Famous temples
-
విదేశాల్లోని ప్రముఖ శివాలయాలివే..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024, మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పూజలందుకుంటున్నాడు. విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం(నేపాల్) మన పొరుగు దేశం నేపాల్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రినాడు లక్షలాది శివభక్తులు ఇక్కడికి మహాశివుని దర్శనం కోసం తరలివస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని నమ్ముతారు. మున్నేశ్వరం (శ్రీలంక) నేపాల్‌లో మాదిరిగానే శ్రీలంకలోనూ అత్యంత పురాతన శివాలయం ఉంది. దాని పేరు మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది. శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం.. ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు మూడు లక్షల రుద్రాక్షలను పొదిగారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. ప్రంబనన్ ఆలయం ఎనిమిది దేవాలయాల సమూహం. ఈ ఆలయం 850 బీసీలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించిన వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీప కాంతులతో వెలిగిపోతుంది. ముక్తి గుప్తేశ్వరాలయం (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. -
East Godavari Famous Temples: తూర్పుకు వెళ్తే ఇంత మంది దేవుళ్లను చూడవచ్చా? (ఫొటోలు)
-
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ దేవాలయాలు (ఫోటోలు)
-
3 ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వీ సుధాకరరావును ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు. అదే విధంగా విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది ట్రస్టు బోర్డు సభ్యులను నియమించారు. ఈ మూడింటికి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్‌ను సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం సమావేశమై ఎన్నుకుంటారు. అదనంగా ఆయా ఆలయాలలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వారు ఆయా ట్రస్టు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా ఆలయాల ట్రస్టు బోర్డులలోని సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని తెలిపింది. దుర్గమ్మ ఆలయ చైర్మన్‌గా కర్నాటి రాంబాబు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కర్నాటి రాంబాబు, సభ్యులుగా కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, తొత్తడి వేదకుమారి చేత ఈవో భ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలుకులూరి రామసీత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. -
Omicron Effect: కరోనా నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు
సాక్షి, అమరావతి/కాణిపాకం (యాదమరి): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు జారీ చేసే పూజలు, సేవల టికెట్లను సగానికి సగం కుదించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నా.. గంటకు గరిష్టంగా వెయ్యి మందికి మించి క్యూ లైన్లలోకి అనుమతించవద్దని ఆదేశించారు. అంతరాలయ దర్శనాలు, తీర్థప్రసాదాల పంపిణీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని.. అన్నదానం కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఎవరి వద్దనైనా మాస్క్ లేకపోతే వారికి నిర్ణీత ధరకు ఆలయం వద్ద మాస్క్ లభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా రెండు మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఆన్లైన్ సేవలను ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలను సడలించే అధికారాన్ని ఈవోలకు కల్పించారు. కరోనా నిర్మూలనకు నిత్యం హోమాలు.. కరోనా నిర్మూలన లక్ష్యంగా దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో రోజూ మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, సీతాళ హోమం, ఆయుష్య హోమం, విరాట పర్వ పారాయణం చేపట్టాలని ఈవోలను దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. చిన్న ఆలయాల్లో సహస్ర నామ పారాయణాలు ప్రతి రోజూ నిర్వహించాలని సూచించారు. -
కరోనాపై పోరులో దైవసంకల్పం కోసం..
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు దైవ సంకల్పం తోడుగా ఉండాలని దేవదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో హోమాలు, యాగాలు నిర్వహిస్తోంది. ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ధన్వంతరి హోమం, సుదర్శన హోమం, స్వాతి హోమాలు నిర్వహించనున్నారు. 24న వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ హోమాలలో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశం లేదు. ఆన్లైన్లో వీక్షించేందుకు దేవదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ► కర్నూలు జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయంలో ఆదివారం మహా మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహించారు. దీనికి తోడు ఆదివారం మొదలు వరుసగా 21 రోజుల పాటు రోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల మధ్య మహా మృత్యుంజయ మంత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. ► అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇప్పటికే దేవదాయ శాఖ ప్రత్యేక ఆయుష్ హోమాన్ని నిర్వహించగా, ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సర్వశాంతి హోమాన్ని నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడిలో శుక్రవారమే చండీ హోమం, శ్రీచక్ర నవ వర్ణార్చన పూజలు చేయగా.. గణపతి హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమాలనూ పూర్తి చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్నాయి.. కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి పెరిగిన నాటి నుంచి గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆలయాల్లో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు రోజువారీగా జరుగుతున్నాయి. భక్తులు ఇంటి వద్ద నుంచే తమ ఇష్టదైవానికి మొక్కులు తీర్చుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 79 ఆలయాల్లో పరోక్ష సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇలా ఇప్పటి వరకు రూ.76.12 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయాల్లో పరోక్ష సేవల పురోగతిపై ఈవోలు, జిల్లా దేవదాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో వారంలో రెండు రోజులు సమీక్షిస్తున్నాను. – వాణీమోహన్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి తిరుమలలో హస్తా నక్షత్రేష్టి తిరుమల: కరోనా మహమ్మారి నుంచి రక్షించి సమస్త మానవాళికి ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో హస్తా నక్షత్రేష్టి మహాయాగం నిర్వహించారు. పీఠం ప్రిన్సిపాల్ కేఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరిగిన ఈ మహాయాగంలో విశేషమైన హోమం చేపట్టి అధిష్టాన దేవతను ప్రార్థించారు. కాగా, మే 9న ప్రారంభమైన నక్షత్రసత్ర మహాయాగం జూన్ 15వ తేదీ వరకు జరగనుంది. కృత్తిక నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు శ్రౌతయాగాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఈ 28 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారు. ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు. -
పుణ్యక్షేత్రాలకు కరోనా ఎఫెక్టు
సాక్షి, అమరావతి/తిరుపతి : ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఆయా దేవస్థానాల ముందు జాగ్రత్తలతో భక్తుల రాక బాగా తగ్గింది. తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, కాణిపాకం, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, ద్వారకా తిరుమల తదితర దేవాలయాల్లో దర్శనాలను నిలిపివేయడం ఇందుకు కారణం. గ్రహణ సమయాల్లో మినహా గతంలో ఎప్పుడూ ఇలా దర్శనాలను నిలిపివేసిన దాఖలాల్లేవని పూజారులు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. టీటీడీ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకూ ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదని అధికారులు చెబుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసిన జీఓ 204తో మసీదులు, చర్చిల్లో కూడా భక్తులు రాకుండా ప్రజాహితార్థం చర్యలు తీసుకుంటున్నారు. ఆలయాల్లో ప్రత్యేక హోమాలు లోకకళ్యాణార్థం కరోనా వైరస్ నివారణను కాంక్షిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహించాలంటూ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను కోరారు. అన్ని ఆలయాల్లో మహా మృత్యుంజయ, శీతలాంబ, భాస్కర ప్రశస్తి, ధన్వంతరి హోమాలు.. అనారోగ్య నివారణా జప హోమాదులు, పారాయణలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా భక్తులు స్వచ్ఛందంగా దైవ దర్శనాలను వాయిదా వేసుకోవాలని మంత్రి కోరారు. గ్రామోత్సవాలు జాతర్లకూ అనుమతిలేదని మంత్రి వివరించారు. ఈనెల 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. బోసిపోతున్న తిరుమల కరోనా ఎఫెక్ట్ కారణంగా తిరుమలకు భక్తులను అనుమతించకపోవటంతో కొండపై వెళ్లే ఘాట్ రోడ్లు, క్యూలైన్లు వెలవెలబోతున్నాయి. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, తిరుమల స్థానికులను క్షుణ్నంగా పరీక్షించాకే టీటీడీ తిరుమలకు అనుమతిస్తోంది. తిరుమలలోని రెండు బస్టాండ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భక్తుల ఆకలిని తీర్చే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం కార్యక్రమం కూడా నిలిపివేశారు. లడ్డు ప్రసాద వితరణ కేంద్రం వెలవెలబోతోంది. నాలుగు మాడ వీధులు నిర్మానుష్యంగా మారాయి. కాగా, తిరుమల నిత్య కల్యాణవేదికలో గురు, శుక్రవారాల్లో కేవలం ఏడు వివాహాలు మాత్రమే జరిగాయి. స్వామి వారి కైంకర్యాలు మాత్రం ఏకాంతంగా యథావిధిగా జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి 8.30 గంటలకల్లా ఏకాంతం సేవను పూర్తి చేసి ప్రధాన మహాద్వారాన్ని మూసివేశారు. -
నీటి గర్భంలోకి ప్రసిద్ధ ఆలయాలు!
ఆగస్టులో ఆలయాల తరలింపు తేదీలను ఖరారుచేసిన దేవాదాయ శాఖ బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిధిలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలు కొద్ది రోజుల్లో నీటి గర్భంలోకి వెళ్లనున్నాయి. ఆగస్టు నెల చివరి కల్లా ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటి నిల్వకు అధికారులు ఇప్పటికే పలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను ఈ నెలాఖరు కల్లా గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గ్రామసభల ద్వారా సూచించారు. దీంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న ముంపు గ్రామాల తరలింపునకు దేవాదాయ శాఖ అధికారులు సన్నాహాలు చేశారు. ఆగస్టు 9, 11 తేదీలను ఖరారుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బెల్లంకొండ గ్రూపు దేవస్థానాల మేనేజరు టి.లక్షణరావు తెలిపారు. మండలంలోని ముంపు గ్రామాల పరిధిలో వున్న ఆలయాలను గుర్తించారు. ముంపు గ్రామాల్లో మొత్తం 25 ఆలయాలు ఉన్న అధికారులు గుర్తించారు. పలు పునరావాస కేంద్రాల్లో ఏ స్థానంలో ఏ ఆలయాలను ఏర్పాటుచేయాలో నిర్ణయించారు. ఆగస్టు 9న శైవ ఆలయాలు, 11న వైష్ణవ ఆలయాలల్లోని విగ్రహాలను 12న ఆయా పునరావాస కేంద్రాలకు తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆలయాల తరలింపు ఈ కేంద్రాలకే.. కోళ్లూరులోని ప్రసిద్ధ దేవస్థానమైన కోళ్లూరు శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం బెల్లంకొండ క్రాస్ రోడ్డుకు, శ్రీసోమేశ్వర స్వామి ఆలయం రాజుపాలెం కేంద్రానికి, శ్రీ విశ్వేశ్వర, వినాయక స్వామి దేవాలయాలు చిగురుపాడు కేంద్రానికి, రామలింగేశ్వర, వేణుగోపాలస్వామి, ఎమ్మాజిగూడెంలోని ఆంజనేయ ఆలయం కొండమోడు కేంద్రానికి, చిట్యాల గ్రామంలోని శ్రీఆంజనేయ, అంకమ్మ తల్లి, మద్దిరావమ్మ, రామాలయాలు, చిట్యాల తండాలోని అభయాంజనేయ, బోధనం గ్రామంలోని శివాలయం మాచాయపాలెం కేంద్రానికి, పులిచింతలోని కోదండరామ, శివాలయం రెడ్డిగూడెం కేంద్రానికి, ప్రసన్నాంజనేయస్వామి, ఎమ్మాజిగూడెంలోని రామాలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, కామేపల్లిలోని వరద వేణుగోపాల, రామలింగేశ్వర, ముత్యాలమ్మ, రామాలయాలు, కరాలపాడు కేంద్రానికి, బోదనంలోని రామలింగేశ్వర, ఆంజనేయ, గంగమ్మ తల్లి ఆలయాలు చౌటపాపాయపాలెం కేంద్రానికి, కేతవరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలోని కొండ మీదకు తరలిస్తున్నారు.