
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైళ్లలో రద్దీ తగ్గడానికి కేవలం చార్జీల పెంపే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ అన్నారు. అక్టోబరులో ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రయాణ చార్జీలను పెంచిన తర్వాత రోజుకు దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు తగ్గారు. చార్జీలు పెంచడం వల్లే ఇలా జరిగిందని పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పురీ మాట్లాడుతూ ‘చార్జీలకు, ప్రయాణికుల సంఖ్యకు ఏమైనా సంబంధం ఉందా? రద్దీ తగ్గడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
2016 సెప్టెంబరు–అక్టోబరు మధ్య మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.3 లక్షలు తగ్గింది. అప్పుడు చార్జీలను పెంచలేదే. ప్రయాణికుల సంఖ్య సంవత్సరమంతా ఒకేలా ఉండదు. నెలను బట్టి మారుతుండొచ్చు. గత 8 ఏళ్లుగా ఢిల్లీ మెట్రో చార్జీలు పెంచలేదు. మెట్రో కోసం రూ.28,268 కోట్లు అప్పు తీసుకుంటే ఇప్పటికి రూ.1,507 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు. ఈ ఏడాది రూ.890 కోట్లు కట్టాల్సి ఉంది. మెట్రో మరింత మెరుగ్గా పనిచేయాలంటే ఆదాయం పెంచుకోవాల్సిందే’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment