సత్యదేవుని ఆలయం.. భక్తజనసంద్రం..
Published Mon, Nov 28 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
అన్నవరం :
మరో రెండు రోజుల్లో కార్తిక మాసం ముగియనుండడంతో.. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచీ స్వామివారిని దర్శించడానికి క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో అధికారులు తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారి వ్రతాలను, దర్శనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారి సాధారణ దర్శనానికి గంటన్నర, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 5 వేల వాహనాల్లో దాదాపు 70 వేలమంది భక్తులు తరలివచ్చారు. పార్కింగ్ ప్రదేశాలు చాలకపోవడంతో ఘాట్‌రోడ్ పక్కన వాహనాలను నిలిపివేశారు. దీంతో పలుమార్లు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఉదయం పది గంటల తరువాత వచ్చిన వాహనాలను సత్యగిరి మీదకు పంపించారు. ఈఓ కె.నాగేశ్వరరావు ద్విచక్రవాహనంపై స్వయంగా తిరుగుతూ ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ఆదివారం ఒక్కరోజే 6,998 వ్రతాలు జరిగాయి. కల్యాణాలు 49 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.65 లక్షల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ కారణంగా వ్రత మండపాలు సరిపోలేదు. దీంతో స్వామివారి నిత్యకల్యాణ మండపంలో రూ.300 వ్రతాలను ఉదయం పది గంటల వరకూ నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణం జరిపారు. ఆదివారంతో కలిపి కార్తిక మాసంలో మొత్తం 1,10,379 వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో మరో 10 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తికంలో మొత్తం జరిగిన వ్రతాలు 1,10,248 మాత్రమే. దీంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మరో 131 వ్రతాలు అధికంగా జరిగాయి.
Advertisement
Advertisement