special precautions
-
Omicron Effect: కరోనా నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు
సాక్షి, అమరావతి/కాణిపాకం (యాదమరి): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు జారీ చేసే పూజలు, సేవల టికెట్లను సగానికి సగం కుదించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నా.. గంటకు గరిష్టంగా వెయ్యి మందికి మించి క్యూ లైన్లలోకి అనుమతించవద్దని ఆదేశించారు. అంతరాలయ దర్శనాలు, తీర్థప్రసాదాల పంపిణీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని.. అన్నదానం కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఎవరి వద్దనైనా మాస్క్ లేకపోతే వారికి నిర్ణీత ధరకు ఆలయం వద్ద మాస్క్ లభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా రెండు మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఆన్లైన్ సేవలను ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలను సడలించే అధికారాన్ని ఈవోలకు కల్పించారు. కరోనా నిర్మూలనకు నిత్యం హోమాలు.. కరోనా నిర్మూలన లక్ష్యంగా దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో రోజూ మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, సీతాళ హోమం, ఆయుష్య హోమం, విరాట పర్వ పారాయణం చేపట్టాలని ఈవోలను దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. చిన్న ఆలయాల్లో సహస్ర నామ పారాయణాలు ప్రతి రోజూ నిర్వహించాలని సూచించారు. -
ఉల్లిపైనే ఆశలు!
ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు.. తల్లికూడా చేయదంటారు. అంటే దీన్ని తీసుకోవడం ఎంత ఆరోగ్యదాయకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిల్లాలోనే ఈ పంట సాగుకు పేరుగాంచినది మనూరు మండలం. ఇక్కడ చాలా మంది రైతులు ప్రతిఏటా ఉల్లిని విస్తారంగా పండిస్తారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా సంప్రదాయంగా ఇది కొనసాగుతోంది. ప్రతీ గ్రామంలో 100 హెక్టార్లకుపైగానే ఈ పంట సాగవుతోంది. అయితే దీని సాగులో పాటించాల్సిన మెలకువలు, జాగ్రత్తలపై ఏఓ శ్రీనివాస్‌రెడ్డి (సెల్: 9676606020) అందించిన సలహాలు, సూచనలు... పంట సాగుకు ముందు విత్తనశుద్ధిని విధిగా పాటించాలి. దీనివల్ల చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. కిలో విత్తనానికి 1గ్రాము కొర్బండిజం, 2.5గ్రాముల మ్యాంగోజబ్ను కలిపి శుద్ధి చేసుకోవాలి. ఉల్లినారు వేసే సమయంలో 20 నుంచి 30 రోజుల ముందు ఒక్క అంగుళం ఎత్తులో మట్టి బెడ్డును ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్డు 10 నుంచి 15గజాల పొడవు ఉండాలి. బెడ్డుపైన ఆకులు, అములు వంటి చెత్త వేసి కాల్చివేయాలి. దీంతో బెడ్డుపైన ఉన్న శిలీంద్రాలు, బ్యాక్టీరియా చనిపోతాయి. అనంతరం బెడ్డును నీటితో తడిపి ఉల్లి విత్తనాలు చల్లుకోవాలి. ఒక్క ఎకరాకు నాలుగు కిలోల ఉల్లి విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న విధంగా ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని బెడ్లు వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో నారుకు నీటి తడులు అందించాలి. సాగు నేలను సిద్ధం చేసుకోండిలా... ఉల్లినారు చేతికి వచ్చిన సమయంలో సాగు నేలను సిద్ధం చేసుకోవాలి. ఇందులో భాగంగా ఒక్క ఎకరాకు ఒక కిలో డీఏపీ, 30 కిలోల పొటాష్, 25 కిలోల యూరియా చల్లిన తరువాత భూమిని చదనుగా దున్ని మడులను సిద్ధం చేసుకోవాలి. నాట్లు వేసే ఒకరోజు ముందు మడులను నీటితో తడపాలి. అనంతరం నారును నాటేయాలి. 5 నుంచి 7 రోజుల అనంతరం మడులలో నెర్రెలుబారిన తర్వాత తిరిగి నీటిని వదలాలి. కలుపు నివారణ పంట నాటిన తర్వాత 20 నుంచి 25 రోజుల అనంతరం మొదటి కలుపు తీయాలి. కలుపు నివారణకు గాను ఎకరాకు 200 మిల్లీలీటర్ల ఆక్సాడయాక్సిన్ను పిచికారీ చేసుకోవాలి. ఈ మందు పిచికారీ చేసే సమయంలో భూమి తేమగా ఉండాలి. అనంతరం 30 నుంచి 35 రోజుల మధ్య రెండోసారి కలుపు తీసి ఎకరాకు 35 కిలోల యూరియా చల్లి నీటిని అందించాలి. 40 నుంచి 45 రోజుల్లో మూడోసారి కలుపు తీసి 30 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ చల్లితే పంట ఏపుగా పెరుగుతుంది. ప్రత్యేక జాగ్రత్తలు 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంటను తీయడానికి వారం రోజుల ముందు మడులకు నీరు పారించొద్దు. దీంతో ఉల్లిగడ్డ దిగుబడి, బరువు పెరుగుతుంది. మళ్ల నుంచి తొలగించిన ఉల్లిని చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. లేక చెట్టు నీడ అయిన ఫర్వాలేదు. దీంతో ఉల్లి కుళ్లి పోకుండా ఉంటుంది. వారం రోజుల్లో మార్కెట్‌కు తరలించుకోవచ్చు. లేకుంటే గిడ్డంగులకు తరలించి నిల్వ ఉంచుకోవచ్చు. మార్కెట్ రేటును బట్టి రైతులు ఉల్లిని విక్రయించుకోవచ్చు. తెగుళ్ల నివారణ ఉల్లి పంటకు రసం పీల్చే పురుగు బెడద ఉంటుంది. దీని నివారణకు గాను ఎకరాకు 1లీటర్ నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి పిచికారీ చేయాలి. లేదా ఒక లీటరు నీటిలో 1మి.లీ. టిప్రోనిల్ను కలిపి స్ప్రే చేయాలి. లీటరు నీటిలో 3గ్రాముల చొప్పున ఎం.45 మందును కలిపి కొట్టినా పురుగును నివారించవచ్చు. రసం పీల్చే పురుగు బెడద మరీ ఎక్కువగా ఉంటే 30నుంచి 45రోజుల మధ్య 10లీటర్ల నీటిలో 6 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును స్ప్రేచేయాలి. ఎకరా భూమిలో దాదాపు 80నుంచి 90 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వంద క్వింటాళ్ల వరకు తీయొచ్చు. -
అమ్మ పాల బ్యాంకుతో అభాగ్యులకు పునర్జన్మ
రాజస్థాన్ రాష్ట్రంలో సాధారణమైన ఒక మారుమూల గ్రామం అది. ఆ ఊళ్లో గౌరీమీనా అంతకంటే సాధారణమైన మహిళ. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కుదరని కుటుంబ నేపథ్యం. నెలలు నిండి మగపిల్లాడిని ప్రసవించింది. కానీ ఒక కేజీ రెండు వందల గ్రాముల బరువున్న బలహీనమైన బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ బిడ్డను బతికించుకునేదెలా అని మీనాతోపాటు ఆమె భర్త దేవీలాల్‌కి కూడా భయం పట్టుకుంది. స్థానిక వైద్యుని సలహాతో బిడ్డను తీసుకుని ఉదయ్‌పూర్‌కు పరుగులు పెట్టారు. ఉదయ్‌పూర్‌లోని మహారాణా భోపాల్ జనరల్ హాస్పిటల్లో వైద్యుని ముందు నిలబడి ఉన్నారు దంపతులిద్దరూ. బిడ్డను పరీక్షించిన డాక్టరు మీనా, దేవీలాల్ వైపు సాలోచనగా చూశాడు. పుట్టీ పుట్టగానే బిడ్డపై ఇన్ఫెక్షన్ దాడి చేసింది. దానికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాలి. ఆ చికిత్సను తట్టుకోవాలంటే ముందు బిడ్డ శక్తిని పుంజుకోవాలి. ఈ స్థితిలో బిడ్డను కాపాడగలిగింది తల్లి పాలలోని గ్రోత్ హార్మోన్స్ మాత్రమే. పోషకాహార లోపం కారణంగా మీనాకు పాలు పడలేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప తన బిడ్డ దక్కడని బిడ్డను ఒడిలో పెట్టుకుని కళ్లనీళ్ల పర్యంతమైంది మీనా. ఆ అద్భుతం తల్లి పాల బ్యాంకు రూపంలో ఉందని ధైర్యం చెప్పి నగరంలోని దివ్య మదర్ మిల్క్ బ్యాంకుకు సమాచారం అందించారు డాక్టర్. తమ బిడ్డల కడుపు నిండిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న పాలను పాలకు నోచుకోని బిడ్డలకు ఇచ్చే ప్రక్రియ ఇది. గత ఏడాది ఏప్రిల్‌లో ఉదయ్‌పూర్‌లోని ‘మా భగవతీ వికాస్ సంస్థాన్’ అనే ధార్మిక సంస్థ తల్లి పాల బ్యాంకును స్థాపించింది. ఇప్పటికి 660 మంది పాలిచ్చే తల్లులు పేరు నమోదు చేసుకున్నారు. వీరిచ్చే పాలతో ఉదయ్‌పూర్ హాస్పిటళ్లలోని నియో నేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న మీనా బిడ్డలాంటి 450 మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి. ఆరోగ్యవంతుడైన బిడ్డతో తమ ఊరికి బయలుదేరారు దేవీలాల్, మీనా దంపతులు. తమాషా ఏమిటంటే... తనకు ఇంకో బిడ్డ పుడితే. ఆ బిడ్డతో పాటు మరో బిడ్డకు కూడా పాలిస్తానని చెప్పింది మీనా. (ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవం )