పొరుగు రాష్ట్రాల్లో విక్రయానికే మిర్చిరైతుల మొగ్గు | red chilli selling other states | Sakshi
Sakshi News home page

పొరుగు రాష్ట్రాల్లో విక్రయానికే మిర్చిరైతుల మొగ్గు

Published Thu, May 4 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

పొరుగు రాష్ట్రాల్లో విక్రయానికే మిర్చిరైతుల మొగ్గు

పొరుగు రాష్ట్రాల్లో విక్రయానికే మిర్చిరైతుల మొగ్గు

ఇప్పటికే 70 శాతం పంట జగదల్‌పూర్‌లో విక్రయం
తీవ్రంగా నష్టపోతున్న వైనం
నెల్లిపాక:  సరైన ధరలేక తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతులను ఆదుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మద్దతు ధర ప్రకటనలు మాయగా మారాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్‌వెన్షన్ స్కీం విలీన మండలాలవారికి ఏ మాత్రం ఉపయోగపడదంటున్నారు. ఇప్పటికే ఇక్కడి మిర్చి రైతులు పొరుగు రాష్ట్రాల్లో తమ పంటను విక్రయిస్తున్నారు. 80 శాతం మిర్చి పంటను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌లో విక్రయించారు. గిట్టుబాటు ధర రాకపోయినా ఇక్కడి మార్కెట్‌ ధర కంటె  పక్క రాష్ట్రంలోనే బాగుందన్న అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఎటపాక, వీఆర్‌ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో  సుమారు 5,200 మంది రైతులు 10 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని గుంటూరు మార్కెట్‌లో క్వింటాలు మిర్చికి సుమారు రూ. 3,200 వరకు ధర పలుకుతోంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ మార్కెట్‌లో సుమారు రూ. 4,500 ధర పలుకుతోంది. దాంతో రవాణా ఖర్చులు అధికమైనప్పటికీ మిర్చి పంటను జగదల్‌పూర్‌లో అమ్ముకునేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. అనేక నిబంధనలకు లోబడి గుంటూరు మార్కెట్‌కు పంటను తరలించినా సకాలంలో అమ్ముకునే వీలుండటం లేదని రైతులు చెబుతున్నారు.  
ప్రభుత్వం తీరుపై ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు 20 క్వింటాళ్ల వరకు క్వింటాలుకు రూ. 1,500 అదనంగా చెల్లిస్తామని చేసిన ప్రకటన ఏవిధంగానూ ఇక్కడి రైతులకు ఉపయోగపడలేదు. కొందరు రైతులు మిర్చిని గుంటూరు మార్కెట్‌కు తరలించినా పంటను కొనేవారులేక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. దాంతోతో గుంటూరు మార్కెట్‌లో విక్రయానికి విలీన మండలాల రైతులు అనాసక్తి చూపుతున్నారు. 80 శాతం వరకూ పంటను అమ్ముకున్నాక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన పథకాలు కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే అని వారు విమర్శిస్తున్నారు.  ఈఏడాది పెట్టుబడులు అధికం కావటం, గిట్టుబాటు ధర రాకపోవటం, ప్రభుత్వం రైతులను సకాలంలో ఆదుకోక పోవటంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
 
విలీన మండలాల్లో మిర్చి పంట వివరాలు (వ్యవసాయశాఖ అంచనా)
 
 మండలం           రైతులు    ఎకరాలు    దిగుబడి    సీజీలో విక్రయం
ఎటపాక   3076      5000       98000        70శాతం
వీఆర్‌ పురం 534     1254       25000        80శాతం
కూనవరం   1500    1945      38940         80శాతం
చింతూరు    50         300        6000         90శాతం 
గుంటూరు మార్కెట్‌కు వెల్లినా ఫలితం లేదు
గుంటూరు మార్కెట్‌కు 30క్వింటాళ్ల మిర్చిని తీసుకెళ్లను. అక్కడ అనేక షరతులు విధించటంతో వారం రోజులు మార్కెట్‌ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. ఈలోగా సుమారు రూ. 1500 ధర పతనమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రోత్సాహకం అందలేదు. 
- కోడూరు నవీన్‌, ఎటపాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement