ఇది ‘పెళ్లిళ్ల వెంకన్న’ గుడి పేచీ
అమలాపురం టౌన్ :అన్నవరం సత్యదేవుని ఆలయం తర్వాత జిల్లాలో అధిక సంఖ్యలో వివాహాలు జరిగేదిగా అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడి ప్రసిద్ధి గాంచింది. ‘పెళ్లిళ్ల వెంకన్న’గా పేరుగాంచిన ఈ దేవుడి గుడి కి కార్యనిర్వహణాధికారి (ఈఓ) నియమాకం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈఓ నియామకంపై భిన్నాభిప్రాయాలతో ఉండటంతో ఈ వ్యవహారం అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతల మధ్య భేదాభిప్రాయాలూ అనివార్యమవుతున్నాయి.
ఒకరు వద్దని.. మరొకరు కాదని..
ఈ గుడి ఈఓ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. కేవలం ఆలయ మేనేజర్‌తోనే ఈఓ బాధ్యతలను నిర్వర్తింపచేస్తున్నారు. ఈ ఆలయంలో ఏ అధికారి పనిచేసినా బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిందే. ఒక వర్గం నేతలు ఆలయంలో జరిగే అన్ని రకాల వేలంపాటలను వారే దక్కించుకుని ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. వారిని ఏ అధికారి వచ్చినా ఏమీ చేయలేకపోతున్నారు. మంత్రి రాజప్ప అనుచరుడైన టీడీపీ నాయకుడు కర్రి దత్తుడు ఆలయ ట్రస్టీ చైర్మన్ పదవిని ఆశించి మంత్రిని ప్రసన్నం చేసుకుని అందుకు లైన్‌క్లియర్ చేయించుకున్నారు. దత్తుడికి చైర్మన్ గిరీ ఇంకా అధికారికంగా ఇవ్వకపోయినా ఆయనే ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అంటూ హడావుడి చేస్తున్నారు.
కాగా అమలాపురం పట్టణ దేవత సుబ్బాలమ్మ ఆలయానికి స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలో మెయిన్‌రోడ్డు చెంత గల రూ.30 కోట్ల విలువైన భూములను కొందర రాజకీయ అండతో ఆక్రమించుకుని లీజుదారులమని చెప్పుకుంటూ ఆలయ ఆదాయాన్ని మింగేస్తున్నారు. ఆ ఆలయ ఈఓగా వచ్చిన సీహెచ్ వెంకటలక్ష్మి భూముల పరిరక్షణకు నడుం బిగించటంతో పాటు ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టి వారి పాలిట సింహస్వప్నమయ్యారు. అప్పట్లో ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆమె లెక్కచేయలేదు. ఆలయ భూములను రక్షించటంలో ధైర్యంగా వ్యవహరించిన వెంకటలక్ష్మిని వెంకటేశ్వరస్వామి ఆలయ ఈవోగా నియమిస్తే ఆ ఆలయం కూడా బాగుపడుతుందని నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు చెప్పడంతో ఆ పార్టీకి చెందిన దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు ఈఓ పని తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆమెను ఎఫ్ఏసీ ఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం రాజప్ప వర్గీయులైన కొందరు టీడీపీ నేతలకు రుచించలేదు. ముఖ్యంగా ఆలయ చైర్మన్ పదవిని ఆశిస్తున్న దత్తుడు ఆమె నియూమకాన్ని వ్యతిరేకించారు. ఆమెకు తలబిరుసని, చెప్పినమాట వినరని రాజప్పకు నూరిపోశారు.
లక్ష్మిని నియమిస్తే రూ. 2 కోట్ల విరాళం.. అజ్ఞాతభక్తుని ఆఫర్
వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయూలంటే నిజాయితీ గల అధికారి అవసరమని భావించిన పట్టణానికి చెందిన ధనవంతుడైన ఓ భక్తుడు లక్ష్మిని నియమిస్తే ఆలాయూనికి రూ.2 కోట్లు విరాళమివ్వడానికి ముందుకు వచ్చారు. ఆయన గతంలో తిరుపతి వెంకన్నకు రూ.7 కోట్ల విరాళాన్ని ఓ అజ్ఞాత భక్తునిగా అందించారు. దేవాదాయ శాఖలో ఎవరైనా దాతలు ఒక వంతు నిధులు విరాళంగా ఇస్తే రెండొంతులు సీజీఎఫ్ కింద దేవాదాయశాఖ సమకూరుస్తుంది. ఈ లెక్కన ఆ భక్తుడు ఇచ్చే రూ.2 కోట్లకు దేవాదాయశాఖ రూ.4కోట్లు జోడించి మొత్తం రూ.6కోట్లతో వెంకన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని స్థానికులు, కొందరు బీజేపీ నాయకులు మంత్రి మాణిక్యాలరావు దృష్టిలో పెట్టారు.
అప్పటికే ఆమెపై సానుకూల నివేదిక ఉండటంతో మంత్రి అంగీకరించి ఈఓగా నియమించారు. లక్ష్మి 15 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించేందుకు వెళితే అక్కడి రాజకీయ నాయకులు కొందరు అడ్డుకున్నారు. ఆమె నియూమకానికి ససేమిరా అంటూ, తద్వారా అజ్ఞాత భక్తుడు ఇచ్చే రూ.2 కోట్ల విరాళాన్ని మోకాలడ్డారు. కాగా ఈఓగా లక్ష్మి వస్తే ఆలయంలో కొన్ని అనుచిత వ్యవహారాలకు అడ్డుకట్ట వేస్తుందని కొందరు భయపడుతున్నారని, వారే మంత్రి రాజప్పను ఈ విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు టీడీపీ నాయకులే బాహాటంగా అంటున్నారు. అరుుతే ఆమె నియూమకాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఆరునూరైనా రానివ్వబోమంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార, మిత్రపక్షాల మంత్రులలో ఎవరిది పైచేరుు అవుతుందో వేచి చూడాల్సిందే.