other
-
విదేశాల్లోని ప్రముఖ శివాలయాలివే..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024, మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పూజలందుకుంటున్నాడు. విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం(నేపాల్) మన పొరుగు దేశం నేపాల్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రినాడు లక్షలాది శివభక్తులు ఇక్కడికి మహాశివుని దర్శనం కోసం తరలివస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని నమ్ముతారు. మున్నేశ్వరం (శ్రీలంక) నేపాల్‌లో మాదిరిగానే శ్రీలంకలోనూ అత్యంత పురాతన శివాలయం ఉంది. దాని పేరు మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది. శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం.. ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు మూడు లక్షల రుద్రాక్షలను పొదిగారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. ప్రంబనన్ ఆలయం ఎనిమిది దేవాలయాల సమూహం. ఈ ఆలయం 850 బీసీలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించిన వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీప కాంతులతో వెలిగిపోతుంది. ముక్తి గుప్తేశ్వరాలయం (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. -
రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు జనవరి 22న కొలువుదీరనున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను ప్రముఖులకు అందజేస్తున్నారు. అయితే సామాన్యులు జనవరి 22 తరువాత ఆలయాన్ని సందర్శించుకోవాలని రామజన్మభూమి ఆలయట్రస్ట్ కోరింది. జనం రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నూతన రామాలయం ప్రాంగణంలో పలు ఇతర ఆలయాలు కూడా ఉండనున్నాయని రామాలయ ట్రస్టు తెలిపింది. వీటిలో మహర్షులు వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్ర,అగస్త్యుడు, శబరి, అహల్య ఆలయాలు ముఖ్యమైనవి. దీంతో పాటు నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు కొలువుదీరనున్నాడు. గుట్టపై ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించి అక్కడ రామభక్తుడు జటాయురాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలో ఉన్న రామ మందిర సముదాయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు ఎస్టీఎఫ్ పర్యవేక్షించనుంది . 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
వివాహేతర సంబంధం.. భార్యపై భర్త దాడి
సాక్షి, పెద్దపల్లి: భార్య వేరొకరితో సంబంధం కలిగి ఉండటాన్ని సహించలేని ఓ భర్త ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కాలనీలో జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య స్వరూప వేరొకరితో సంబంధం కలిగి ఉండగా కళ్ళారా చూశాడు. ఇది తట్టుకోలేక ఆగ్రహంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం శ్రీనివాస్ పోలీసులకు లొంగిపోయాడు. -
‘మెట్రోలో రద్దీ తగ్గడానికి వేరే కారణాలు’
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైళ్లలో రద్దీ తగ్గడానికి కేవలం చార్జీల పెంపే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. అక్టోబరులో ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రయాణ చార్జీలను పెంచిన తర్వాత రోజుకు దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు తగ్గారు. చార్జీలు పెంచడం వల్లే ఇలా జరిగిందని పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పురీ మాట్లాడుతూ ‘చార్జీలకు, ప్రయాణికుల సంఖ్యకు ఏమైనా సంబంధం ఉందా? రద్దీ తగ్గడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 2016 సెప్టెంబరు–అక్టోబరు మధ్య మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.3 లక్షలు తగ్గింది. అప్పుడు చార్జీలను పెంచలేదే. ప్రయాణికుల సంఖ్య సంవత్సరమంతా ఒకేలా ఉండదు. నెలను బట్టి మారుతుండొచ్చు. గత 8 ఏళ్లుగా ఢిల్లీ మెట్రో చార్జీలు పెంచలేదు. మెట్రో కోసం రూ.28,268 కోట్లు అప్పు తీసుకుంటే ఇప్పటికి రూ.1,507 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు. ఈ ఏడాది రూ.890 కోట్లు కట్టాల్సి ఉంది. మెట్రో మరింత మెరుగ్గా పనిచేయాలంటే ఆదాయం పెంచుకోవాల్సిందే’ అని వివరించారు. -
వెళ్తున్నా..వెళ్తున్నా..
⇔ విశాఖకు తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ, అదే బాటలో ఐఐఎఫ్‌టీ ⇔ రావల్సిన మరో మూడు పరిశ్రమలపైనా నీలినీడలు ⇔ నేతల నిర్లక్ష్యంతో ఇతర జిల్లాలకు తరలింపు ⇔ విశాఖకు ఎగరేసుకుపోయే ప్రయత్నాలు ⇔ ఆపేందుకు ప్రయత్నాలు శూన్యం జిల్లాకు రావల్సినవి కొత్త రెక్కలు కట్టుకొని ఇతర జిల్లాకు తరలిపోతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో కొరవడిన చిత్తశుద్ధి ఫలితంగా ఈ పరిస్థితి నెలకుంది. పర్సెంటేజీలు వస్తాయంటే చాలు ఆహ్వానించే నేతలున్న ఈ జిల్లా నేతలు విద్యార్థిలోకానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే సంస్థలు తరలిపోతున్నా కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రగతిలో ముందుంటామని గొప్పలకుపోయే పాలకులు అరుదైన అవకాశాలను చేజార్చేస్తున్నారు. ఆర్థికంగా కలిసి వస్తుందంటే చాలు గద్దల్లా వాలిపోయే నేతలు ... తనకు కలిసి రాదంటే కన్నెత్తి కూడా చూడని దుస్థితి. విద్యార్థి లోకానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే అరుదైన ఇనిస్టిట్యూట్లు సరిహద్దులు దాటిపోతున్నా చీమకుట్టినట్టయినా లేదు. వీరి నిర్వాకంతో జిల్లాకు వచ్చిన మరో అరుదైన అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో కేంద్రం జిల్లాకు పలు ఇనిస్టిట్యూట్లను మంజూరు చేసింది. ఇందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఒకటి. ఆ ఇనిస్టిట్యూట్‌ను రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లాకు వచ్చేట్టు చేయాల్సిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. చంద్రబాబు కేబినెట్లో నంబర్-2గా చెప్పుకునే మంత్రి యనమలతోపాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కనీసం ఈ సంస్థ ఏర్పాటుపై చేసిన ప్రయత్నం ఏమీ లేదు. విభజన తరువాత ప్రతిష్టాత్మకంగా భావించిన పెట్రో యూనివర్సిటీ జిల్లాకు మంజూరైంది. కృష్ణా గోదావరి బేసిన్లో కీలకమైన కోనసీమలో అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలు వెలికి తీస్తున్న క్రమంలో పెట్రో యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటైతే జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయనుకున్నారు. పెట్రోలియం రంగంలో శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలకు ఒక మార్గదర్శకంగా òపెట్రో యూనివర్సిటీ నిలుస్తుందని విద్యార్థి లోకం ఆశలు పెంచుకుంది. ఎంతో ఉపయోగకరం పెట్రో యూనివర్శిటీ... కొన్ని పరిశ్రమ కోసం ప్రజలు వద్దన్నా ప్రభుత్వమే బలవంతంగా వందల ఎకరాలను సేకరిస్తోంది. తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాయంటే పోలీసులను ఉసిగొల్పి కాలుష్య పరిశ్రమలైనా రప్పించుకుంటున్నాయి. అటువంటిది కేవలం 87 ఎకరాలు భూ సేకరణ చేస్తే సరిపోయే పెట్రో యూనివర్సిటీని గాలికొదిలేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, రాజానగరం, మండపేట తదితర ప్రాంతాల్లో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు కమిటీ పరిశీలన జరిపింది. అప్పుడు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం చొరవ తీసుకోకపోవడంతోనే ఆ యూనివర్సిటీ విశాఖ జిల్లాకు అక్కడి ప్రజాప్రతినిధులు ఎగరేసుకుపోయారు. అలా ప్రతిష్టాత్మక పెట్రో యూనివర్సిటీని జిల్లా నుంచి చేజారిపోగా, ఇప్పుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అదే బాటలో పయనిస్తోంది. ఈ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర పరిశీలన కమిటీ గత ఏడాది రాజమహేంద్రవరం, మండపేట, రాజానగరం పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రభుత్వ అసైన్ఢ్ భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఐఐఎఫ్టీతోపాటు లాజిస్టిక్ వర్సిటీ, ఇండస్ట్రియల్ పార్కు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిపప్పు పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకున్నారు. వీటిలో ఐఐఎఫ్‌టీకి రాజమహేంద్రవరం అనుకూలంగా ఉంటుందని సెర్చ్ కమిటీ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఆ కమిటీని కలిసి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుపై కనీసం జిల్లా ప్రజాప్రతినిధులు ఒక్కసారి కూడా చర్చించకపోవడం వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. గతంలో పెట్రో యూనివర్సిటీ విషయంలో నిర్లక్ష్యం వహించిన రీతిలోనే ఇప్పుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ విషయాన్ని కూడా పాలకులు గాలికొదిలేశారు. ఆ మంత్రులకున్న చిత్తశుద్ధి వీరికేదీ...? విభజన అనంతరం రాజధానిగా మంగళగిరి ఏర్పాటయ్యాక పారిశ్రామికంగా విశాఖపట్నంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న పలుకుబడిని వినియోగించి ఈ ఇనిస్టిట్యూట్‌ను విశాఖకు తరలించేందుకు విశాఖ ఎంపీ హరిబాబు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలియవచ్చింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ముగ్గురు ఎంపీలు మురళీమోహన్, తోట నరసింహం, పండుల రవీంద్ర అధికార పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా విద్యా సంస్థలు, పరిశ్రమలు తరలిపోకుండా అడ్డుకుంటారనే నమ్మకం జిల్లా ప్రజలకు కలగడం లేదు. వీటి ఏర్పాటుపై నియమితమైన సెర్చ్ కమిటీ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అనువుగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చింది. సహజంగా రాజమహేంద్రవరం అనే సరికి అక్కడి ఎంపీ మురళీమోహన్ కీలకమైన పాత్ర పోషించాలి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మురళీమోహన్ గట్టి ప్రయత్నం చేస్తే ఐఐఎఫ్టి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోనే ఈ సరికే ఏర్పాటయ్యేది. కాకినాడ ఎంపీ తోట నరసింహం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పలు స్టాండింగ్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్యాధికుడిగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా ఆ స్థాయిలో వీటి కోసం ప్రయత్నం చేయడం లేదనే విమర్శలున్నాయి. ఐఐఎఫ్‌టీ ప్రయోజనాలెన్నో... ఈ ఇనిస్టిట్యూట్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో 1963లో ఏర్పాటైంది. మానవ వనరుల అభివృద్ధిని విశ్లేషించడం, నిరంతరం పరిశోధనలు నిర్వహించడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యం. విదేశీ వాణిజ్యం నిర్వహణ, పెరుగుదల, ఎగుమతులను పెంపొందించాలనే లక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయీకరణకు దోహదపడేలా సరికొత్త ఆలోచనలు, నైపుణ్యాభివృద్ది, కార్పొరేట్, ప్రభుత్వ రంగంలో పరిశోధన ఆధారిత కన్సల్టెన్సీని అందించే సామర్థ్యం కలిగిన ఇనిస్టిట్యూట్ ఇది. నిరంతర పరిశోధన, కన్సల్టెన్సీల ద్వారా ప్రభుత్వం వాణిజ్య, పరిశ్రమ అవసరాల కోసం ఎప్పటికప్పుడు విజ్ఞానం ఆ«ధారంగా సేవలందిస్తుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, కెరీర్ నిపుణుల ఆకాంక్షలకు అనుగుణంగా కోర్సులు అందిస్తుండటంతో విదేశీ విద్యార్థులు కూడా ఆకర్షితులవుతారు. ‘ఐఐఎఫ్‌టీకి రాజమహేంద్రవరం అనుకూలం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటుకు అన్ని విధాలా రాజమహేంద్రవరం అనుకూలమైనది. విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం ఐఐఎఫ్టీతో మరింత ప్రగతిని సాధించడంతోపాటు ఏటా సుమారు రూ. వంద కోట్ల మేరకు వ్యాపార లావేదేవీలు జరగడానికి, సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు కూడా ఇక్కడనే ఉన్నందున ఐఐఎఫ్‌టీని కూడా రాజమహేంద్రవరంలోనే ఏర్పాటుచేయడం సముచితం. - ఆచార్య ఎస్. టేకి, డీన్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరం. ఉపాధి అవకాశాలు కోల్పోనున్న స్థానికులు నవ్యాంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ పరిశ్రమ రావడంపై హర్షం వ్యక్తం చేశాం. ఇప్పటికీ దాని కార్యాచరణ తెలపకపోగా ప్రస్తుతం అది కూడా ఇతర జిల్లాకు తరలిపోతున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మన జిల్లా నేతలు ఉన్న కారణంగా పరిశ్రమను ఇక్కడే ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాం. జిల్లాలో సాంకేతిక విద్యతోపాటు మేనేజ్మెంట్ కోర్సు చేసిన అభ్యర్థులు వేలాది మంది ఉన్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు వస్తాయి. - బి.ప్రభాకరరావు, జేఎన్‌టీయుకే రెక్టార్ పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేయాలి జిల్లాలో సాంకేతిక యూనివర్సిటీ జేఎన్టీయుకేతోపాటు నన్నయ్యవంటి వర్సిటీలు ఉన్న నేపథ్యంలో పరిశ్రమలు కూడా ఏర్పడితే జిల్లా అభివృద్ధితోపాటు పరిశ్రమలకు తగ్గ మ్యాన్ పవర్‌ను వర్సిటీల నుంచి తీసుకోవచ్చు. గతంలో జిల్లాకు పెట్రోలియం వర్సిటీ మంజూరు కాగా తరగతులను జేఎన్టీయుకేలో నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించగా, పెట్రో యూనివర్సిటీ ఇతర జిల్లాకు తరలించారు. ఈ పరిశ్రమ కూడా అ విధంగా చేజారకుండా చూడాలి. -ఎ.గోపాలకృష్ణ, డిజైన్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, జేఎన్‌టీయుకే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి... పెట్రోలియం యూనివర్శిటీ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు స్థానికంగా ఏర్పాటైతే మన జిల్లాకు చెందిన యువతకు కొంత వరకు ఉపాధి అవకాశాల ప్రయోజనం ఉంటుంది. స్థానికంగా చమురు సంస్థలు ఉన్నందున ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యం యువతకు వస్తే వారి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అటువంటి యూవర్శిటీని జిల్లాకు వచ్చినట్టే వచ్చి పోవడం దురదృష్టకరం. – మట్టపర్తి రవిశంకర్, బీటెక్ , గంగలకుర్రు అగ్రహారం, అంబాజీపేట నేతలకు చిత్తశుద్ధి లేక పోవడం వల్లే... మన జిల్లా నేతలకు అభివృద్ధిపైనా..యువతకు మేలు చేసే యూనివర్శిటీల సాధన, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చిత్తశుద్ధి లేదు. ఈ కారణంగానే జిల్లాకు మంజూరైనా పెట్రోలియం యూనివర్శిటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫారన్ ట్రేడింగ్ వంటివి పక్క జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. నేతలు ఇప్పటికైనా స్పందించి ఇటువంటివి సాధించడం ద్వారా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. – బండారు రామ్మోహనరావు, ఓయూ పూర్వవిద్యార్థుల సంఘం, అమలాపురం. -
పొరుగు రాష్ట్రాల్లో విక్రయానికే మిర్చిరైతుల మొగ్గు
ఇప్పటికే 70 శాతం పంట జగదల్పూర్లో విక్రయం తీవ్రంగా నష్టపోతున్న వైనం నెల్లిపాక: సరైన ధరలేక తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతులను ఆదుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మద్దతు ధర ప్రకటనలు మాయగా మారాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్వెన్షన్ స్కీం విలీన మండలాలవారికి ఏ మాత్రం ఉపయోగపడదంటున్నారు. ఇప్పటికే ఇక్కడి మిర్చి రైతులు పొరుగు రాష్ట్రాల్లో తమ పంటను విక్రయిస్తున్నారు. 80 శాతం మిర్చి పంటను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో విక్రయించారు. గిట్టుబాటు ధర రాకపోయినా ఇక్కడి మార్కెట్ ధర కంటె పక్క రాష్ట్రంలోనే బాగుందన్న అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఎటపాక, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో సుమారు 5,200 మంది రైతులు 10 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని గుంటూరు మార్కెట్లో క్వింటాలు మిర్చికి సుమారు రూ. 3,200 వరకు ధర పలుకుతోంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ మార్కెట్లో సుమారు రూ. 4,500 ధర పలుకుతోంది. దాంతో రవాణా ఖర్చులు అధికమైనప్పటికీ మిర్చి పంటను జగదల్పూర్లో అమ్ముకునేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. అనేక నిబంధనలకు లోబడి గుంటూరు మార్కెట్‌కు పంటను తరలించినా సకాలంలో అమ్ముకునే వీలుండటం లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు 20 క్వింటాళ్ల వరకు క్వింటాలుకు రూ. 1,500 అదనంగా చెల్లిస్తామని చేసిన ప్రకటన ఏవిధంగానూ ఇక్కడి రైతులకు ఉపయోగపడలేదు. కొందరు రైతులు మిర్చిని గుంటూరు మార్కెట్‌కు తరలించినా పంటను కొనేవారులేక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. దాంతోతో గుంటూరు మార్కెట్లో విక్రయానికి విలీన మండలాల రైతులు అనాసక్తి చూపుతున్నారు. 80 శాతం వరకూ పంటను అమ్ముకున్నాక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన పథకాలు కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే అని వారు విమర్శిస్తున్నారు. ఈఏడాది పెట్టుబడులు అధికం కావటం, గిట్టుబాటు ధర రాకపోవటం, ప్రభుత్వం రైతులను సకాలంలో ఆదుకోక పోవటంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విలీన మండలాల్లో మిర్చి పంట వివరాలు (వ్యవసాయశాఖ అంచనా) మండలం రైతులు ఎకరాలు దిగుబడి సీజీలో విక్రయం ఎటపాక 3076 5000 98000 70శాతం వీఆర్ పురం 534 1254 25000 80శాతం కూనవరం 1500 1945 38940 80శాతం చింతూరు 50 300 6000 90శాతం గుంటూరు మార్కెట్‌కు వెల్లినా ఫలితం లేదు గుంటూరు మార్కెట్‌కు 30క్వింటాళ్ల మిర్చిని తీసుకెళ్లను. అక్కడ అనేక షరతులు విధించటంతో వారం రోజులు మార్కెట్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. ఈలోగా సుమారు రూ. 1500 ధర పతనమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రోత్సాహకం అందలేదు. - కోడూరు నవీన్, ఎటపాక -
సాఫ్ట్వేర్ కా పరేషాన్ !
-
భారత ఐటీలో బ్లడ్‌బాత్? కంపెనీల పరిస్థితి
న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ , దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో ఇటీవల భారీగాఉద్యోగులపై ఉద్వాసన పలుకుతున్నాయనే వార్తలు ఉద్యోగలను కలవరపరిచింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తోడు, దేశీయంగా ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)రంగంఎదుర్కొంటున్నసవాళ్లు వేలమంది ఉద్యోగుల భవిష్యత్‌పై పలు ప్రశ్నల్ని లేవనెత్తింది. ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కేప్జెమినిల్లో ఉద్యోగమంటే యువతకు యమ క్రేజ్. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.3 శాతం వాటాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నమనదేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న రంగం ఐటీ . దేశంలో 40 లక్షలమందికి ప్రత్యక్షజీవనోపాధిగానూ, మరో 20 లక్షల మంది పరోక్షంగానో ఈ రంగం ఉపాధిని కల్పిస్తుంది. ప్రపంచ ఐటీ రంగానికి 57 శాతం ఔట్సోర్సింగ్ భారత్ ఐటీ రంగం నుంచే జరుగుతుంది. ఒక్క 2016 సంవత్సరంలో ఐటీకంపెనీల రెవెన్యూ 14,300 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగ్నిజెంట్ మొదలు... విప్రో వరకూ..! గత మార్చి 20న కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల్లో 6వేల మందిపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది. అటు దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, ఫ్రెంచ ఐటీ మేజర్ కాప్ జెమిని ఉద్యోగాల్లో కోత విధించకుండా రక్షణాత్మక ధోరణి అవలంబించాయి. ఈ ఏడాది తొలి 9నెలల్లో కేవలం 5వేల మందిని మాత్రమే కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇన్ఫోసిస్ ప్రక్రియతో ఐటీరంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోయినా, పరోక్షంగా ఆందోళన కలిగించే విషయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో కూడా ఉద్యోగాల ఉద్వాసన విషయంలో కాగ్నిజెంట్‌నే అనుసరించనుంది. వార్షిక పనితీరు ప్రక్రియం అనంతరం సుమారు 600 నుంచి 2,000 మందిని ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. క్యాప్ జెమినీ శిక్షణ డిజిటల్ , క్లౌడ్ లో కొత్త నైపుణ్యాలలో సుమారు లక్షమంది ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు, ఫ్యూచర్‌కు తమ ఉద్యోగులను రడీ చేయడమే లక్ష్యమని ఫ్రాన్స్‌కుచెందిన ఐటి సేవల సంస్థ క్యాప్ జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ ఒక వార్తా సంస్థతో చెప్పారు. దాదాపు 60 వేలమందికి శిక్షణ పూర్తి అయిందని, డిజిటల్ టెక్నాలజీల వాడకంలో నైపుణ్యంలో లేని మధ్య మరియు సీనియర్ స్థాయిలలో అత్యధిక ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదముందని క్యాప్ జెమినీ ఇండియా అధిపతి శ్రీనివాస్ కందుల ఇటీవల హెచ్చరించడం గమనార్హం. ఆటోమేషన్నే అసలు కారణమా..? వ్యయాలను తగ్గించుకోవడానికి కంపెనీలు ఆటోమేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈ ఐటీరంగంలో పని చేసే లక్షలాది మంది భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు డిజిటైజేషన్, ఆటోమేషన్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఆటోమేషన్ వల్ల ఈ ఏడాదిలో ఐటీ ఉద్యోగాల నియామకాలు 40 శాతం తగ్గవచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం వల్లే: నాస్కాం ప్రెసిడెంట్: ఆర్.చంద్రశేఖర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం మెదలైంది. స్థానికులకు ఉపాధి కల్పన, పాలసీల రూపకల్పన ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని మెరగుపచాలన్నది ఈ ఉద్యమం ముఖ్యలక్షణం. ఈ ఉద్యమాన్ని ఒక్కోదేశం ఒక్కో రకంగా చేస్తోంది. ‘‘అమెరికా హెచ్1బీ వీసా నిబంధనలు మార్పు, ఆస్ట్రేలియా, సింగపూర్ వర్క్ వీసాల పాలసీని రద్దు’’ ఇవన్నీ అందులో బాగమే. అందువల్ల ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలను నిలిపివేయడం, తగ్గించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. -
ఇతర కులాలను చేర్చితే బీసీలకు అన్యాయమే
బీసీ ఐక్య వేదిక కన్వీనర్ చిట్టబ్బాయి అమలాపురం రూరల్ : ఇతర కులాలను చేర్చితే బీసీలు రాజకీయంగా రిజర్వేషన్లు కోల్పోతారని జిల్లా బీసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22న విజయవాడలో బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్‌ను కలిసి జిల్లా బీసీ సంఘాల తరపున సమస్యలు, వినతులు ఇచ్చామని చెప్పారు. అభివృద్ధి చెందిన ఇతర కులాలను బీసీల్లో చేర్చటం వల్ల తమ రిజర్వేషన్లకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా పలు పదవులు కోల్పోతామని కమిషన్‌కు వివరించామన్నారు. ప్రభుత్వం బీసీ సంఘాల సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు బడ్జెట్ రూ.వెయ్యి కోట్లు కేటాయించి రూ.రెండు లక్షల వరకూ హామీ లేకుండా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బీసీలకు రూ.50 వేల రుణాలకు కూడా బ్యాంకుల్లో హామీలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులకు రూ.అయిదు లక్షల వరకూ హామీ లేకుండా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని సామాజిక వర్గాల మాదిరిగా తామేమీ విధ్వంసాలకు పాల్పడలేదని... అలా చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందా..? అని ప్రశ్నించారు. జిల్లా బీసీ సంఘాల అధ్యక్షుడు పంపన రామకృష్ణ మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చటం వల్ల బీసీలు వార్డు మెంబరుగా కూడా గెలవరని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో కాపులను చేర్చవద్దని తాము కమిషన్‌కు చెప్పామని స్పష్టం చేశారు. -
కొత్త సంవత్సర ప్రార్థన...
సమ్‌థింగ్ సీరియస్ దేవుడా... మాకు సురక్షితమైన స్కూళ్లు ఇవ్వు. లిఫ్ట్‌లు లేని, లిఫ్ట్‌లు పాడవని, పాడైనా సరే వెంటనే బాగు చేసే మంచి మనసు గల మేనేజ్మెంట్లు ఉన్న స్కూళ్లనివ్వు. కొట్టని తిట్టని టీచర్లు ఉన్న స్కూళ్లు ఇవ్వు. చిన్నారి ప్రాణాలు... పూల వంటి ప్రాణాలు... సుందరమైన ప్రాణాలు... వాటిని గుంజిళ్లతోటో గోడ కుర్చీలతోటో కఠినమైన కర్ర దెబ్బల గాయాలతోటో లాగేయని స్కూళ్లనివ్వు. తెలివి, బుద్ధి, ప్రపంచ జ్ఞానం కలిగిన టీచర్లను ఇవ్వు. దయ, కరుణ, దగ్గరితనం కలిగి మతం వల్ల గాని బలం వల్ల గాని ధనం వల్ల గాని ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడని టీచర్లను ఇవ్వు. పాఠం తెలిసిన టీచర్లను ఇవ్వు. పాఠం చెప్పడం తెలిసిన టీచర్లను ఇవ్వు. ఆటల వేళ ఆడించే పాటల వేళ పాడించే నవ్వుల వేళ నవ్వించే టీచర్లను ఇవ్వు. మా పేర్లు తెలిసిన టీచర్లను ఇవ్వు. అలా అప్పుడప్పుడు చెట్టు కింద నీడన కూచోబెట్టి కథలు చెప్పే టీచర్లను ఇవ్వు. మంచి ఆట స్థలాలను ఇవ్వు. ఆ చేత్తోనే కాజేయ వీలులేని ఎవరూ ఆక్రమించ వీలులేని ఆడుకునే సమయాలను ఇవ్వు. ఆడీ పాడీ తూనీగలకు మల్లే తుళ్లి పడేందుకు స్థలాలను వదల గలిగే ఊళ్లను ఇవ్వు. పేరాశకు పోని పేటలను ఇవ్వు. పార్కులతో నిండిన పట్టణాలను ఇవ్వు. అందుకు మనసు పెట్టే పాలకులను ఇవ్వు. మెల్లగా పడినా అద్దాన్ని బద్దలు చేస్తూ ఊపుగా పడినా మా బంతిని మాకు నవ్వుతూ ఇవ్వగలిగిన ఇరుగు పొరుగును ఇవ్వు. దొరికిన ప్రతి అంగుళాన్ని సిమెంటుతో కప్పెట్టని ఇళ్లను ఇవ్వు. పెరడును ఇవ్వు. ఆదమరుపుగా ఆడుకుంటూ ఉంటే ఆ..మ్మని మింగే అంతలోనే మింగే మహాబిలంలా మింగే విసర్జిత బోరు బావులు లేని బయలును ఇవ్వు. జ్వరాలు అక్కర్లేని పరిసరాలు ఇవ్వు. విషాలు కలపని ఆహారాలు ఇవ్వు. మలినాలు కలవని ప్రాణధారను ఇవ్వు. పౌష్టిక ఆహారానికి నోచుకునే శక్తి ప్రతి కుటుంబానికి ఇవ్వు. ఆరోగ్యాన్ని ఇవ్వు. జబ్బు చేస్తే వైద్యం చేసే వైద్యులనివ్వు. వైద్యం మాత్రమే చేసే వైద్యులను ఇవ్వు. పిల్లలను పీడించుకు తినని వైద్యులను ఇవ్వు. ఎలుకలకు పారేయని వైద్యులనివ్వు. విసుక్కోని అమ్మను ఇవ్వు. కసురుకోని నాన్నను ఇవ్వు. నవ్వుతూ సమయాన్ని ఇచ్చే అమ్మానాన్నలను ఇవ్వు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు సంభవించినా పిల్లలను వదలని పిల్లలను వదిలించుకోని అమ్మానాన్నలను ఇవ్వు. ఆ మేరకు వారికి పంట ఇవ్వు. పాడి ఇవ్వు. వీలైన సంపాదన ఇవ్వు. ఆ సంపాదనలో శాంతి నివ్వు. ఆ శాంతిలో గుండెల మీద కూచోబెట్టుకోగలిగే సంతృప్తినివ్వు. కలుషితం కాని టీవీ సినిమాలను ఇవ్వు. అప్పుడప్పుడు కాసిన్ని చందమామలను ఇవ్వు. కలలో పంచకల్యాణీలను ఇవ్వు. ఇలలో ప్రాణాలు పెట్టే స్నేహితులను ఇవ్వు. పెదనాన్న.. బాబాయి... అత్తమ్మ... పిన్ని... మాకు తినుబండారాలు పిప్పరమింట్లు ప్రేమగా తెచ్చి పెట్టే సమస్త అనుబంధాలనివ్వు. హక్కు ప్రదర్శించే బంధాలు ఇవ్వు. పెత్తనం చేయగల ఆప్యాయతలు ఇవ్వు. దేవుడా... మాకు ప్రార్థించడం కూడా రాదు. సరిగా అడగడం కూడా రాదు. మాకు కావలిసినవన్నీ ఇవ్వు. అక్కర్లేకపోయినా కాసిన్ని సెలవలు ఎక్కువే ఇవ్వు.మేమేమి ఇవ్వుగలం? ఇదిగో.. ఈ స్నాక్‌బాక్స్‌లో ఉన్న రెండు బిస్కెట్లని స్వీకరించి మా కోరికలన్నీ నెరవేర్చు. - ఇట్లు రెండు రాష్ట్రాల బాలలు