ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024, మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పూజలందుకుంటున్నాడు. విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పశుపతినాథ్ ఆలయం(నేపాల్)
మన పొరుగు దేశం నేపాల్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రినాడు లక్షలాది శివభక్తులు ఇక్కడికి మహాశివుని దర్శనం కోసం తరలివస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని నమ్ముతారు.
మున్నేశ్వరం (శ్రీలంక)
నేపాల్‌లో మాదిరిగానే శ్రీలంకలోనూ అత్యంత పురాతన శివాలయం ఉంది. దాని పేరు మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది.
శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా)
అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం.. ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు మూడు లక్షల రుద్రాక్షలను పొదిగారు.
ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా)
ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. ప్రంబనన్ ఆలయం ఎనిమిది దేవాలయాల సమూహం. ఈ ఆలయం 850 బీసీలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించిన వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీప కాంతులతో వెలిగిపోతుంది.
ముక్తి గుప్తేశ్వరాలయం (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment