very rush
-
సత్యదేవుని ఆలయం.. భక్తజనసంద్రం..
అన్నవరం : మరో రెండు రోజుల్లో కార్తిక మాసం ముగియనుండడంతో.. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచీ స్వామివారిని దర్శించడానికి క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో అధికారులు తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారి వ్రతాలను, దర్శనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారి సాధారణ దర్శనానికి గంటన్నర, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 5 వేల వాహనాల్లో దాదాపు 70 వేలమంది భక్తులు తరలివచ్చారు. పార్కింగ్ ప్రదేశాలు చాలకపోవడంతో ఘాట్‌రోడ్ పక్కన వాహనాలను నిలిపివేశారు. దీంతో పలుమార్లు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఉదయం పది గంటల తరువాత వచ్చిన వాహనాలను సత్యగిరి మీదకు పంపించారు. ఈఓ కె.నాగేశ్వరరావు ద్విచక్రవాహనంపై స్వయంగా తిరుగుతూ ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ఆదివారం ఒక్కరోజే 6,998 వ్రతాలు జరిగాయి. కల్యాణాలు 49 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.65 లక్షల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ కారణంగా వ్రత మండపాలు సరిపోలేదు. దీంతో స్వామివారి నిత్యకల్యాణ మండపంలో రూ.300 వ్రతాలను ఉదయం పది గంటల వరకూ నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణం జరిపారు. ఆదివారంతో కలిపి కార్తిక మాసంలో మొత్తం 1,10,379 వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో మరో 10 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తికంలో మొత్తం జరిగిన వ్రతాలు 1,10,248 మాత్రమే. దీంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మరో 131 వ్రతాలు అధికంగా జరిగాయి. -
గిరికి భక్త జనఝరి
భక్త జనసంద్రంగా రత్నగిరి కిక్కిరిసిపోయిన సత్యదేవుని సన్నిధి l ఐదేళ్ల తరువాత అత్యధికంగా వ్రతాలు అన్నవరం : రత్నగిరి జనసంద్రాన్ని తలపించింది. కార్తిక సోమవారం, పౌర్ణమి పర్వదినాలు ఒకే రోజు రావడంతో స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఈ ఏడాదిలోనే అత్య«ధికంగా సుమారు 1.5 లక్షల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ భక్తులు తండోపతండాలుగా స్వామివారి సన్నిధికి తరలివస్తూనే ఉన్నారు. స్వామివారి వ్రతాలు 15,450 జరిగాయి. 2011లో కార్తిక మాసంలో ఏకాదశి, సోమవారం కలిసి రావడంతో ఆ రోజు 20 వేలకు పైగా వ్రతాలు జరిగాయి. ఆ తరువాత అత్యధికంగా ఇప్పడు వ్రతాలు నిర్వహించారు. ఈ ఒక్క రోజే సత్యదేవునికి రూ.1.5 కోట్ల ఆదాయం సమకూరింది. అర్ధరాత్రి నుంచే వ్రతాలు ప్రారంభం సత్యదేవుని దర్శనానికి ఆదివారం సాయంత్రం నుంచే రత్నగిరికి భక్తుల రాక ప్రారంభమైంది. ఊహించని విధంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తుండడంతో అధికారులు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే వ్రతాల టికెట్లు విక్రయించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి ఒంటి గంట నుంచి వ్రతాలు ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజాము 2 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. అప్పటి నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది. అంతరాలయ దర్శనం రద్దు రద్దీ తట్టుకోలేక స్వామివారి అంతరాలయ దర్శనం రద్దు చేశారు. ఈ టికెట్లు తీసుకున్న వారికి కూడా ఇతర భక్తులతో పాటు అంతరాలయం వెలుపల నుంచే దర్శనం కలుగజేశారు. వ్రత మండపాలు సరిపోకపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా ఉదయం 10 గంటల వరకూ వ్రతాలు నిర్వహించారు. అయినప్పటికీ వ్రతాలాచరించే భక్తులు సుమారు రెండు గంటలు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి గంటకు పైగా క్యూలో నిరీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావిచెట్టు వద్ద తొక్కిసలాట సత్యదేవుని దర్శించిన భక్తులు గోకులంలోని సప్త గోవులకు ప్రదక్షణ చేసి, రావిచెట్టుకు పూజలు చేశారు. మహిళలంతా ఒకేసారి జ్యోతులు వెలిగించేందుకు అక్కడకు చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. సకాలంలో సిబ్బంది స్పందించి భక్తులను కంట్రోల్ చేశారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ దేవస్థానంలోనే ఉండి అన్ని విభాగాలను పర్యవేక్షించారు. భక్తుల ఇక్కట్లు భక్తులకు వసతి గదులు లభ్యం కాకపోవడం, తగినన్ని బాత్రూమ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. మహిళలు స్నానం చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. -
అన్నవరం భక్త జన సంద్రం
కిటకిటలాడిన వ్రత మండపాలు స్వామివారిని దర్శించుకున్న 25 వేల మంది అన్నవరం : సత్యదేవుని ఆలయం శనివారం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాసంలో వచ్చిన తొలి శనివారం, పంచమి తాత్కాల షష్ఠి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు సత్యదేవుని దర్శనానికి పోటెత్తారు. సాయంత్రం వరకూ ఈ రద్దీ కొనసాగింది. స్వామి వారి వ్రత మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. అనంతరం గోశాలలో సప్త గోవులకు, రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టుకు ప్రదక్షణలు చేశారు. స్వామి వారిని 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 2,656 వ్రతాలు జరి గాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో ఆకాశదీపం కార్తీక మాసం సందర్భంగా ఐదు రోజులుగా సత్యదేవుని సన్నిధిలో ఆకాశదీపం పెడుతున్నారు. ప్రతీరోజూ సాయంత్రం ఆరు గంటలకు అనివేటి మండపంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆకాశ దీపానికి పూజలు చేసి గర్భాలయంలోని స్వామివారికి అభిముఖంగా ఆ దీపాన్ని వేలాడదీస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూ.10 చెల్లించి భక్తులు కూడా పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. -
భక్తి పరవళ్లు
ఐదో రోజూ 37,096 మంది పుణ్యస్నానాలు భక్తి శ్రద్ధలతో భక్తుల పూజలు పెరుగుతున్న వరద పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఐదో రోజు గురువారం భక్తుల స్నానాలతో నదీతీరం పరవశించింది. జిల్లా వ్యాప్తంగా 37,096 మంది పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. రాజమహేద్రవరం నగరంలోని ఘాట్లలో స్నానమాచరించేందుకు 22,521 మంది భక్తులు రాగా ఇందులో ఒక్క పుష్కరఘాట్‌లోనే 15,395 మంది స్నానమాచరించారు. జిల్లాలోని అంతర్వేది, అప్పన పల్లి, అయినవిల్లి, కోటిపల్లి తదితర ఘాట్లలో స్థానిక ప్రజలు స్నానాలు చేసి సమీపంలోని ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాజమహేంద్రవరంలోని పద్మావతి, శ్రద్ధానంద, టీటీడీ ఘాట్లలో స్నానాలు చేసిన భక్తుల సంఖ్య స్వల్పంగా ఉంది. రాజమహేంద్రవరంలోని ఘాట్లకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి యాత్రికులు తరలివచ్చారు. ఘాట్లలో స్వచ్ఛంద సంస్థలు, కాలేజీ విద్యార్థుల సేవలు కొనసాగుతున్నాయి. వరద నేపథ్యంలో ఘాట్ల వద్ద పరిస్థితిని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షించారు. వరదతో అప్రమత్తం... గోదావరి ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదికి వరద వస్తోంది. రాజమహేంద్రవరంలోని కోటిలింగాల, పుష్కర ఘాట్లలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు మునిగిపోయాయి. ఘాట్ల వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ముందుగా నిర్ణయించిన మేరకు నీటి స్థాయి ఉండేలా ఇరిగేషన్ అధికారులు కాటన్ బ్యారేజీ నుంచి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. మత్స్య, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. నీటి పరిమాణం పెరగడంతో సరస్వతీఘాట్‌లో రక్షణగా కట్టిన తాడును అధికారులు ముందుకు జరిపారు. వరద వల్ల ఘాట్లపై నిలిచిన వ్యర్థాలను అగ్నిమాపక, నగరపాలక సంస్థ సిబ్బంది శుభ్రం చేశారు. భక్తుల ర ద్దీ సాధారణంగా ఉండడంతో గోదావరి గట్టుపై ట్రాఫిక్ ఆంక్షలు తొగించారు. హారతి సమయంలో ఆంక్షలను తిరిగి యథావిధిగా కొనసాగాయి. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆనం కళాకేంద్రంలో గోదావరి సింగర్స్ క్లబ్ సభ్యులు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. కోటిలింగాలఘాట్ వద్ద తెరపై నగరపాలక సంస్థ డాక్టర్ చక్రవర్తి చిత్రాన్ని ప్రదర్శించింది. పుష్కరఘాట్ ఎదురుగా ఉన్న మండపం వద్ద నగరపాలక సంస్థ సౌజన్యంతో టీటీడీ పరిధిలోని హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ మౌనిక బుర్రకథ బృందం నిర్వíß ంచిన ‘సీతా కల్యాణం’ బుర్రకథలో హాస్యం పేరుతో ద్వందార్థాలతో సాగడంతో విమర్శలు వినిపించాయి. ––––––––––––––––––––––––––––––––––– జిల్లాలో ఘాట్ల వారీగా స్నానమాచరించిన భక్తుల సంఖ్య ఘాట్ భక్తులు 1.కోటిలింగాలఘాట్, 4,060 2.పుష్కరఘాట్ 15,395 3.మార్కండేయఘాట్ 168 æ 4.టీటీడీఘాట్ 238 5.శ్రద్ధానంద ఘాట్ 78æ 6.పద్మావతిఘాట్ 315 7.గౌతమిఘాట్ 997 8.సరస్వతిఘాట్ 1,270 9.రామపాదలరేవు 860 10.మునికూడలి 739 11.కోటిపల్లి 1,949 12.అప్పనపల్లి 4,940 13.అంతర్వేది 1,880 14.వాడపల్లి 1,697 15.జొన్నాడ 2,700 -
అమ్మవారి సన్నిధికి అర లక్ష మంది
తలుపులమ్మలోవకు భక్తుల వెల్లువ దేవస్థానానికి రూ.5.50 లక్షల ఆదాయం తుని రూరల్ : ఆషాఢమాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లోవకు తరలివచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున దేవస్థానానికి చేరుకున్న భక్తులు ఉదయం కురిసిన భారీవర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తెరిపి ఇవ్వడంతో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉన్న 50 వేలమంది అమ్మవారిని దర్శించుకున్నారని, వివిధ విభాగాల ద్వారా రూ.5.50 లక్షలు లభించిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యాప్రత్యేక క్యూలైన్లు, వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. కాగా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రూరల్ ఎస్సై ఎం.అశోక్ ఆధ్వర్యంలో 50మంది పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు దేవస్థానం ఆధీనంలోని కాటేజీలు, పొంగలి షెడ్లు లభించక అవస్థలు పడ్డారు. వర్షంతో వంటలు చేసుకునేందుకు వసతి లేక కొండ దిగువన ఉన్న ప్రైవేట్ పాకలు, మామిడి, జీడిమామిడి తోటలను ఆ్రÔ¶ యించారు. ఇదే అదునుగా ప్రైవేట్ పాకల యజమానులు రూ.500 నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేశారు. కొబ్బరికాయల దుకాణంలో నగదు స్వాధీనం అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో దేవస్థానం లైసెన్సు పొందిన కొబ్బరి కాయల దుకాణంలో ఈఓ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కొబ్బరికాయ, అరటి పండ్లు, ఆకు, వక్క, పసుపు, అగరుబత్తిల సెట్‌ను రూ.25కి విక్రయించేందుకు అనుమతి ఉండగా రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నట్టు గుర్తించి కౌంటర్లో ఉన్న రూ.7,660 నగదును స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారుకు షోకాజ్ నోటీసు జారీ చేస్తామని, నిర్దేశించిన ధరలకు అమ్మకాలు చేయని దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.