సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో భక్తులు
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తజన జాతరను తలపించింది. కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ వేలాది వాహనాల్లో భక్తులు తరలి రావడంతో దేవస్థానం ఘాట్‌రోడ్లలో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 1.50 లక్షల మంది సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు.
భక్తుల రద్దీని తట్టుకోలేక ఒక దశలో రెండు గంటల పాటు వ్రతాల టికెట్ల విక్రయం నిలిపివేశారు. పశ్చిమ రాజగోపురం తలుపులు రెండు గంటలు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్లీ పశ్చిమ రాజగోపురం ద్వారా భక్తులను అనుమతించారు. వ్రతాల టికెట్లు విక్రయించారు. సాయంత్రం 5 గంటల సమయానికి సత్యదేవుని వ్రతాలు సుమారు 14 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment