principal harassments
-
ప్రిన్సిపాల్ వేధింపులు.. ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
సాక్షి, చెన్నై: ప్రధానోపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కామాక్షి అమ్మన్ గార్డన్‌కు చెందిన నాగేశ్వరి(56) గుడియాత్తం నెల్లూరు పేటలోని ప్రభుత్వ పాఠశాలలో టైలరింగ్ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమె కుమారుడు విఘ్నేష్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం నాగేశ్వరి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కుమారుడు విఘ్నేష్ గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాల హెచ్ఎం తన తల్లి నాగేశ్వరిని టైలరింగ్ శిక్షణకు అనుమతి ఇవ్వకుండా వేధించేవాడని, ప్రతి రోజూ గ్రంథాలయ భవనంలో విధులు నిర్వహించాలని ఆదేశించేవాడని పేర్కొన్నారు. తరచూ అసభ్య పదజాలంతో దూషించేవాడని, ఈ నేపథ్యంలో ఆనారోగ్యం కారణంగా తన తల్లి 12 రోజుల పాటు మెడికల్ సెలవు పెట్టిందని ఫిర్యాదులో వెల్లడించారు. రెండు రోజుల క్రితం మెడికల్ సర్టిఫికెట్తో పాఠశాలకు వెళ్లగా హెచ్ఎం తన గదిలో గంట పాటు దూషించి వేధింపులకు గురి చేశాడని, మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాడానికి కూడా నిరాకరించి ఇంటికి పంపి వేశాడని ఆరోపించారు. ఆ మనోవేదనతో తన తల్లి నాగేశ్వరి ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
యథా నేత... తథా మేత
‘యథారాజా తథా ప్రజా’ అని ఊరకే అనలేదు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ అధినేత నుంచి కింది స్థాయి వరకు ‘అవినీతి మా జన్మహక్క’న్నట్టుగా చెలరేగిపోయారు. ఇందుకు దేవస్థానాలనూ మినహాయించలేదు. పాపభీతిని పక్కన పెట్టేసి పైసాయే పరమాత్మంటూ చెట్టాపట్టాలేసుకుంటూ చేతివాటాలకు దిగారు. ‘వడ్డించేవాడు మనోడైతే భయమెందు’లకనే ధీమాతో కోట్ల రూపాయలు వెనకేసుకోడానికి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పరుగులు తీశారు. వచ్చే సర్కారు తమదే అనే అహంకారంతో ఆ అవినీతిని మరింత విస్తరింపజేసే క్రమంలో వారి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్సార్సీపీ సర్కారు అధికారం చేపట్టడంతో ‘పచ్చ’ తిమింగలాల పరిస్థితి గందరగోళంగా మారింది. సాక్షి, రాజమహేంద్రవరం : అవినీతి రహిత పాలనే ప్రధాన అజెండాగా నడుస్తున్న వైఎస్సార్సీపీ సర్కారు గత ప్రభుత్వంలో అవినీతిపరులపై దృష్టిని సారించింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితోపాటు జిల్లా మంత్రులు కూడా ఇదే బాట పడుతున్నట్టు ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశం ద్వారా ప్రత్యక్షంగానే హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లాలో పలు ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ కూడా ముగిసిన ఇద్దరిపై వేటు వేయడానికి రంగం సిద్ధమయింది. ఉన్నతాధికారుల ముందుకు వెళ్లిన తొలి జాబితాలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు, అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న పీఆర్ఓ తులా రాము ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలను ప్రసన్నం చేసుకుని వీరిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ప్రభుత్వం మారినా పాత పంథా వీడకపోవడంతో వీరిద్దరిపై నిర్వహించిన విచారణ పూర్తయింది. దీంతో చర్యలకు సిఫార్సు చేస్తూ మూడు రోజుల కిందటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. ప్రిన్సిపాల్ వేధింపుల పర్వం... రాజమహేంద్రవరం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపుల వ్యవహారంపై విచారణ మొదలు పెడితే చివరకు కాలేజీలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ‘తీగ లాగితే డొంక కదిలినట్లుగా తవ్వేకొద్దీ అవకతవకల పుట్ట బయటపడిందని సమాచారం. కాలేజీలో పనిచేస్తున్న 17 మంది మహిళా అధ్యాపకులు పనిచేసే ప్రాంతంలో మానసిక వేధింపులపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడం, అధ్యాపకులు తమ గోడు స్త్రీ, శిశు సంక్షేమం, విద్యాశాఖా మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో తీవ్రంగా పరిగణించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ డైరెక్టర్ నగేష్‌కుమార్ కళాశాలలో విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. అధ్యాపకుల వేధింపులే కాకుండా కళాశాలలో పలు అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గడచిన మూడున్నరేళ్లుగా అరాచకాలు చేస్తున్నా సంబంధితాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ఫీజుల్లో రాయితీలు ఇవ్వకుండా అక్రమ వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ ధర కంటే అదనంగా యూనిఫారాలు విక్రయించడంలోనే పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని నిగ్గు తేలిందని సమాచారం. కళాశాల రికార్డులను సీజ్ చేసి విచారణ అధికారులు వారి వెంట తీసుకువెళ్లారు. ఇది చదవండి : మహిళా అధ్యాపకులపై ప్రిన్సిపల్ వేధింపులు మాయమైన రంగూన్ కలప... బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనంలో కలపను కూడా ప్రిన్సిపాల్ హయాంలో మాయమైందని గుర్తించారు. ఇది ఒకప్పుడు ప్రిన్సిపాల్ కార్యాలయంగా వినియోగించే వారు. ఈ భవనాన్ని రంగూన్ కలపతో 10 గదులతో నిర్మించారు. ఈ భవనం అంతా పూర్తిగా ఖరీదైన కలపతో నిర్మించినదే. ఉడెన్ స్టైర్‌కేస్, టేకుతో తయారుచేసిన పైకప్పుతో పాతబడి పోయిన ఈ భవనాన్ని నేలమట్టం చేసేసి అందులో కలప ఏంచేశారో తెలియని పరిస్థితి. ఎంత తక్కువ లెక్కలేసినా రూ.50 లక్షలు పైమాటేనంటున్నారు. కలపతోపాటు కళాశాల ఆవరణలో ఉన్న పెద్ద, పెద్ద చెట్లను కూడా విక్రయించి సొమ్ము జేబులో వేసుకున్నారని విచారణలో నిగ్గు తేలిందని సమాచారం. విచారణ ఎంతవరకూ వచ్చిందనే అంశంపై రాజమహేంద్రవరం ఆర్జేడీ నగేష్‌కుమార్‌ను సంప్రదించగా అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందచేశామన్నారు. ఇంతకుమించి తాము మాట్లాడలేమని, నిర్ణయం ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. భగవంతుని సన్నిధిలో... దాదాపు ఇదే పరిస్థితి అన్నవరం సత్యదేవుని దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తులా రాము వ్యవహారం అని చెప్పుకోవచ్చు. సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగా ఉద్యోగం పొందడం, డిస్మిస్ అయి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే రెండు పదోన్నతులు పొందడం, సత్యదేవుని సన్నిధిలో అన్నింటా పెత్తనం చెలాయిస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా మెట్ట ప్రాంత ఎమ్మెల్యేల అండదండలతో అనేక అవకతవకలు, ఇష్టానుసారం కొండపై పెత్తనం చెలాయించారని ఎమ్మెల్యే పర్వత సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు దేవదాయశాఖ కమిషనర్ మన్మోహన్సింగ్ను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రీజినల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథ్ సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగా పోస్టింగ్, రెండు పదోన్నతులకు సంబంధించి కాగితపూర్వక ఆధారాలు, రికార్డులు, పలువురు ఈఓలు, అధికారులను రాజకీయ పలుకుబడితో పెత్తనం చెలాయించే వ్యవహారశైలిపై స్థానికులు, ఉద్యోగుల అభిప్రాయాలతో దేవదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు రెండు, మూడు రోజుల్లో చర్యలు వెల్లడించనున్నారు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న ప్రిన్సి‘ఫ్రాడ్’
సాక్షి, రాజమహేంద్రవరం : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై ఉచ్చు బిగుస్తోంది. కళాశాలలో వేధింపులకు గురి చేస్తున్న ఆయనపై మహిళా అధ్యాపకులు రెండున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం చివరి దశకు చేరుకుంది. ప్రిన్సిపాల్ వ్యవహార శైలి, అవకతవకలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు, ఉన్నతాధికారులకు బాధితులు చేసిన ఫిర్యాదులను తనకున్న రాజకీయ పలుకుబడితో బుట్టదాఖలు చేయించి ఇన్నాళ్లూ ఆయన బయటపడుతూ వచ్చారు. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు, మార్కెట్‌లోకంటే ఎక్కువ ధరకు యూనిఫాం విక్రయాలు తదితర అవకతవకలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో రాష్ట ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరెక్టర్ గోవిందరావు ఆదేశాల మేరకు శనివారం రీజనల్ జాయింట్ డైరెక్టర్ నగేష్‌కుమార్ విచారణ నిర్వహించారు. కాలేజీ క్యాంపస్‌లోని సెమినార్ హాలులో నాలుగు గోడల మధ్య గోప్యంగా జరిపిన విచారణలో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌తోపాటు సుమారు 48 మంది బోధన, బోధనేతర సిబ్బంది హాజరయ్యారు. మొబైల్ ఫోన్లను హాలులోకి అనుమతించలేదు. విచారణలో ప్రతి ఒక్కరికీ 14 అంశాలతో కూడిన ప్రశ్నావళిని అందజేసి బాధితులతో వ్యక్తిగతంగా పూర్తి చేసి ఇచ్చిన పత్రాలను ఆర్జేడీ రికార్డు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 8 గంటలపాటు సాగింది. తొలుత బోధన, బోధనేతర సిబ్బందిని విచారించిన ఆర్జేడీ తరువాత అధిక ఫీజులు, యూనిఫారంల విక్రయాలపై విద్యార్థులను విచారించారు. ఇదీ ప్రశ్నావళి ప్రిన్సిపాల్ వేధింపులపై 17 మంది మహిళా అధ్యాపక బాధితులు తమకు ఇచ్చిన ప్రశ్నావళిలో పూసగుచ్చినట్టు రాసి ఇచ్చారని తెలిసింది. కాంట్రాక్ట్ లెక్చరర్ ఉదయశాంతిని ప్రిన్సిపాల్ దూషించినపుడు స్వయంగా మీరు ఎలా చూశారు, అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీ ఇవ్వకుండా ఫీజులు వసూలు చేశారా, పేరెంట్స్ ,టీచర్స్ అసోసియేషన్ పేరుతో రూ.100 వంతున వసూలు చేశారా, ఉదయశాంతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఆమెకు అండగా ఉన్నారా, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందస్తు అనుమతి ఏమైనా తీసుకున్నారా, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారా, మీరంతా ఫిర్యాదులు చేశాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారా, ఉదయశాంతి అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు వెళ్లడం చూశారా, ప్రిన్సిపాల్‌పై వచ్చిన అభియోగాలు నిజమని నమ్ముతున్నారా...ఇలా 14 అంశాలతో ప్రశ్నావళి అందజేసి సమాధానాలు లిఖితపూర్వకంగా తీసుకొని రికార్డు చేశారు. బోధనేతర సిబ్బందిలో కొందరు మినహాయించి బోధనా సిబ్బంది సహా దాదాపు మూడొంతులు మంది ప్రిన్సిపాల్ వేధింపులతో కాలేజీలో పనిచేసే వాతావరణం లేకుండా పోయిందని వాంగ్మూలమిచ్చారు. ప్రిన్సిపాల్ వీర్రాజు అరుపులు, కేకలు విని పరుగున వెళ్లేసరికి ఉదయశాంతి వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారని మహిళా అధ్యాపకులు ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు కమిషనర్ వరకూ వెళ్లినా న్యాయం జరగకపోగా, ప్రిన్సిపాల్ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మరింత ఎక్కువైపోయాయని చెప్పుకున్నారు. సహచర అధ్యాపకురాలు కావడంతోనే ఆమెకు మద్దతుగా నిలిచామని తెలియజేశారు. కుటుంబ సభ్యులు వెంట రాగా ఉదయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తాము కూడా వెళ్లిన మాట వాస్తవమేనని అధ్యాపకులు ధైర్యంగా చెప్పారు. పిల్లలకు పాలు ఇచ్చేందుకు వెళతామన్నా, తమ అంగాంగాలను ప్రస్తావిస్తూ అసభ్యంగా మాట్లాడడం, చివరకు తమ నడకపై కూడా కామెంట్లు చేయడం, సెలవులు అడిగినప్పుడు వెకిలి మాటలతో మానసికంగా వేధించేవారని మహిళా అధ్యాపకులు ఆర్జేడీ నగేష్‌కుమార్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థుల ఫీజుల్లో అవినీతి నిజమే విద్యార్థుల ఫీజులు అధికంగా వసూలు చేయడం వాస్తవమేనని మెజార్టీ అధ్యాపకులు కుండబద్దలు కొట్టారు. అధిక ఫీజులు వసూలు చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాయితీలు ఇవ్వకపోవడం, ఒకరి రశీదుపై ముగ్గురు, నలుగురు నుంచి ఫీజులు వసూలు చేయడం నిజమేనని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన రశీదులను విచారణాధికారికి అందజేశారని సమాచారం. వీటిని రికార్డుల్లో సరిచూడగా అవకతవకలు వాస్తవమేనని తేల్చి విచారణ సందర్భంలోనే అప్పటికప్పుడు ప్రిన్సిపాల్ వీర్రాజుకు ‘మెమో’ కూడా ఇచ్చారని తెలిసింది. విచారణ జరుగుతుండగా పలువురు విద్యార్థులు ఆర్జేడీ వద్దకు వెళ్లి కళాశాల భవనాలకు పెయిటింగ్‌లు, కరెంటు, శ్లాబ్‌లు కూలగొట్టే పనులు నెల రోజులపాటు చేయించుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన విషయంపై ఆర్జేడీ ప్రశ్నించగా అప్పటికప్పుడు ఇద్దరు విద్యార్థులకు (ఒకరికి రూ.2,500లు, మరొకరికి రూ.1500) ప్రిన్సిపాల్ ఇచ్చారని తెలిసింది. విషయం బయటకు పొక్కడంతో సుమారు 30 మంది విద్యార్థులు మూకుమ్మడిగా వెళ్లి తమతో కూడా పనులు చేయించుకున్నారని, పైసా ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆర్జేడీ నగేష్‌కుమార్‌ను ‘సాక్షి ప్రతినిధి’ సంప్రదించగా విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. బాధితులందరి నుంచీ వ్యక్తిగతంగా వివరాలు సేకరించామని చెప్పారు. విచారణ అంశాలను రెండు రోజుల్లో పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆర్జేడీ చెప్పారు. -
అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..
సాక్షి, పరవాడ(పెందుర్తి): ‘మేడం..మీరు ఇకపై ఎవరికీ నాపై ఫిర్యాదులు చేయనక్కరలేదు..నేను చనిపోతున్నాను’‘నాకు కళాశాలలో జరుగుతున్న అవమానాల వల్ల అమ్మానాన్న చాలా బాధపడుతున్నారు. వారి బాధను నేను చూడలేకపోతున్నాను..నేను చనిపోతాను’ అంటూ తన వాట్సాప్ స్టేటస్‌లో పేర్కొంటూ ఓ గెస్ట్ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పనిచేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది వేదింపులు తాళలేకే ఊపిరి తీసుకునేందుకు సిద్ధమయ్యానని చెబుతోంది..పరవాడ మండలంలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరవాడ మండలం వాడచీపురపల్లికి చెందిన మొల్లి అప్పలరాజు కుమార్తె రమ్య ఎమ్మెస్సీ కెమిస్ట్రీ వరకు చదువుకుంది. ఉపాధి నిమిత్తం పరవాడ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావ్ పూలే గురుకుల కళాశాలలో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తోంది. గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్న వారిని ఏటా(నిబంధనల ప్రకారం 11 నెలలు మాత్రమే వీరు కొనసాగుతారు) కొత్తగా నియమించుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా తిరిగి గెస్ట్ టీచర్‌గా రమ్యకు అవకాశం దక్కింది. అయితే కళాశాలలో పనిచేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ నాగమణి, ఇతర సిబ్బంది రమ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రిన్సిపాల్‌కు నూరిపోసేవారు.ఈ మాటలను ఇటీవలే కళాశాల ప్రిన్సిపాల్‌గా వచ్చిన శివరాం నమ్మి తరచూ రమ్యను మాటలతో వేదించేవాడు. విద్యార్థులు, తోటి సిబ్బంది, గ్రామస్తుల సమక్షంలో సూటిపోటి మాటలు అనేవారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమ్య శనివారం అర్ధరాత్రి తన సెల్‌పోన్ వాట్సాప్ స్టేటస్‌లో తాను పడుతున్న బాధలను పెట్టింది. అనంతరం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటికి కుటుంబసభ్యులు గమనించి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమ్యకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పరవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. మరోవైపు ఇదే కళాశాల ఆవరణలో ఉన్న పాఠశాలలో పనిచేస్తున్న మరో గెస్ట్ టీచర్ కూడా సిబ్బందిపై పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ప్రిన్సిపల్ వేధింపులు భరించలేకున్నాం
నెల్లూరు(అర్బన్): సీతారామపురం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సీహెచ్.హర్షిత వేధింపులు భరించలేకున్నామంటూ పలువురు బాలికలు తమ వార్డెన్‌తో కలిసి సోమవారం కలెక్టరేట్లోని జేసీ వెట్రి సెల్వికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు కాస్మోటిక్స్ చార్జీలు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఫ్యాషన్ డిజైన్, యానిమేషన్‌కు సంబంధించిన టూర్ నగదును కూడా తినేసిందని తెలిపారు. యూనిఫాం కోసం తాము ప్రిన్సిపల్‌కు నగదు చెల్లించామన్నారు. అయినా యూనిఫాం ఇచ్చే ఏర్పాట్లు చేయలేదన్నారు. ఈ విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే అమ్మాయిలమని కూడా చూడకుండా అబ్బాయిల ముందే కొడుతుందని వాపోయారు. తాము పట్టీలు వేసుకున్నా.. వేలికి రింగ్ పెట్టుకున్నా.. తలపై పూలు పెట్టుకున్నా.. మంచి బట్టలు వేసుకున్నా ఓర్చు కోలేదని, ఎవరి కోసం మంటూ మాటలతో వేధిస్తుందన్నారు. తమ ప్రిన్సిపల్‌ను మార్చాలని కోరారు. లేదంటే తమకు చదువు మానేయక తప్పదన్నారు. దీనికి స్పందించిన జేసీ వెట్రి సెల్వి విచారించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. వార్డెన్ ఎం.సుచరిత వెంట అమూల్య, రాజి, శ్రీలేఖ పలువురు విద్యార్థినిలు పాల్గొన్నారు. -
ప్రిన్సిపల్ వేధింపులు: ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం తాళ్ళమాడలోని గురుకులంలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు యత్నించింది. సునీత అనే మహిళ గురుకులంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నది. అయితే ఆమెను ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న రమేష్ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
ప్రిన్సిపల్ వేధింపుల వల్లే..
హైదరాబాద్: మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ డాక్టర్ కమలాదేవి వేధింపుల వల్లే రెండు రోజుల క్రితం కళాశాల లెక్చరర్ అర్జున్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని.. వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.