అన్నవరం: పెద్ద నోట్లు రద్దయ్యి.. నేటికి ఏడాది పూర్తయినా అన్నవరం దేవస్థానంలోని పలు హుండీల్లో ఆ నోట్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో భక్తుల వద్ద నుంచి రద్దయిన పెద్ద నోట్లను అన్నవరం దేవస్థానం స్వీకరించింది. జనవరి 2017 నుంచి తీసుకోలేదు. అయితే భక్తులు మాత్రం ఈ నోట్లను హుండీల్లో వేశారు, వేస్తూనే ఉన్నారు. మంగళవారం స్వామివారి హుండీలను తెరవగా వాటిలో పాత రూ.500 నోట్లు 61, రూ.వేయి నోట్లు 55 వచ్చాయి. దీంతో 11 నెలల్లో హుండీల్లో వచ్చిన ఈ నోట్లు మొత్తం రూ.10,76,000కి చేరింది. హుండీల ద్వారా వచ్చిన పాత రూ.500, రూ.వేయి నోట్లను ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీలోకి మార్పిడి చేసేందుకు గత మార్చి నెలలో రిజర్వ్ బ్యాంక్ అధికారులను దేవస్థానం అధికారులు కలిశారు.
అయితే రిజర్వ్ బ్యాంక్ అందుకు నిరాకరించింది. పైగా ఈ నోట్లు దేవస్థానం వద్ద కూడా ఉండకూడదని వెంటనే వాటిని తమ వద్ద డిపాజిట్ చేయాలని కూడా తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి వచ్చిన ఈ నోట్లను దేవస్థానం లాకర్‌లో భద్రపరుస్తున్నారు. ఈ నోట్లను ఏమి చేయాలో చెప్పాలని దేవాదాయశాఖ కమిషనర్ దేవస్థానం అధికారులు కోరారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తామని దేవస్థానం అధికారులు మంగళవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment