యథా నేత... తథా మేత | Corruption of Government Officials in TDP Government East Godavari | Sakshi
Sakshi News home page

యథా నేత... తథా మేత

Published Sun, Aug 25 2019 8:51 AM | Last Updated on Sun, Aug 25 2019 8:55 AM

Corruption of Government Officials in TDP Government East Godavari - Sakshi

‘యథారాజా తథా ప్రజా’ అని ఊరకే అనలేదు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ అధినేత నుంచి కింది స్థాయి వరకు ‘అవినీతి మా జన్మహక్క’న్నట్టుగా చెలరేగిపోయారు. ఇందుకు దేవస్థానాలనూ మినహాయించలేదు. పాపభీతిని పక్కన పెట్టేసి పైసాయే పరమాత్మంటూ చెట్టాపట్టాలేసుకుంటూ చేతివాటాలకు దిగారు. ‘వడ్డించేవాడు మనోడైతే భయమెందు’లకనే ధీమాతో కోట్ల రూపాయలు వెనకేసుకోడానికి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పరుగులు తీశారు. వచ్చే సర్కారు తమదే అనే అహంకారంతో ఆ అవినీతిని మరింత విస్తరింపజేసే క్రమంలో వారి అంచనాలను  తలకిందులు చేస్తూ వైఎస్సార్‌సీపీ సర్కారు అధికారం చేపట్టడంతో ‘పచ్చ’ తిమింగలాల పరిస్థితి గందరగోళంగా మారింది.

సాక్షి, రాజమహేంద్రవరం : అవినీతి రహిత పాలనే ప్రధాన అజెండాగా నడుస్తున్న వైఎస్సార్‌సీపీ సర్కారు గత ప్రభుత్వంలో అవినీతిపరులపై దృష్టిని సారించింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితోపాటు జిల్లా మంత్రులు కూడా ఇదే బాట పడుతున్నట్టు ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశం ద్వారా ప్రత్యక్షంగానే హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లాలో పలు ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ కూడా ముగిసిన ఇద్దరిపై వేటు వేయడానికి రంగం సిద్ధమయింది. ఉన్నతాధికారుల ముందుకు వెళ్లిన తొలి జాబితాలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కొత్తపల్లి వీర్రాజు, అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న పీఆర్‌ఓ తులా రాము ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలను ప్రసన్నం చేసుకుని వీరిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ప్రభుత్వం మారినా పాత పంథా వీడకపోవడంతో వీరిద్దరిపై నిర్వహించిన విచారణ పూర్తయింది. దీంతో చర్యలకు సిఫార్సు చేస్తూ మూడు రోజుల కిందటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి.

ప్రిన్సిపాల్‌ వేధింపుల పర్వం...
రాజమహేంద్రవరం జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కొత్తపల్లి వీర్రాజుపై మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపుల వ్యవహారంపై విచారణ మొదలు పెడితే చివరకు కాలేజీలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ‘తీగ లాగితే డొంక కదిలినట్లుగా తవ్వేకొద్దీ అవకతవకల పుట్ట బయటపడిందని సమాచారం. కాలేజీలో పనిచేస్తున్న 17 మంది మహిళా అధ్యాపకులు పనిచేసే ప్రాంతంలో మానసిక వేధింపులపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడం, అధ్యాపకులు తమ గోడు స్త్రీ, శిశు సంక్షేమం, విద్యాశాఖా మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో తీవ్రంగా పరిగణించారు.

దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నగేష్‌కుమార్‌ కళాశాలలో విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. అధ్యాపకుల వేధింపులే కాకుండా కళాశాలలో పలు అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గడచిన మూడున్నరేళ్లుగా అరాచకాలు చేస్తున్నా సంబంధితాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ఫీజుల్లో రాయితీలు ఇవ్వకుండా అక్రమ వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్‌ ధర కంటే అదనంగా యూనిఫారాలు విక్రయించడంలోనే పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని నిగ్గు తేలిందని సమాచారం. కళాశాల రికార్డులను సీజ్‌ చేసి విచారణ అధికారులు వారి వెంట తీసుకువెళ్లారు. ఇది చదవండి : మహిళా అధ్యాపకులపై ప్రిన్సిపల్‌ వేధింపులు

మాయమైన రంగూన్‌ కలప...
బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన భవనంలో కలపను కూడా ప్రిన్సిపాల్‌ హయాంలో మాయమైందని గుర్తించారు. ఇది ఒకప్పుడు ప్రిన్సిపాల్‌ కార్యాలయంగా వినియోగించే వారు. ఈ భవనాన్ని రంగూన్‌ కలపతో 10 గదులతో నిర్మించారు. ఈ భవనం అంతా పూర్తిగా ఖరీదైన కలపతో నిర్మించినదే. ఉడెన్‌ స్టైర్‌కేస్, టేకుతో తయారుచేసిన పైకప్పుతో పాతబడి పోయిన ఈ భవనాన్ని నేలమట్టం చేసేసి అందులో కలప ఏంచేశారో తెలియని పరిస్థితి. ఎంత తక్కువ లెక్కలేసినా రూ.50 లక్షలు పైమాటేనంటున్నారు. కలపతోపాటు కళాశాల ఆవరణలో ఉన్న పెద్ద, పెద్ద చెట్లను కూడా విక్రయించి సొమ్ము జేబులో వేసుకున్నారని విచారణలో నిగ్గు తేలిందని సమాచారం. విచారణ ఎంతవరకూ వచ్చిందనే అంశంపై రాజమహేంద్రవరం ఆర్‌జేడీ నగేష్‌కుమార్‌ను సంప్రదించగా అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందచేశామన్నారు. ఇంతకుమించి తాము మాట్లాడలేమని, నిర్ణయం ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు.

భగవంతుని సన్నిధిలో...
దాదాపు ఇదే పరిస్థితి అన్నవరం సత్యదేవుని దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తులా రాము వ్యవహారం అని చెప్పుకోవచ్చు. సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగా ఉద్యోగం పొందడం, డిస్మిస్‌ అయి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే రెండు పదోన్నతులు పొందడం, సత్యదేవుని సన్నిధిలో అన్నింటా పెత్తనం చెలాయిస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా మెట్ట ప్రాంత ఎమ్మెల్యేల అండదండలతో అనేక అవకతవకలు, ఇష్టానుసారం కొండపై పెత్తనం చెలాయించారని ఎమ్మెల్యే పర్వత సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

సీఎం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు దేవదాయశాఖ కమిషనర్‌ మన్మోహన్‌సింగ్‌ను ఆదేశించారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ వేండ్ర త్రినాథ్‌  సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగా పోస్టింగ్, రెండు పదోన్నతులకు సంబంధించి కాగితపూర్వక ఆధారాలు, రికార్డులు, పలువురు ఈఓలు, అధికారులను రాజకీయ పలుకుబడితో పెత్తనం చెలాయించే వ్యవహారశైలిపై స్థానికులు, ఉద్యోగుల అభిప్రాయాలతో దేవదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు రెండు, మూడు రోజుల్లో చర్యలు వెల్లడించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement