నీటి గర్భంలోకి ప్రసిద్ధ ఆలయాలు!
- ఆగస్టులో ఆలయాల తరలింపు
- తేదీలను ఖరారుచేసిన దేవాదాయ శాఖ
బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిధిలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలు కొద్ది రోజుల్లో నీటి గర్భంలోకి వెళ్లనున్నాయి. ఆగస్టు నెల చివరి కల్లా ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటి నిల్వకు అధికారులు ఇప్పటికే పలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను ఈ నెలాఖరు కల్లా గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గ్రామసభల ద్వారా సూచించారు. దీంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న ముంపు గ్రామాల తరలింపునకు దేవాదాయ శాఖ అధికారులు సన్నాహాలు చేశారు.
ఆగస్టు 9, 11 తేదీలను ఖరారుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బెల్లంకొండ గ్రూపు దేవస్థానాల మేనేజరు టి.లక్షణరావు తెలిపారు. మండలంలోని ముంపు గ్రామాల పరిధిలో వున్న ఆలయాలను గుర్తించారు. ముంపు గ్రామాల్లో మొత్తం 25 ఆలయాలు ఉన్న అధికారులు గుర్తించారు. పలు పునరావాస కేంద్రాల్లో ఏ స్థానంలో ఏ ఆలయాలను ఏర్పాటుచేయాలో నిర్ణయించారు. ఆగస్టు 9న శైవ ఆలయాలు, 11న వైష్ణవ ఆలయాలల్లోని విగ్రహాలను 12న ఆయా పునరావాస కేంద్రాలకు తరలించేలా ప్రణాళికలు రూపొందించారు.
ఆలయాల తరలింపు ఈ కేంద్రాలకే..
కోళ్లూరులోని ప్రసిద్ధ దేవస్థానమైన కోళ్లూరు శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం బెల్లంకొండ క్రాస్ రోడ్డుకు, శ్రీసోమేశ్వర స్వామి ఆలయం రాజుపాలెం కేంద్రానికి, శ్రీ విశ్వేశ్వర, వినాయక స్వామి దేవాలయాలు చిగురుపాడు కేంద్రానికి, రామలింగేశ్వర, వేణుగోపాలస్వామి, ఎమ్మాజిగూడెంలోని ఆంజనేయ ఆలయం కొండమోడు కేంద్రానికి, చిట్యాల గ్రామంలోని శ్రీఆంజనేయ, అంకమ్మ తల్లి, మద్దిరావమ్మ, రామాలయాలు, చిట్యాల తండాలోని అభయాంజనేయ, బోధనం గ్రామంలోని శివాలయం మాచాయపాలెం కేంద్రానికి, పులిచింతలోని కోదండరామ, శివాలయం రెడ్డిగూడెం కేంద్రానికి, ప్రసన్నాంజనేయస్వామి, ఎమ్మాజిగూడెంలోని రామాలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, కామేపల్లిలోని వరద వేణుగోపాల, రామలింగేశ్వర, ముత్యాలమ్మ, రామాలయాలు, కరాలపాడు కేంద్రానికి, బోదనంలోని రామలింగేశ్వర, ఆంజనేయ, గంగమ్మ తల్లి ఆలయాలు చౌటపాపాయపాలెం కేంద్రానికి, కేతవరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలోని కొండ మీదకు తరలిస్తున్నారు.