావు ఈ అగ్నిప్రమాదం వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన దేవస్థానానికి తిరిగివచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ సర్వర్ రూమ్‌ను మరో చోటకు మార్చాలని ఆదేశించినట్టు తెలిపారు. గత జూన్‌లో కూడా సీసీ కెమెరాల సర్వర్ రూమ్‌లో ఇదే విధంగా జరిగిందని, రెండు సర్వర్లు ఒకేచోట ఉండేలా కొత్తగా గది నిర్మించి నెల్లాళ్ల లోగానే మార్పు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment