
సాక్షి, అమరావతి/కాణిపాకం (యాదమరి): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు జారీ చేసే పూజలు, సేవల టికెట్లను సగానికి సగం కుదించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నా.. గంటకు గరిష్టంగా వెయ్యి మందికి మించి క్యూ లైన్లలోకి అనుమతించవద్దని ఆదేశించారు.
అంతరాలయ దర్శనాలు, తీర్థప్రసాదాల పంపిణీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని.. అన్నదానం కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఎవరి వద్దనైనా మాస్క్ లేకపోతే వారికి నిర్ణీత ధరకు ఆలయం వద్ద మాస్క్ లభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా రెండు మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఆన్‌లైన్ సేవలను ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలను సడలించే అధికారాన్ని ఈవోలకు కల్పించారు.
కరోనా నిర్మూలనకు నిత్యం హోమాలు..
కరోనా నిర్మూలన లక్ష్యంగా దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో రోజూ మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, సీతాళ హోమం, ఆయుష్య హోమం, విరాట పర్వ పారాయణం చేపట్టాలని ఈవోలను దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. చిన్న ఆలయాల్లో సహస్ర నామ పారాయణాలు ప్రతి రోజూ నిర్వహించాలని సూచించారు.