
కొత్త సంవత్సర ప్రార్థన...
సమ్‌థింగ్ సీరియస్
దేవుడా...
మాకు సురక్షితమైన స్కూళ్లు ఇవ్వు. లిఫ్ట్‌లు లేని, లిఫ్ట్‌లు పాడవని, పాడైనా సరే వెంటనే బాగు చేసే మంచి మనసు గల మేనేజ్‌మెంట్లు ఉన్న స్కూళ్లనివ్వు. కొట్టని తిట్టని టీచర్లు ఉన్న స్కూళ్లు ఇవ్వు. చిన్నారి ప్రాణాలు... పూల వంటి ప్రాణాలు... సుందరమైన ప్రాణాలు... వాటిని గుంజిళ్లతోటో గోడ కుర్చీలతోటో కఠినమైన కర్ర దెబ్బల గాయాలతోటో లాగేయని స్కూళ్లనివ్వు. తెలివి, బుద్ధి, ప్రపంచ జ్ఞానం కలిగిన టీచర్లను ఇవ్వు. దయ, కరుణ, దగ్గరితనం కలిగి మతం వల్ల గాని బలం వల్ల గాని ధనం వల్ల గాని ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడని టీచర్లను ఇవ్వు. పాఠం తెలిసిన టీచర్లను ఇవ్వు. పాఠం చెప్పడం తెలిసిన టీచర్లను ఇవ్వు. ఆటల వేళ ఆడించే పాటల వేళ పాడించే నవ్వుల వేళ నవ్వించే టీచర్లను ఇవ్వు. మా పేర్లు తెలిసిన టీచర్లను ఇవ్వు. అలా అప్పుడప్పుడు చెట్టు కింద నీడన కూచోబెట్టి కథలు చెప్పే టీచర్లను ఇవ్వు.
మంచి ఆట స్థలాలను ఇవ్వు. ఆ చేత్తోనే కాజేయ వీలులేని ఎవరూ ఆక్రమించ వీలులేని ఆడుకునే సమయాలను ఇవ్వు. ఆడీ పాడీ తూనీగలకు మల్లే తుళ్లి పడేందుకు స్థలాలను వదల గలిగే ఊళ్లను ఇవ్వు. పేరాశకు పోని పేటలను ఇవ్వు. పార్కులతో నిండిన పట్టణాలను ఇవ్వు. అందుకు మనసు పెట్టే పాలకులను ఇవ్వు. మెల్లగా పడినా అద్దాన్ని బద్దలు చేస్తూ ఊపుగా పడినా మా బంతిని మాకు నవ్వుతూ ఇవ్వగలిగిన ఇరుగు పొరుగును ఇవ్వు. దొరికిన ప్రతి అంగుళాన్ని సిమెంటుతో కప్పెట్టని ఇళ్లను ఇవ్వు. పెరడును ఇవ్వు. ఆదమరుపుగా ఆడుకుంటూ ఉంటే ఆ..మ్మని మింగే అంతలోనే మింగే మహాబిలంలా మింగే విసర్జిత బోరు బావులు లేని బయలును ఇవ్వు.
జ్వరాలు అక్కర్లేని పరిసరాలు ఇవ్వు. విషాలు కలపని ఆహారాలు ఇవ్వు. మలినాలు కలవని ప్రాణధారను ఇవ్వు. పౌష్టిక ఆహారానికి నోచుకునే శక్తి ప్రతి కుటుంబానికి ఇవ్వు. ఆరోగ్యాన్ని ఇవ్వు. జబ్బు చేస్తే వైద్యం చేసే వైద్యులనివ్వు. వైద్యం మాత్రమే చేసే వైద్యులను ఇవ్వు. పిల్లలను పీడించుకు తినని వైద్యులను ఇవ్వు. ఎలుకలకు పారేయని వైద్యులనివ్వు. విసుక్కోని అమ్మను ఇవ్వు. కసురుకోని నాన్నను ఇవ్వు. నవ్వుతూ సమయాన్ని ఇచ్చే అమ్మానాన్నలను ఇవ్వు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు సంభవించినా పిల్లలను వదలని పిల్లలను వదిలించుకోని అమ్మానాన్నలను ఇవ్వు. ఆ మేరకు వారికి పంట ఇవ్వు. పాడి ఇవ్వు. వీలైన సంపాదన ఇవ్వు. ఆ సంపాదనలో శాంతి నివ్వు. ఆ శాంతిలో గుండెల మీద కూచోబెట్టుకోగలిగే సంతృప్తినివ్వు.
కలుషితం కాని టీవీ సినిమాలను ఇవ్వు. అప్పుడప్పుడు కాసిన్ని చందమామలను ఇవ్వు. కలలో పంచకల్యాణీలను ఇవ్వు. ఇలలో ప్రాణాలు పెట్టే స్నేహితులను ఇవ్వు. పెదనాన్న.. బాబాయి... అత్తమ్మ... పిన్ని... మాకు తినుబండారాలు పిప్పరమింట్లు ప్రేమగా తెచ్చి పెట్టే సమస్త అనుబంధాలనివ్వు. హక్కు ప్రదర్శించే బంధాలు ఇవ్వు. పెత్తనం చేయగల ఆప్యాయతలు ఇవ్వు. దేవుడా... మాకు ప్రార్థించడం కూడా రాదు. సరిగా అడగడం కూడా రాదు. మాకు కావలిసినవన్నీ ఇవ్వు. అక్కర్లేకపోయినా కాసిన్ని సెలవలు ఎక్కువే ఇవ్వు.మేమేమి ఇవ్వుగలం? ఇదిగో.. ఈ స్నాక్‌బాక్స్‌లో ఉన్న రెండు బిస్కెట్లని స్వీకరించి మా కోరికలన్నీ నెరవేర్చు.
- ఇట్లు రెండు రాష్ట్రాల బాలలు