- భక్త జనసంద్రంగా రత్నగిరి
- కిక్కిరిసిపోయిన సత్యదేవుని సన్నిధి l
- ఐదేళ్ల తరువాత అత్యధికంగా వ్రతాలు
గిరికి భక్త జనఝరి
Published Mon, Nov 14 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
అన్నవరం :
రత్నగిరి జనసంద్రాన్ని తలపించింది. కార్తిక సోమవారం, పౌర్ణమి పర్వదినాలు ఒకే రోజు రావడంతో స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఈ ఏడాదిలోనే అత్య«ధికంగా సుమారు 1.5 లక్షల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ భక్తులు తండోపతండాలుగా స్వామివారి సన్నిధికి తరలివస్తూనే ఉన్నారు. స్వామివారి వ్రతాలు 15,450 జరిగాయి. 2011లో కార్తిక మాసంలో ఏకాదశి, సోమవారం కలిసి రావడంతో ఆ రోజు 20 వేలకు పైగా వ్రతాలు జరిగాయి. ఆ తరువాత అత్యధికంగా ఇప్పడు వ్రతాలు నిర్వహించారు. ఈ ఒక్క రోజే సత్యదేవునికి రూ.1.5 కోట్ల ఆదాయం సమకూరింది.
అర్ధరాత్రి నుంచే వ్రతాలు ప్రారంభం
సత్యదేవుని దర్శనానికి ఆదివారం సాయంత్రం నుంచే రత్నగిరికి భక్తుల రాక ప్రారంభమైంది. ఊహించని విధంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తుండడంతో అధికారులు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే వ్రతాల టికెట్లు విక్రయించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి ఒంటి గంట నుంచి వ్రతాలు ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజాము 2 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. అప్పటి నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది.
అంతరాలయ దర్శనం రద్దు
రద్దీ తట్టుకోలేక స్వామివారి అంతరాలయ దర్శనం రద్దు చేశారు. ఈ టికెట్లు తీసుకున్న వారికి కూడా ఇతర భక్తులతో పాటు అంతరాలయం వెలుపల నుంచే దర్శనం కలుగజేశారు. వ్రత మండపాలు సరిపోకపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా ఉదయం 10 గంటల వరకూ వ్రతాలు నిర్వహించారు. అయినప్పటికీ వ్రతాలాచరించే భక్తులు సుమారు రెండు గంటలు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి గంటకు పైగా క్యూలో నిరీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రావిచెట్టు వద్ద తొక్కిసలాట
సత్యదేవుని దర్శించిన భక్తులు గోకులంలోని సప్త గోవులకు ప్రదక్షణ చేసి, రావిచెట్టుకు పూజలు చేశారు. మహిళలంతా ఒకేసారి జ్యోతులు వెలిగించేందుకు అక్కడకు చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. సకాలంలో సిబ్బంది స్పందించి భక్తులను కంట్రోల్ చేశారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ దేవస్థానంలోనే ఉండి అన్ని విభాగాలను పర్యవేక్షించారు.
భక్తుల ఇక్కట్లు
భక్తులకు వసతి గదులు లభ్యం కాకపోవడం, తగినన్ని బాత్‌రూమ్‌లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. మహిళలు స్నానం చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు.
Advertisement